2021 తర్వాత మళ్లీ 2026 లో బ్రిక్స్ ఆతిథ్యంలో భారత్
న్యూఢిల్లీ : 18 వ బ్రిక్స్ దేశాధినేతల సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. సెప్టెంబర్ 12,13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ సదస్సు జరగనుంది. బ్రిక్స్ సభ్య దేశాలతో పాటు భాగస్వామ్య దేశాలు, ఆహ్వానిత దేశాల ప్రతినిధులు కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ మేరకు కార్యక్రమ షెడ్యూల్ ను భారత విదేశాంగ శాఖ విడుదల చేసింది.
బ్రిక్స్ అంటే ఏమిటి?
బ్రిక్స్ అంటే గ్లోబల్ సౌత్ దేశాల మధ్య రాజకీయ, దౌత్య, ఆర్థిక సహకారం కోసం ఏర్పడిన అంతర్జాతీయ సమన్వయ వేదిక. దీనికి ప్రత్యేక రాజ్యాంగ ఒప్పందం, సొంత బడ్జెట్ అంటూ వుండవు. బ్రిక్స్ సహకారం ప్రధానంగా మూడు విభాగాల చుట్టూ వుంటుంది. రాజకీయ, భద్రతా సహకారం, ఆర్థిక, ఆర్థిక రంగ సహకారం, సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాల మధ్య వుంటుంది.
ఇందులో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, సౌదీ, యునైటెడ్ అరబ్ ఏమిరెట్స్ సభ్య దేశాలుగా వున్నాయి.
బ్రిక్స్ అధ్యక్షత అనేది భారత్ కి ఎందుకు కీలకం?
2026 జనవరి 1 నుంచి భారత్ బ్రిక్స్ బాధ్యతలను తీసుకుంది. ఇలా అధ్యక్షత వహించడం నాలుగో సారి. అంటే 2012,2016, 2021 లో ఈ బాధ్యతలు భారత్ నిర్వహించింది. భారత్ అధ్యక్షతన 2026 లో బ్రిక్స్ సహకారంలోని రాజకీయ భద్రత, ఆర్థిక సాంస్కృతిక ప్రజల మధ్య సంబంధాలకు సంబంధించిన అంశాలపై దృష్టి నిలిపారు.
ఈ సారి మాత్రం Building for resilience, innovation, cooperation and sustainbility అనే థీమ్ ను బ్రిక్స్ ఎంచుకుంది. సదస్సుకు ముందు భారత్ లోని 25 నగరాల్లో 3540 కి పైగా సమావేశాలు, ఉన్నత స్థాయి చర్చలను కేంద్రం నిర్వహించింది. సెప్టెంబర్ 12,13 తేదీల్లో జరిగే సమావేశాలు చివరి ఘట్టంగా నిలవనున్నాయి.
బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో భారత ప్రభుత్వం, భారత భద్రతా బలగాలు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఈ సదస్సు సమయంలో అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు, ఢిల్లీ విమానాశ్రయ నిర్వాహక సంస్థ (DIAL) పలు కఠినమైన చర్యలను అమలు చేస్తోంది.
తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన 500 సీసీటీవీ కెమెరాల సహాయంతో, భద్రతా ఏర్పాట్లను సీసీటీవీ కంట్రోల్ రూమ్ పర్యవేక్షిస్తుంది. ఈ కంట్రోల్ రూమ్ పరిధిలో న్యూఢిల్లీ జిల్లాలోని కీలకమైన రహదారులలో సగం భాగం, అలాగే విదేశీ అతిథులు బస చేయనున్న ఆబ్రే హోటల్ మరియు తాజ్ మాన్ సింగ్ హోటల్ వంటి ప్రాంతాలు ఉంటాయి.
సమగ్ర భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ బలగాలు, ఎన్ఎస్జి (NSG) మరియు ఇతర ఏజెన్సీలకు చెందిన సుమారు 7,000 మంది సిబ్బందిని మోహరించారు. అలాగే వివిధ ప్రాంతాలలో ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ బలగాలు, ఎన్ఎస్జి, ఇంటెలిజెన్స్ బ్యూరో మరియు ఎస్పిజి (SPG) సిబ్బందితో కూడిన బహుళ అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.








