పదేళ్లలో మానవాళి అంతం తథ్యం..? నిపుణులను భయపెడుతున్న ఏజీఐ..!
ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికపరంగా చాలా మార్పులొచ్చాయి. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తోంది. ఎక్కడ చూసినా ఏఐ ప్రముఖ పాత్ర పోషిస్తోంది.. ఏరంగంలో చూసినా ఏఐ వినియోగం పెరుగుతూవస్తోంది. ఇది ప్రస్తుతం బాగానే ఉన్నా.. ఇది మానవాళి మనుగడనే ప్రమాదంలో పడేస్తోందని ఏఐ రంగంలో విశేష అనుభవజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తర్వాత మనం వాటిని ఆపలేమని హెచ్చరిస్తున్నారు.
ఏఐ ప్రపంచంలో పనిచేస్తున్న 27 ఏళ్ల పరిశోధకుడు జాకబ్ కాక్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంథ్రోపిక్‌లో మూడేళ్ల పనిచేసిన తర్వాత ఆయన రాజీనామా చేశారు. అనంతరం ‘ఎక్స్’ వేదికగా ఏఐ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ సంస్థలు ప్రమాదాలను గుర్తిస్తున్నా.. పోటీలో వెనుకబడిపోతామనే భయంతో ముందుకు వెళ్తున్నాయని ఆరోపించారు.‘‘మన జీవితాలతో జూదమాడుతున్నారు’’ అంటూ ఏఐ సంస్థలపై తీవ్ర ఆరోపణలు చేశారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ.. మనుషులందరినీ చంపగల ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్‌గా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అది వచ్చే పదేళ్లలోనే జరగొచ్చని ఆయన అంచనా వేశారు.
మస్క్ ది ఇదే అభిప్రాయం..
ఇది కాక్సన్ ఒక్కడి అభిప్రాయం కాదు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చాలాకాలంగా ఇదే ప్రమాదాన్ని ప్రస్తావిస్తున్నారు. మనుషుల కంటే ఎన్నో రెట్లు తెలివైన ఏఐను నియంత్రించడం కష్టమవుతుందని హెచ్చరిస్తున్నారు. విద్యుత్ గ్రిడ్లను హ్యాక్ చేయడం, నీటి సరఫరాలను నిలిపివేయడం, ప్రమాదకర జీవ ఆయుధాల రూపకల్పనకు ఏఐను ఉపయోగించడం వంటి ముప్పుల్ని ఆయన ప్రస్తావించారు.
అయితే ఈ హెచ్చరికలు సాధారణ ఏఐ గురించి కాదు. మనిషి చేసే దాదాపు అన్ని మేధో పనులను చేయగల ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) గురించి. ఈ విషయం మస్క్‌కు ప్రత్యేకంగా కీలకం. ఎందుకంటే ఆయన ఏఐ రంగంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు ఆటోమేటిక్ కార్ల సాంకేతికతలోనూ ముందున్నారు.
ఆంథ్రోపిక్ అలైన్మెంట్ సైన్స్ లీడ్ ఇవాన్ హ్యూబింగర్ కూడా కాక్సన్ వ్యాఖ్యలను సమర్థించారు. భవిష్యత్తులో ఏఐ మానవాళిని అంతం చేసే అవకాశం ఉందని తాము నిజంగానే భావిస్తున్నామని చెప్పారు. వచ్చే పదేళ్లలో ఆ ప్రమాదం 10 శాతానికి మించి ఉంటుందని తన వ్యక్తిగత అంచనా అని తెలిపారు.
ప్రస్తుతం ఉన్న ఏఐ మోడళ్లతో ప్రమాదం తక్కువేనని హ్యూబింగర్ స్పష్టం చేశారు. అయితే ఏఐ తన సామర్థ్యాలను తానే పెంచుకునే స్థాయికి చేరితే పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారొచ్చని హెచ్చరించారు. సూపర్ ఇంటెలిజెన్స్ కోసం అలైన్మెంట్ సమస్యకు పరిష్కారం చూపే స్పష్టమైన ప్రణాళిక తమ వద్ద ఇంకా లేదని అంగీకరించారు.








