అత్యంత కీలక ప్రకటన చేసిన అమిత్ షా… ఎన్డీయే భాగస్వాములు కలిసి వస్తాయా?
ముంబై: ఉమ్మడి పౌరస్మృతి (UCC) విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. 2029 లోక్ సభ ఎన్నికలకు ముందే దేశ వ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో దీనిని అమలు చేస్తామని అత్యంత కీలక ప్రకటన చేశారు. ముంబైలో ‘సేవా సంకల్ప అభియాన్’ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు.
తాము అనేక రాష్ట్రాల్లో ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెట్టామని, 2029 నాటికి ఎన్డీయే అధికారంలో వున్న మొత్తం 21 రాష్ట్రాల్లో యూసీసీని కూడా అమలు చేస్తామన్న నమ్మకం తమకు వుందన్నారు.
ప్రస్తుతం, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మహారాష్ట్ర, బీహార్ మరియు ఉత్తరప్రదేశ్‌లతో సహా 19 రాష్ట్రాలు మరియు రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ (NDA) అధికారంలో ఉంది. ఉత్తరాఖండ్, గుజరాత్ మరియు అస్సాం రాష్ట్రాలు ఇప్పటికే ఉమ్మడి పౌర స్మృతిని (UCC) అమలు చేయగా, మధ్యప్రదేశ్ దీనికి సంబంధించిన ముసాయిదాను రూపొందించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
అయితే.. కొన్ని రాష్ట్రాల్లో కూటమిగా బీజేపీ అధికారంలో వుంది. ఉదాహరణకు ఏపీని తీసుకుందాం. ఇక్కడ తెలుగుదేశం, జనసేనతో కలిసి కూటమిగా బీజేపీ అధికారాన్ని పంచుకుంటోంది. అలాగే బిహార్ లో కూడా. అయితే. ప్రాంతీయ పార్టీలు లౌకికత్వం అన్న ఎజెండాతో ముందుకు సాగుతున్నాయి. యూసీసీ విషయంలో బీజేపీకి ఆ పార్టీలు కలిసొస్తాయా? లేదా.. మెలిక పెడతాయా? అన్నది చూడాలి.








