‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్
▪️ విద్యార్థులపై విద్యా ఒత్తిడి.. మానసిక సమస్యలు, ఆత్మహత్యల నివారణే చిత్ర ప్రధానాంశం
హైదరాబాద్: శ్రీ వాత్సల్య ఆడియో అండ్ వీడియో ఇల్లస్ట్రేషన్స్ పతాకంపై రూపొందిన తొలి చిత్రం ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్ విడుదల వేడుక హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం చాంబర్ ప్రీవ్యూ హాల్లో ఘనంగా జరిగింది. చిత్ర రచయిత, దర్శకుడు, నిర్మాత స్వామి శ్రీవాత్సల్య ధర్మ వీర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ, ఆధ్యాత్మిక ప్రముఖులు పాల్గొన్నారు.
స్వామి శ్రీవాత్సల్య ధర్మ వీర మాట్లాడుతూ.. గత 26 సంవత్సరాలుగా తిరువన్నామలైలో వైదిక ధర్మశాస్త్రాలను అధ్యయనం చేసిన తాను, నేటి యువతలో నైతిక విలువలు, మానవతా దృక్పథాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినట్లు తెలిపారు. ‘జై గౌరీపుత్ర గణేశా’ ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులు, సమాజం ఆలోచించాల్సిన అంశాలను తెరపైకి తీసుకొచ్చామని చెప్పారు. తమ సంస్థ ద్వారా భవిష్యత్తులోనూ సందేశాత్మక, సామాజిక, ఆధ్యాత్మిక చిత్రాలను నిర్మిస్తామని వెల్లడించారు.
తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. సమాజానికి మంచి సందేశాన్ని అందించే చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని అన్నారు. ప్రస్తుత విద్యా వ్యవస్థలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని, అలాంటి అంశాన్ని సినిమాగా తెరకెక్కించడం అభినందనీయమని పేర్కొన్నారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
జాయింట్ సెక్రెటరీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. సినిమా కేవలం వినోదానికే పరిమితం కాకుండా సమాజంలో మార్పుకు దోహదపడాలని అన్నారు. పిల్లలపై తల్లిదండ్రులు, విద్యాసంస్థల నుంచి పెరుగుతున్న ఒత్తిడి ఆందోళన కలిగించే అంశమని, భారతీయ జీవన విధానంలోని విలువలను పరిచయం చేసే ఈ చిత్రం ప్రేక్షకులకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నటుడు ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. నేటి యువత ఎదుర్కొంటున్న సమస్యలను సామాజిక, ఆధ్యాత్మిక కోణాల్లో ఆవిష్కరించేందుకు ఈ చిత్రం చేసిన ప్రయత్నం ప్రత్యేకమైనదన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నైతిక విలువలు పెంపొందించేందుకు ఇటువంటి సినిమాలు అవసరమని తెలిపారు.
సరస్వతి ఉపాసకులు శ్రీ దైవజ్ఞ శర్మ మాట్లాడుతూ.. విద్య, జ్ఞానం, సంస్కారం మనిషి జీవితానికి పునాదులని అన్నారు. భారతీయ వైదిక సంప్రదాయంలోని జీవన విలువలను ఆధునిక తరానికి అర్థమయ్యే రీతిలో అందించేందుకు ఈ చిత్రం చేస్తున్న ప్రయత్నం ప్రశంసనీయమన్నారు. చిత్రానికి ప్రేక్షకుల ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు.
విద్యార్థుల మానసిక ఒత్తిడిపై కథనం
నేటి విద్యా విధానంలో విద్యార్థులపై పెరుగుతున్న తీవ్రమైన ఒత్తిడి, దాని కారణంగా ఎదురవుతున్న మానసిక సమస్యలు, ఆత్మహత్యల నివారణను ప్రధాన ఇతివృత్తంగా చేసుకుని ‘జై గౌరీపుత్ర గణేశా’ చిత్రాన్ని రూపొందించారు. క్లాస్‌రూమ్‌లు, హోమ్‌వర్క్‌లు, మార్కుల పోటీతో పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం దెబ్బతింటున్న పరిస్థితుల్లో.. భారతీయ వైదిక జీవన సంస్కృతి, ఆచార వ్యవహారాలు, కుటుంబ విలువల ద్వారా మానవ సంబంధాలను, ఉన్నత వ్యక్తిత్వాన్ని ఎలా పెంపొందించుకోవచ్చో హేతుబద్ధంగా చూపించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.








