తెలంగాణ కాంగ్రెస్.. కొత్త ఇన్చార్జ్ ఎవరు?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి సంస్థాగత మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న మీనాక్షి నటరాజన్ త్వరలోనే ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఉన్నత చదువులకోసం విదేశాలకు వెళ్లాలని ఆమె నిర్ణయించుకోవడంతో, ఆమె స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగించేందుకు హైకమాండ్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
కొంతకాలంగా ఉన్నత విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో మీనాక్షి నటరాజన్ ఉన్నారు. ఇప్పటికే ఆమె విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువుకునేందుకు అప్లై చేసుకున్నట్టు సమాచారం. గతంలో కూడా ఆమె విదేశాల్లో చదువుకునేందుకు ప్రయత్నించారు. అయితే పార్టీ హైకమాండ్, రాహుల్ గాంధీ సూచనల మేరకు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. అయితే, ఉన్నత చదువుల కోసం వచ్చిన సువర్ణావకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేక ఆమె మరోసారి హైకమాండ్‌కు తన పరిస్థితిని వివరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె విదేశీ ప్రయాణానికి పార్టీ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరో రెండు నెలల పాటు ఆమె ఇంచార్జ్‌గా కొనసాగే అవకాశం ఉంది. ఈ లోపు ఆమె స్థానంలో పూర్తి స్థాయి బాద్యతలను మరొకరికి అప్పగించేందుకు హైకమాండ్ ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది.
మీనాక్షి నటరాజన్ స్థానంలో తెలంగాణ బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే దానిపై ఏఐసీసీ స్థాయిలో కసరత్తు ప్రారంభమైంది. ఈ పోస్టు కోసం పార్టీ హైకమాండ్ కొంతమంది సీనియర్ల పేర్లను పరిశీలిస్తోంది. ముఖ్యంగా దక్షిణాది రాజకీయాలపై పట్టున్న నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ రేసులో తమిళనాడుకు చెందిన ఇద్దరు కీలక నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తమిళనాడుతో పాటు జాతీయ స్థాయిలోనూ గుర్తింపు ఉన్న ఎంపీ ఒకరు ఈ రేసులో ముందున్నట్టు సమాచారం. అలాగే తమిళనాడుకు చెందిన మరో సీనియర్ నేత, మాజీ ఎంపీ చల్లకుమార్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.
మరోవైపు పార్టీలో సుదీర్ఘ అనుభవమున్న సీనియర్ నాయకుడు ముకుల్ వాస్నిక్ పేరు కూడా ప్రచారంలో ఉంది. తెలంగాణ కాంగ్రెస్‌లోని పలువురు సీనియర్ నాయకులతో ముకుల్ వాస్నిక్‌కు దశాబ్దాలుగా మంచి సంబంధాలున్నాయి. రాష్ట్రంలో పార్టీ అంతర్గత సమీకరణాలను చక్కదిద్దడంలో ఆయన అనుభవం ఉపయోగపడుతుందని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.








