మమ్మల్ని గెలిపిస్తే 5 వేల డాలర్లు… అమెరికన్ ఓటర్లకు ట్రంప్ ఎన్నికల తాయిలం…!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. నేరుగా తమ పౌరులకు ఎన్నికల తాయిలం ప్రకటించారు. నవంబర్ నెలలో జరిగే మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే.. ప్రతీ వయోజన అమెరికన్ కు 5 వేల డాలర్లు ఇస్తామని ప్రకటించారు. ఈ మొత్తాన్ని ‘ట్రంప్ డివిడెండ్’గా పిలుస్తామని చెప్పారు.డల్లాస్‌లో జరిగిన రిపబ్లికన్ పార్టీ సమావేశంలో ట్రంప్(Donald Trump) ఈ ప్రకటన చేశారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయకపోయినా.. తనను బ్యాలెట్‌పై ఉన్నట్టుగా భావించి పార్టీకి ఓటేయాలని మద్దతుదారులను కోరారు. ‘‘రిపబ్లికన్లు గెలిస్తే.. మీరూ గెలిచినట్లే. మీకు 5,000 డాలర్లు వస్తాయి’’ అని చెప్పారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని.. దేశం సాధించిన విజయాల్లో ప్రజలకు వాటా కల్పించడమే ఈ పథకం ఉద్దేశమని చెప్పారు. అయితే ఈ నగదును అమెరికాలోనే ఖర్చు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.ఈ పథకానికి కనీసం 1 ట్రిలియన్ డాలర్లు అవసరమయ్యే అవకాశం ఉంది. ఇంత భారీ మొత్తాన్ని ఎక్కడ నుంచి సమకూరుస్తారన్నది ట్రంప్ స్పష్టం చేయలేదు. ‘‘మన దేశం చాలా డబ్బు సంపాదిస్తోంది’’ అని మాత్రమే చెప్పారు. ఆర్థికంగా, రాజకీయంగా ఈ ప్రతిపాదన అమలు చేయడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికాలో దాదాపు 24 నుంచి 27 కోట్ల మంది వయోజనులు ఉన్నట్లు అంచనా. అందరికీ 5000 డాలర్లు చెల్లిస్తే ప్రభుత్వ లోటు, ద్రవ్యోల్బణంపై ప్రభావం ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. ఎన్నికలకు ముందు ట్రంప్ ఇచ్చిన ఈ హామీపై అమెరికాలో రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఇంత భారీ మొత్తం ఇవ్వడంపై ఆర్థిక నిపుణులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మధ్యంతర ఎన్నికల్లో (Midterm Elections) ఓటర్లను ఆకర్షించేందుకే ట్రంప్ ఈ హామీ ఇచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇటీవలి సర్వేల్లో ట్రంప్ ప్రజాదరణ 30 శాతం స్థాయిలోనే ఉంది. ధరల పెరుగుదల, ఇరాన్‌పై అమెరికా చేపట్టిన యుద్ధంపై ఓటర్లలో అసంతృప్తి పెరుగుతోంది. డెమొక్రాట్లు ప్రతినిధుల సభలో 230-205 సీట్లతో, సెనేట్‌లో 51-49 ఆధిక్యంతో గెలిచే అవకాశం ఉందని ‘డెసిషన్ డెస్క్ హెచ్‌క్యూ’ అంచనా వేసింది.
మరోవైపు.. ఇరాన్ తో యుద్ధం ….అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిందని ట్రంప్ పరోక్షంగా అంగీకరించారు. ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేసేందుకు రెండు, మూడు వారాల దూరంలో ఉందని.. అందుకే యుద్ధానికి దిగాల్సి వచ్చిందని చెప్పారు.యుద్ధం త్వరలో ముగుస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యూహాత్మకంగా కీలకమైన హర్మూజ్ జలసంధికి తన పేరు పెట్టాలని సూచించారు. యుద్ధం ముగిసిన వెంటనే చమురు ధరలు తగ్గుతాయని చెప్పారు.







