హైదరాబాద్ లో విస్తరిస్తున్న ‘రియల్’ మార్కెట్
హైదరాబాద్ నగరం విస్తరిస్తున్న కొద్దీ నివాస గృహాల అవసరాలు మారుతున్నాయి. ఒకప్పుడు రక్షణ రంగానికి, భారీ పారిశ్రామిక ఉత్పత్తులకు నిలయంగా ఉన్న నార్త్ సెంట్రల్ హైదరాబాద్ ఇప్పుడు పచ్చని వాతావరణం, ఆధునిక సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అద్భుత కనెక్టివిటీతో శరవేగంగా ఐటీ, ప్రీమియం నివాస హబ్‌గా అభివృద్ధి చెందుతోంది. సాంకేతిక రంగాల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలు ఇక్కడి రియల్ ఎస్టేట్ రంగానికి కొండంత బలాన్ని ఇస్తున్నాయి. నగరం పరిధి దాటి విస్తరిస్తున్నా, మరోవైపు రీ-డెవలప్మెంట్ రూపంలో హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న ప్రాంతాలు సైతం సరికొత్త లగ్జరీలతో కొత్త సొబగులు అద్దుకుంటున్నాయి.
నగరానికి పశ్చిమంలో కోకాపేట్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్, నార్సింగి వంటి ప్రాంతాలున్నాయి. ఐటీ/ఐటీఈఎస్ దిగ్గజ కంపెనీల విస్తరణ, అల్ట్రా-లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలు ఇక్కడి వృద్దికి ప్రధానం. అవుటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ, గ్లోబల్ లైఫ్‌స్టైల్ అత్యంత ఎక్కువ మూలధన వృద్ధిని, స్థిరమైన అద్దె ఆదాయాన్ని అందిస్తున్నాయి. కొంపల్లి, బాచుపల్లి, దూలపల్లి, మేడ్చల్.. ఇక్కడ ప్రధాన ప్రాంతాలుగా ఉన్నాయి. జాతీయ రహదారి (ఎన్‌హెచ్-44), జీనోమ్ వ్యాలీ ఐటీ-ఫార్మా కారిడార్ ఉండడం ఇక్కడి వృద్ధికి కారణం. తక్కువ ధరల్లో లగ్జరీ విల్లాలు, కమ్యూనిటీ ప్రాజెక్టులు ఉండడంతో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కొనుగోలుదారులు ఇటువైపు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఉప్పల్, ఎల్బీ నగర్, పోచారం, నాగోల్.. వంటి ప్రాంతాలు ఈ పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వం చేపట్టిన గ్రిడ్ విధానంతో ఈస్ట్ జోన్లో నూతన ఐటీ పార్కులు అందుబాటులోకి వస్తున్నాయి. మెట్రో రైలు సదుపాయం విస్తృతంగా ఉండటంతో రీసేల్ మార్కెట్, మిడ్-సెగ్మెంట్ హౌసింగ్ గణనీయంగా పుంజుకుంది. శంషాబాద్, ఆదిబట్ల, తుక్కుగూడ, మహేశ్వరం.. వంటివి ఈ ప్రాంత రియల్టీ వృద్ధికి కీలకం. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఆదిబట్ల ఏరోస్పేస్/డిఫెన్స్ పార్క్, లాజిస్టిక్స్ హబ్‌లు ఇందులో భాగమయ్యాయి. విశాలమైన ఓపెన్ ప్లాట్లు, విల్లా ప్రాజెక్టులు, ఫార్మా రంగానికి అనువైన వాతావరణం ఇక్కడ ప్రధాన ఆకర్షణగా మారాయి.
మరోవైపు రియల్ ఎస్టేట్ కంపెనీలు, సొంత ఇంటి కల ఉన్న కుటుంబాలు నగర నడిఒడ్డున ఉన్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, హిమాయత్‌నగర్ బెల్ట్ వైపు మొగ్గు చూపుతున్నాయి. దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు, లగ్జరీ హైరైజ్ ప్రాజెక్టులతో సరికొత్త వెలుగులు సంతరించుకుంటోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు, నాంపల్లికి, అసెంబ్లీకి లేదా ఐటీ కారిడార్లకు చేరుకోవడం చాలా సులభం. గ్రీన్ లైన్ మెట్రో స్టేషన్ అందుబాటులో ఉండటం వల్ల నగరంలోని ఏ మూలకైనా నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. ప్రతి 2-3 నిమిషాలకు నగరంలోని అన్ని దిక్కులకూ ఆర్టీసీ బస్సు సర్వీసులు లభిస్తాయి. తల్లిదండ్రులు తమ పిల్లల విద్యార్హతల కోణంలో ఇక్కడ ఇల్లు కొనడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. నగరంలోనే దాదాపు అన్ని ప్రముఖ విద్యాసంస్థలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. దాంతోపాటు ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం అతి సమీపంలో ఉంది. సివిల్స్, గ్రూప్స్, నీట్/జేఈఈ వంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ప్రధాన కేంద్రాలన్నీ (అశోక్ నగర్, చిక్కడపల్లి) ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కు అనుకొని ఉండటంతో విద్యార్థులకు, కుటుంబాలకు ఇది సరైన నివాస ప్రాంతంగా తోస్తుంది.
ఐటీ నిపుణులకు మెట్రో ద్వారా మైండ్ స్పేస్, హైటెక్ సిటీలకు సులభమైన ప్రయాణ మార్గం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, వ్యాపార సంస్థలు, చుట్టుపక్కలే ఉండటంతో నిత్యం ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాలతో రద్దీగా ఉంటోంది. ఐకానిక్ సినిమా థియేటర్ల కాంప్లెక్స్‌లకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నిలయం. కిమ్స్, యశోధ, సన్‌షైన్, నిమ్స్.. వంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు 10-15 నిమిషాల ప్రయాణ పరిధిలోనే అందుబాటులో ఉన్నాయి. హిమాయత్‌నగర్ లగ్జరీ బ్రాండ్ రిటైల్ అవుట్లెట్లు, రెస్టారెంట్లు, కేఫ్‌లకు సమీపంలో ఉంది. గతంలో ఇక్కడ ఇండిపెండెంట్ ఇళ్లు లేదా చిన్న అపార్ట్మెంట్లు ఎక్కువగా ఉండేవి. కానీ, పెరుగుతున్న డిమాండ్‌ను బట్టి దిగ్గజ బిల్డర్లు ఇక్కడి స్థలాలను సేకరించి అల్ట్రా-లగ్జరీ హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీలను నిర్మిస్తున్నారు. క్లబ్‌హౌస్‌లు, స్విమ్మింగ్ పూల్స్, విశాలమైన పార్కులు, 100 శాతం వాస్తు అనుకూలతలు, ట్రిపుల్ లెవల్ పార్కింగ్ సదుపాయాలతో కూడిన భవనాలు ఏర్పాటు చేస్తుండడంతో ఇక్కడ ఆస్తుల విలువ నిలకడగా భారీగా పెరుగుతోంది.
ఒకప్పుడు బాలానగర్ అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, రక్షణ పరిశ్రమలకు ప్రసిద్ధి. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఆజాద్ ఇంజనీరింగ్ వంటి దిగ్గజ సంస్థలు ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలుగా నిలిచాయి. అయితే నగరీకరణ పెరుగుతుండటంతో ప్రభుత్వం పారిశ్రామిక యూనిట్లను ఔటర్ రింగ్ రోడ్ అవతలకు తరలించింది. దీంతో బాలానగర్‌లోని పారిశ్రామిక స్థలాలు రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ల పునర్నిర్మాణానికి అనువుగా మారాయి. పచ్చని పార్కులు, పర్యావరణ అనుకూల వసతులతో ఈ ప్రాంతమిప్పుడు కొనుగోలుదారులకు, పెట్టుబడిదారులకు చిరునామాగా మారింది. నార్త్ సెంట్రల్ హైదరాబాద్‌లో నివసించే వారికి ఏ ప్రాంతానికైనా సులువుగా చేరుకునేలా కనెక్టివిటీ ఉండటం అతిపెద్ద వరం.
నగరంలోని ప్రధాన ఐటీ హబ్ అయిన హైటెక్ సిటీ, లైఫ్ సైన్సెస్ రంగానికి కేరాఫ్ అడ్రస్ అయిన జీనోమ్ వ్యాలీకి కూకట్పల్లి–బాలానగర్ అత్యంత సమీపంలో ఉంది. కైత్లాపూర్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో మాదాపూర్, హైటెక్ సిటీలకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గింది. అలాగే బాలానగర్ మెట్రో స్టేషన్ ద్వారా ఇక్కడ్నుంచి హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, హెచఐసీసీలకు వేగవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది. నగర కేంద్రంలో ఉండటం వల్ల కూకట్పల్లి వై జంక్షన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్లకు చేరుకోవడం సులభం. ఎన్‌హెచ్–44 , ఔటర్ రింగ్ రోడ్ ద్వారా శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సులభమైన ప్రయాణం.
ప్రపంచ స్థాయి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లతో బాలానగర్ ప్రాంతం అత్యుత్తమ సౌకర్యాలను అందిస్తోంది. ఇంటికి చేరువలోనే అంతర్జాతీయ విద్యా సంస్థలు ఉండటంతో పిల్లలకు పాఠశాలకు వెళ్లే ప్రయాణ సమయం తగ్గి చదువుపై దృష్టి పెట్టడానికి, తల్లిదండ్రులకు భద్రతా భావం కలగడానికి తోడ్పడుతుంది. అలాగే అంతర్జాతీయ ఆసుపత్రులూ ఈ ప్రాంతంలో ఉండటంతో అధునాతన వైద్య పరిజ్ఞానం, వైద్య నిపుణులతో సమగ్ర చికిత్స ఇక్కడే అందుబాటులో ఉంది.
అమ్మకాల జోరు..
దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాల జోరును పరిశీలిస్తే హైదరాబాద్‌లో ఇళ్ళ విక్రయాలు పెరిగాయి. 2026 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశంలోని తొమ్మిది కీలక నగరాల్లో మొత్తం 1,03,170 ఇళ్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంలో నమోదైన 1,09,420 యూనిట్లతో పోలిస్తే అమ్మకాలు 6 శాతం తగ్గాయి. ప్రాపఈక్విటీ పరిశీలించిన మార్కెట్లలో ముంబై, నవీ ముంబై, థానే, ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణె, కోల్‌కతా ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు, కొనుగోలుదారులలో కొంత మందగించిన డిమాండ్ ఇందుకు కారణాలుగా నివేదిక పేర్కొంది. సాధారణంగా అక్టోబర్-డిసెంబర్ కాలంలో పండుగల డిమాండ్‌తో గృహ విక్రయాలు పుంజుకునే అవకాశం ఉంటుంది. నగరాల వారీగా చూస్తే హైదరాబాద్ మార్కెట్ మాత్రం జాతీయ ధోరణికి భిన్నంగా సాగింది. ఇక్కడ గృహ విక్రయాలు గతేడాది క్యూ3లోని 13,890 యూనిట్ల నుంచి 15,470 యూనిట్లకు పెరిగాయి. బెంగళూరులో మాత్రం పెద్దగా మార్పు లేకుండా 1 శాతం వృద్ధితో 17,170 నుంచి 17,340 యూనిట్లకు చేరాయి. మరోవైపు పుణెలో అమ్మకాలు 16 శాతం తగ్గి 21,190 నుంచి 17,860 యూనిట్లకు పడిపోయాయి. చెన్నైలో 17 శాతం క్షీణించి 5,640 నుంచి 4,680 యూనిట్లకు చేరాయి. థానేలో 18,240 నుంచి 16,230 యూనిట్లకు తగ్గగా, ముంబైలో 10,690 నుంచి 9,830 యూనిట్లకు పడిపోయాయి. ఢిల్లీ-ఎన్సీఆర్లో అమ్మకాలు 12 శాతం తగ్గి 9,230 నుంచి 8,090 యూనిట్లకు చేరాయి. కోల్‌కతాలోనూ 17 శాతం క్షీణత నమోదై 4,640 నుంచి 3,860 యూనిట్లకు పడిపోయాయి. మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ నేడు కూడా రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు కేరాఫ్ గానే కనిపిస్తోంది.








