కొనబోయే భూమి వివాదాల్లో ఉందా? లేదా?.. ఈ డాక్యుమెంట్స్ చెక్ చేస్తే తెలిసిపోతుంది!
భూములు కొనడం నేడు అత్యవసరం అయ్యింది. అది మార్కెట్ లో ముడిపడి వున్నందున, బిజినెస్ తో ముడిపడి వుండటం, లాభాలు రావడం వల్ల చాలా మంది భూములు కొనేస్తున్నారు. రియలెస్టేట్ గా కూడా మారిపోయింది. అయితే.. మనం కొన్న భూమి వివాదాల్లో వుందో? లేదో? తెలుసుకోవాలి. లేదంటే తర్వాత అనేక రకాల చిక్కులు, కేసులు వచ్చి పడిపోతాయి. ఈ నేపథ్యంలో దీని కోసం కొన్ని డాక్యుమెంట్లను మనం కచ్చితంగా చూసుకోవాలి.
టైటిల్ డీడ్, ECతో ఆస్తి చరిత్రను చెక్ చేయండి

Sale Deed / Title Deed ద్వారా ప్రస్తుత యజమానికి ఆ భూమి ఎలా వచ్చిందో తెలిపే గత 30 నుంచి 40 సంవత్సరాల చరిత్రను పరిశీలించాలి. మ్యుటేషన్ రికార్డులు, గిఫ్ట్ డీడ్ లేదా వారసత్వ పత్రాలు కూడా చెక్ చేయాలి. లింక్ డాక్యుమెంట్లలో ఎక్కడైనా తేడాలు ఉంటే భవిష్యత్తులో వివాదాలకు దారి తీసే అవకాశం ఉంటుంది.
అలాగే Encumbrance Certificate (EC) కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి గత 30 ఏళ్ల EC తీసుకుని, ఆస్తిపై బ్యాంక్ లోన్లు, కోర్టు స్టేలు, తాకట్టు (Mortgage), మూడో వ్యక్తికి అమ్మకపు ఒప్పందాలు (Agreement of Sale) ఉన్నాయా అనేది పరిశీలించాలి.
భూమి రికార్డులు, నిషేధిత జాబితాను పరిశీలించండి

తెలంగాణలో అయితే ధరణి పోర్టల్, ఏపీలో అయితే మీ భూమి వెబ్సైట్ ద్వారా భూమి ప్రస్తుతం ఎవరి ఆధీనంలో (Possession) ఉంది, సాగులో ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. పహాణీ, అడంగల్ రికార్డులను పరిశీలించడంతో పాటు, 1-B రిజిస్టర్ ద్వారా భూమిపై యాజమాన్య హక్కులు ఎవరికి ఉన్నాయో చెక్ చేయాలి.
ఇవి కూడా చదవండి
అలాగే నిషేధిత భూముల జాబితాను కూడా పరిశీలించాలి. సంబంధిత సర్వే నంబర్ 22A జాబితాలో ఉందో లేదో చూడాలి. ఆ భూమి అసైన్డ్ ల్యాండ్ (Assigned Land), వక్ఫ్ బోర్డు, దేవాదాయ శాఖ లేదా ప్రభుత్వ పోరంబోకు భూమి అయితే దాని రిజిస్ట్రేషన్ చెల్లుబాటు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కోర్టు కేసులు, భూమి కొలతలు కూడా చెక్ చేయండి

ఆ ల్యాండ్‌పై కోర్టు వివాదాలు ఉన్నాయా లేదా అనేది కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి. యజమాని పేరు లేదా సర్వే నంబర్‌పై స్థానిక కోర్టులు, హైకోర్టులో ఏవైనా సివిల్ వివాదాలు నడుస్తున్నాయేమో ఈ-కోర్ట్స్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో చెక్ చేయాలి.
అలాగే 1-B రిజిస్టర్ (ROR 1-B)లో ఉన్న భూ యజమాని మొత్తం విస్తీర్ణం, ఖాతా వివరాలను పరిశీలించాలి. భూమి కొలతలు, సరిహద్దులు, సర్వే నంబర్ మ్యాప్‌ను రికార్డులతో పోల్చడంతో పాటు, భూమి వద్ద ఉన్న వాస్తవ సరిహద్దులతో కూడా స్కెచ్‌ను సరిపోల్చి చూడాలి.







