ఎవరీ ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ 5..!?
ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ 5 తెలంగాణ పర్యటన రాష్ట్ర అభివృద్ధి ముఖచిత్రంలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. హైదరాబాద్ పర్యటనకు విచ్చేసిన ఆయనకు తెలంగాణ ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చారిత్రక ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లి ప్రిన్స్ రహీమ్‌తో సమావేశమయ్యారు. తెలంగాణను అంతర్జాతీయ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం నిర్వహించనున్న ‘తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. మరోవైపు, తెలంగాణ గవర్నర్ సైతం ఆగా ఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ (AKDN) అందిస్తున్న సేవలను కొనియాడుతూ, రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.5 కోట్ల మందికి పైగా ఉన్న షియా ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువుకు ఇచ్చే వంశపారంపర్య గౌరవ నామమే ‘ఆగా ఖాన్’. ప్రవక్త ముహమ్మద్ వారసత్వ పరంపరలో ఇస్మాయిలీ ఇమామ్‌ల నాయకత్వం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ 5 ఈ ప్రతిష్టాత్మక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ప్రపంచ వేదికలపై పేదరిక నిర్మూలన, విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, చారిత్రక కట్టడాల సంరక్షణలో తన వంశ ప్రతిష్టను చాటుతున్నారు.
ఆగా ఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ (AKDN) అనేది లాభాపేక్ష లేని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ అంతర్జాతీయ అభివృద్ధి సంస్థల్లో ఒకటి. మతం, కులం, జాతితో సంబంధం లేకుండా నిరుపేదలు, అణగారిన వర్గాల జీవన ప్రమాణాలను పెంచడమే దీని ప్రధాన లక్ష్యం. అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాలు, నాణ్యమైన ఆసుపత్రుల నిర్వహిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మైక్రోఫైనాన్స్, పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. ఆగా ఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ ద్వారా ప్రపంచ ప్రఖ్యాత చారిత్రక కట్టడాలు, హెరిటేజ్ ప్రదేశాల పునరుద్ధరణ చేపట్టింది.
హైదరాబాద్ నగరంతో ఈ సంస్థకు దశాబ్దాల బంధం ఉంది. కుతుబ్ షాహీ సమాధుల పునరుద్ధరణ ప్రాజెక్టును అత్యంత శాస్త్రీయంగా చేపట్టి, ప్రపంచ స్థాయి వారసత్వ సంపదగా తీర్చిదిద్దడంలో ఆగా ఖాన్ ట్రస్ట్ కీలక పాత్ర పోషించింది. అలాగే శంషాబాద్ సమీపంలో ఏర్పాటైన ‘ఆగా ఖాన్ అకాడమీ’ ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య అందుతోంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం సాంప్రదాయ పారిశ్రామిక అభివృద్ధి మాత్రమే కాకుండా సుస్థిర అభివృద్ధి, హెరిటేజ్ టూరిజం, సామాజిక మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో AKDNతో భాగస్వామ్యం రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందని భావిస్తోంది. ఆగా ఖాన్ సంస్థలతో అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, పరస్పర సహకార వేదికలు ‘తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు అంతర్జాతీయ విశ్వసనీయతను తెస్తాయి. హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడాల పరిరక్షణ, మూసీ నది పునరుజ్జీవనం, అర్బన్ ప్లానింగ్ వంటి ప్రాజెక్టుల్లో AKDN అనుభవాన్ని ప్రభుత్వం వినియోగించుకోవచ్చు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన, నాణ్యమైన విద్య, ఆరోగ్య రంగాల్లో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాలకు ఇది బాటలు వేస్తుంది. వాతావరణ మార్పులను తట్టుకునే సుస్థిర పట్టణాభివృద్ధి విధానాల్లో సాంకేతిక సహకారం లభిస్తుంది. అందుకే ఆగాఖాన్ ఫౌండేషన్ తో తెలంగాణ బలమైన బంధాన్ని కోరుకుంటోంది.








