‘డిజిటల్ ఫ్రాంకెన్‌స్టీన్’తో జాగ్రత్త.. మీ డేటాతో నకిలీ మనిషిని సృష్టించి మోసం!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ఫ్రాంకెన్‌స్టీన్ పేరు వినగానే మనకు ఒక భయంకరమైన మనిషి రూపం గుర్తొస్తుంది. కుట్లుతో ఉన్న ముఖం.. వింత ఆకారం.. భయపెట్టే రూపం. సినిమాలు, టీవీ కథలు ఈ ఇమేజ్ను మన మనసుల్లో బలంగా నాటేశాయి. అయితే అసలు కథలో ఒక చిన్న మెలిక ఉంది.
ఫ్రాంకెన్‌స్టీన్ అనేది ఆ భయంకరమైన జీవి పేరు కాదు. 1818లో మేరీ షెల్లీ రాసిన Frankenstein; or, The Modern Prometheus నవలలో విక్టర్ ఫ్రాంకెన్‌స్టీన్ అనే శాస్త్రవేత్త ఉంటాడు. జీవితం, మరణం గురించి ప్రయోగాలు చేస్తూ.. వేర్వేరు మానవ శరీర భాగాలను కలిపి ఒక కొత్త జీవిని సృష్టిస్తాడు. సహజంగా పుట్టిన మనిషి కాదు అతను. వేర్వేరు ముక్కలను కలిపి తయారు చేసిన జీవి.
ఇప్పుడు దాదాపు 200 ఏళ్ల తర్వాత.. టెక్నాలజీ ప్రపంచంలో అదే ఆలోచన మరో రూపంలో కనిపిస్తోంది.
ఈసారి శరీర భాగాలను కాదు.. వ్యక్తిగత డేటా ముక్కలను కలిపి ఒక ‘మనిషిని’ తయారు చేస్తున్నారు. అతడినే సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు “డిజిటల్ ఫ్రాంకెన్‌స్టీన్” అంటున్నారు.
అసలు ఈ ‘డిజిటల్ మనిషి’ ఎవరు?
అతను నిజమైన వ్యక్తి కాదు. అతనికి తల్లిదండ్రులు ఉండరు.ఇంటి ఎడ్రస్ ఉండదు. నిజ జీవితంలో అతడిని ఎవరూ చూసి ఉండకపోవచ్చు. కానీ ఇంటర్నెట్ ప్రపంచంలో మాత్రం అతనికి అన్నీ ఉంటాయి.
ఒక పేరు. ఒక చిరునామా. ఒక ముఖం. ఒక సెల్ఫీ. ఒక గొంతు. గుర్తింపు వివరాలు. అవసరం అనుకుంటే గుర్తింపు పత్రాలు కూడా. ఇవన్నీ ఒక్కచోట నుంచి వచ్చినవి కావు. వేర్వేరు డేటా ముక్కలను కలిపి, వాటిలో కొన్నింటిని AIతో సృష్టించి, ఒక కొత్త వ్యక్తిత్వాన్ని తయారు చేస్తారు.
దీనినే Synthetic Identity అంటారు. ఉదాహరణకు.. ఎక్కడో లీక్ అయిన నిజమైన వ్యక్తిగత సమాచారం ఒక ముక్క దొరికింది. దానికి AIతో తయారు చేసిన పేరు, చిరునామా, ముఖం జోడించారు. డీప్‌ఫేక్ సెల్ఫీ తయారు చేశారు. అవసరమైతే గొంతును కూడా క్లోన్ చేశారు.
ఇలా చూస్తే..ఒక నిజమైన మనిషి డేటాలోని కొన్ని ముక్కలు + AI సృష్టించిన నకిలీ వివరాలు = కొత్త డిజిటల్ వ్యక్తి. అందుకే ‘డిజిటల్ ఫ్రాంకెన్‌స్టీన్’.
మరి ఈ నకిలీ మనిషితో ఏం చేస్తారు?
ఒకసారి ఈ ఫేక్ ఐడెంటిటీ రెడీ అయితే .. దాన్ని ఏదో సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్ పెట్టడానికి ఉపయోగించరు. దాని అసలు లక్ష్యం డబ్బు, ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశం.
ఉదాహరణకు ఈ నకిలీ వ్యక్తి పేరుతో బ్యాంకు ఖాతా తెరవడానికి ప్రయత్నించవచ్చు. క్రిప్టో ఎక్స్ఛేంజ్లో ఖాతా సృష్టించవచ్చు. ఇతర ఆర్థిక సేవలకు దరఖాస్తు చేయవచ్చు.
ఇక్కడ KYC కీలకం.
బ్యాంకు లేదా ఆన్లైన్ సేవ.. “ఈ వ్యక్తి నిజమేనా?” అని తనిఖీ చేస్తుంది. ముఖం, ఫొటో, గుర్తింపు పత్రం వంటి వివరాలను ఆటోమేటెడ్ సిస్టమ్ పరిశీలిస్తుంది. నకిలీ గుర్తింపు ఆ తనిఖీలను మోసం చేయగలిగితే.. అసలు లేని వ్యక్తి పేరుతో నిజమైన ఖాతా వచ్చేస్తుంది.
అకౌంట్ వచ్చాక ఏం చేస్తారు?
ఒక మోసగాడు ఆ నకిలీ ఖాతాను తన నిజమైన గుర్తింపును దాచడానికి ఉపయోగించవచ్చు. ఒక వ్యక్తిని ఫిషింగ్, నకిలీ ఇన్వెస్ట్మెంట్ లేదా ఇతర ఆన్లైన్ మోసాల ద్వారా డబ్బు పంపించేలా చేశాడనుకుందాం. ఆ డబ్బు నేరుగా మోసగాడి అసలు ఖాతాలోకి వస్తే.. దాని వెనుక ఉన్న వ్యక్తిని గుర్తించడం కొంత సులభం కావచ్చు. అందుకే మధ్యలో నకిలీ గుర్తింపుతో తెరిచిన ఖాతాను ఉపయోగించే అవకాశం ఉంటుంది.
బాధితుడి డబ్బు ముందుగా ఆ ఖాతాలోకి రావచ్చు. అక్కడి నుంచి మరో ఖాతాకు తరలించవచ్చు. ఇలా డబ్బు అనేక ఖాతాల మధ్య తిరిగితే.. అసలు మోసగాడు ఎవరు, డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లింది అన్నది గుర్తించడం మరింత కష్టమవుతుంది. ఇలాంటి ఖాతాలు క్రెడిట్ కార్డులు, రుణాలు లేదా ఇతర ఆర్థిక సేవలను పొందేందుకు కూడా దుర్వినియోగం కావచ్చు.
మొదట చిన్న లావాదేవీలతో ఆ ఖాతాకు ఒక సాధారణ ఆర్థిక చరిత్ర ఉన్నట్టుగా కనిపించేలా చేసి, తర్వాత పెద్ద మొత్తంలో క్రెడిట్ పొందేందుకు ప్రయత్నించే అవకాశం ఉంటుంది.
అంటే..
ముందు మనిషిని తయారు చేస్తారు. తర్వాత ఆ మనిషికి ఆర్థిక గుర్తింపును తయారు చేస్తారు. చివరికి ఆ గుర్తింపును మోసాలకు ఉపయోగిస్తారు.
ఈ ‘డిజిటల్ ఫ్రాంకెన్‌స్టీన్’ ధర ఎంత?
డార్క్‌వెబ్‌లో ఇలాంటి సేవలకు మార్కెట్ ఉంది. Coveron, NordLayer Intelligence పరిశోధకులు డార్క్‌వెబ్ ఫోరమ్‌లు, టెలిగ్రామ్ ఛానళ్లలోని 3.62 లక్షలకు పైగా పోస్టులను పరిశీలించారు. ఐడెంటిటీ మోసం, డీప్‌ఫేక్ సేవలు, సింథటిక్ ఐడెంటిటీ తయారీకి సంబంధించిన చర్చలను విశ్లేషించారు.
వారి పరిశోధన ప్రకారం, గత ఏడాది కాలంలో 10 వేలకు పైగా పోస్టుల్లో పూర్తి గుర్తింపు డేటా, డీప్‌ఫేక్ సెల్ఫీలు, సరిపోలే పత్రాలతో కూడిన ప్యాకేజీలు ఆఫర్ చేసినట్లు గుర్తించారు.
ధర?
సుమారు $200. అంటే భారత కరెన్సీలో దాదాపు ₹17 వేలు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే.. మొత్తం ప్యాకేజీ కొనాల్సిన అవసరం కూడా లేదు. డీప్‌ఫేక్ సెల్ఫీ లేదా క్లోన్ చేసిన గొంతు వంటి ఒక్కో భాగాన్ని $10కే అందించే ఆఫర్లు కూడా ఉన్నాయి.
అంటే ఒకప్పుడు ఖరీదైన, క్లిష్టమైన సైబర్‌క్రైమ్ సాధనాలు ఇప్పుడు చిన్న చిన్న ‘సేవలుగా’ విడిపోయి అమ్ముడవుతున్నాయి.
2026లో ఎందుకు ఒక్కసారిగా పెరిగింది?
డీప్‌ఫేక్‌లకు సంబంధించిన పోస్టులు 2024 మొదటి త్రైమాసికంలో నెలకు సగటున సుమారు 40 ఉండేవి. 2025లో పెద్దగా మార్పు కనిపించలేదు. అయితే 2026లో సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. నెలవారీ సగటు సుమారు 255 పోస్టులకు చేరింది. రెండో త్రైమాసికంలో అది 307 పోస్టులకు పెరిగింది. అంటే 2024 ప్రారంభంతో పోలిస్తే దాదాపు ఎనిమిది రెట్లు పెరుగుదల.
AI మరింత సులభంగా అందుబాటులోకి రావడం దీనికి ఒక కారణం. ముఖాలు సృష్టించడం, ఫొటోలు మార్చడం, వీడియోలు తయారు చేయడం, గొంతులను అనుకరించడం వంటి పనులు గతంలో ప్రత్యేక నైపుణ్యం కోరేవి. ఇప్పుడు వాటిలో చాలా పనులను AI సాధనాలు స్పీడుగా చేయగలుగుతున్నాయి.
మనకు ప్రమాదం ఎక్కడ?
ఈ నకిలీ వ్యక్తిని తయారు చేయడానికి ఉపయోగించే ప్రతి సమాచారం నకిలీదే కావాల్సిన అవసరం లేదు. *కొంత సమాచారం నిజమైన వ్యక్తుల నుంచే రావచ్చు. మన పేరు, చిరునామా, పుట్టిన తేదీ లేదా ఇతర వ్యక్తిగత వివరాలు ఎక్కడైనా లీక్ అయితే.. వాటిలో కొంత భాగం మరో నకిలీ సమాచారంతో కలిపి కొత్త గుర్తింపును తయారు చేయడానికి ఉపయోగించే అవకాశం ఉంటుంది.
అందుకే వ్యక్తిగత డేటాను ఎక్కడ ఇస్తున్నామో జాగ్రత్తగా ఉండాలి. తెలియని వ్యక్తులు లేదా సంస్థలు అడిగే అసాధారణమైన ID వెరిఫికేషన్ అభ్యర్థనలను నమ్మకూడదు. డేటా బ్రీచ్ గురించి సమాచారం వస్తే వెంటనే స్పందించాలి. కొత్త క్రెడిట్ ఖాతాలు అవసరం లేనప్పుడు క్రెడిట్‌ను ఫ్రీజ్ చేయడం వంటి రక్షణ చర్యలు కూడా ఉపయోగపడవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.








