యాంటీబయాటిక్ వేసుకుంటున్నారా? ఈ పొరపాట్లు పొరపాటున చెయ్యకండి!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
జ్వరం వచ్చింది. లేదా గొంతు నొప్పి మొదలైంది. డాక్టర్ దగ్గరకు వెళ్తే యాంటీబయాటిక్ రాసిచ్చారు. మెడికల్ షాప్‌కి వెళ్లి మందులు తెచ్చుకుని, ఇంటికి రాగానే ఆ టాబ్లెట్ వేసేసుకుంటాం. నిజానికి అక్కడితో మన పని అయిపోయిందనుకుంటాం. కానీ యాంటీబయాటిక్ విషయంలో అసలు జాగ్రత్త అక్కడి నుంచే మొదలవుతుంది. రోజుకు ఎన్ని మాత్రలు వేసుకోవాలనే దానికంటే కూడా, వాటిని ఎలా, ఎప్పుడు, దేనితో వేసుకుంటున్నామనేది చాలా ముఖ్యం. మనం తెలిసి,తెలియక చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఆ మందు పనిచేయకుండా చేయడమే కాకుండా, శరీరానికి ఇతర ఇబ్బందులను కూడా తీసుకురావచ్చు.
‘రోజుకు మూడుసార్లు’ అంటే మనం అనుకునే టైమింగ్స్ కాదు!
ప్రిస్క్రిప్షన్పై “రోజుకు మూడుసార్లు” అని చూడగానే ఉదయం టిఫిన్ తర్వాత, మధ్యాహ్నం భోజనం చేశాక, రాత్రి తిన్నాక వేసుకుంటే సరిపోతుందని చాలామంది అనుకుంటారు. కానీ ప్రతి 8 గంటలకు ఒకసారి మందు వేసుకోవాలని డాక్టర్ చెప్పినప్పుడు, నిజంగానే ఆ డోసుల మధ్య సరిగ్గా ఎనిమిది గంటల సమయం ఉండేలా చూసుకోవాలి.
యాంటీబయాటిక్స్ మన రక్తంలో నిరంతరం ఒకే స్థాయిలో ఉంటేనే క్రిములపై సమర్థవంతంగా పోరాడాలి. అందుకే మన సౌకర్యాన్ని బట్టి భోజన సమయాలకు మందులను వేసుకోకుండా, డోసుల మధ్య సరిగ్గా ఎంత వ్యవధి ఉండాలో డాక్టర్ లేదా ఫార్మసిస్ట్‌ను అడిగి తెలుసుకోవడం చాలా అవసరం.
ఒక డోస్ మర్చిపోయాం… ఇప్పుడు ఏం చేయాలి?
మనందరికీ ఎప్పుడో ఒకసారి ఇలా జరుగుతుంది. ఉదయం హడావుడిలో మందు మర్చిపోతాం. మధ్యాహ్నం ఏదో పని చేస్తుండగా గుర్తొస్తుంది. అప్పుడు “అయ్యో, ఇప్పుడే వేసేసుకుందాం” అనిపిస్తుంది. ఇంకొంతమంది అయితే “తదుపరి డోస్ కూడా దగ్గర్లోనే ఉంది కదా, రెండూ కలిపి వేసుకుందాం” అనుకునే అవకాశం ఉంటుంది.
కానీ ఇక్కడే మనకు మనం నిర్ణయం తీసుకోకుండా ఉండటం మంచిది. ఎందుకంటే మిస్ అయిన డోస్ విషయంలో అన్ని యాంటీబయాటిక్స్‌కు ఒకే నియమం ఉండదు. కొన్ని మందులను గుర్తొచ్చిన వెంటనే తీసుకోవాల్సి ఉండొచ్చు. మరికొన్ని మందుల్లో తదుపరి డోస్ సమయం దగ్గరగా ఉంటే మిస్ అయిన మాత్రను వదిలేయాల్సి రావచ్చు.
అందుకే మందు మొదలుపెట్టే ముందే డాక్టర్‌ను ఒక చిన్న ప్రశ్న అడిగేయండి: “ఒక డోస్ మర్చిపోతే ఏం చేయాలి?” రాత్రి ఆలస్యంగా గుర్తొచ్చినప్పుడు గూగుల్‌లో వెతుక్కోవడం కంటే, ముందే సమాధానం తెలుసుకోవడం చాలా సులభం.
రెండు రోజులు వాడగానే తగ్గలేదని మందులు మార్చేస్తున్నారా?
మందులు వాడటం మొదలుపెట్టిన రెండు మూడు రోజుల్లోనే నెమ్మదిగా ఫలితం కనిపిస్తుంది. అయితే మరి కొందరికి అసలు తగ్గినట్లు కనపడదు. ఫలితం కనిపించింది కదా అని కోర్స్ ఎలా ఆపకూడదో..తగ్గకపోవడంతో వెంటనే కంగారుపడిపోయి, “ఈ మందు పనిచేయడం లేదు” అని స్వయంగా వేరే మందులకు మారిపోవటం కూడా పెద్ద సమస్యలకు దారి తీస్తాయి.
రెండు రోజులకే ప్రభావం కనిపించకపోతే, అసలు ఆ సమస్యకు యాంటీబయాటిక్స్ అవసరమా లేదా వేరే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అనేది డాక్టర్ మాత్రమే నిర్ధారించగలరు. కాబట్టి మీ అంతట మీరు కోర్సును ఆపడం కానీ, మందులు మార్చడం కానీ చేయకూడదు.
అలాగే కొందరు…కొనటం ఎందుకు అని, పాతవి ఇంట్లో మిగిలి ఉన్న యాంటీబయాటిక్స్ వేసుకుంటారు. ఇది చాలా ప్రమాదకరమైన అలవాటు.
మాత్ర వేసుకున్నాం… నీళ్లు మాత్రం ఒక్క గుటకేనా?
చాలామందికి ఇది చాలా చిన్న విషయం. మాత్ర నోట్లో వేసుకుని, పక్కనే ఉన్న గ్లాసులోంచి ఒక్క గుటక నీళ్లు తాగేస్తే అయిపోయిందనుకుంటాం. కానీ కొన్ని యాంటీబయాటిక్స్‌ను తగినంత నీటితో తీసుకోవడం ముఖ్యం.
నీరు మందు జీర్ణవ్యవస్థలో సరిగ్గా కదలడానికి, కొన్ని మందులు శరీరంలో సరిగ్గా శోషించబడటానికి సహాయపడుతుంది. కడుపులో మంట, వికారం వంటి అసౌకర్యాలు కూడా కొంత తగ్గవచ్చు. కొన్ని మందులకు అయితే పూర్తిగా ఒక గ్లాసు నీరు అవసరం కావచ్చు.
కాబట్టి యాంటీబయాటిక్ తీసుకునేటప్పుడు “మాత్ర మింగేశామా?” అన్నదానికంటే, “దాన్ని తగినంత నీళ్లతో తీసుకున్నామా?” అన్నది కూడా చూసుకోవాలి.
పాలతో మందులు వేసుకుంటున్నారా? జాగ్రత్త!
మందు మింగిన తర్వాత కడుపులో మంట రాకుండా ఉంటుందని చాలామంది పాలు తాగుతుంటారు. కానీ టెట్రాసైక్లిన్ వంటి కొన్ని రకాల యాంటీబయాటిక్స్ తీసుకునేటప్పుడు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.
పాలలో ఉండే కాల్షియంతో ఈ మందు రసాయనికంగా కలిసిపోయి, మన శరీరం మందును సరిగ్గా పీల్చుకోకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల ఎంత మంచి మందు వేసుకున్నా ఫలితం ఉండదు.
అందుకే మీకు ఇచ్చిన యాంటీబయాటిక్ విషయంలో “ఈ మందుతో ఏమైనా ఆహార పదార్థాలు దూరంగా ఉంచాలా?” అని అడగడం చాలా మంచిది. ముఖ్యంగా మందును ఖాళీ కడుపుతో తీసుకోవాలని చెప్పారంటే ఆ సూచనను లైట్‌గా తీసుకోవద్దు.
అలాగే మాత్ర మింగడం కష్టంగా ఉందని దాన్ని సగానికి విరగ్గొట్టడం లేదా పొడి చేసి తాగడం కూడా చేయకూడదు. అలా చేస్తే మందు శరీరంలో కరిగే విధానం మారిపోతుంది. అలాగే మాత్ర మింగడం నిజంగా కష్టంగా ఉంటే మాత్రం పరిష్కారం ఉంది. మీకు ఇచ్చిన యాంటీబయాటిక్ లిక్విడ్ లేదా నమిలే రూపంలో అందుబాటులో ఉందా అని డాక్టర్ లేదా ఫార్మసిస్ట్‌ను అడగవచ్చు. అంటే మాత్ర మింగడం కష్టమైతే మందును మార్చడం కాదు… ముందుగా దాని మరో రూపం ఉందేమో తెలుసుకోవడం.
యాంటీబయాటిక్‌తో మంచి బ్యాక్టీరియా కూడా పోతాయా?
యాంటీబయాటిక్ అంటే మనకు హాని చేసే బ్యాక్టీరియాతో పోరాడే మందు. కానీ సమస్య ఏంటంటే, అది మన శరీరానికి ఉపయోగపడే కొన్ని బ్యాక్టీరియాలపై కూడా ప్రభావం చూపవచ్చు.
మన పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి కీలకం. యాంటీబయాటిక్ కోర్స్ సమయంలో ఈ బ్యాక్టీరియా సమతుల్యత మారితే కొందరికి కడుపు సంబంధిత ఇబ్బందులు రావచ్చు.
అందుకే కొంతమందికి డాక్టర్ ప్రోబయోటిక్ ఉన్న పెరుగు వంటి ఆహారాన్ని తీసుకోవాలని లేదా ప్రోబయోటిక్ సప్లిమెంట్ గురించి సూచించవచ్చు. అయితే మీకు అది అవసరమా, ఏ రూపంలో తీసుకోవాలి అన్నది డాక్టర్‌ను అడిగి తెలుసుకోవడం మంచిది.
అన్నింటికంటే ముందు అడగాల్సిన ప్రశ్న ఒక్కటే…
యాంటీబయాటిక్ ప్రిస్క్రిప్షన్ చేతిలోకి వచ్చినప్పుడు మనం సాధారణంగా అడిగేది “రోజుకు ఎన్ని మాత్రలు?” కానీ అంతకంటే ముందు అడగాల్సిన ప్రశ్న ఒకటి ఉంది. “నాకు ఈ యాంటీబయాటిక్ ఎందుకు అవసరం?”
ఎందుకంటే ప్రతి జ్వరం, ప్రతి గొంతు నొప్పి, ప్రతి జలుబు లేదా ప్రతి ఇన్ఫెక్షన్కు యాంటీబయాటిక్ అవసరం ఉండదు. కొన్ని సైనస్, చెవి, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లలో వెంటనే యాంటీబయాటిక్ మొదలుపెట్టకుండా కొంతకాలం పరిస్థితిని గమనించడం సరైన విధానం కావచ్చు.
కాబట్టి డాక్టర్‌ను ప్రశ్నించడం అంటే ఆయన ఇచ్చిన మందుపై అనుమానం పెట్టడం కాదు. మనకు ఇస్తున్న మందు ఎందుకు అవసరమో అర్థం చేసుకోవడం.
మందు పేరు మాత్రమే కాదు… దాన్ని ఎలా తీసుకోవాలో కూడా తెలుసుకోండి.








