వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పార్టీలో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేసిన ఆయన, హద్దు దాటితే ఎంతటివారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల మంత్రివర్గం నుంచి కొండా సురేఖ తొలగింపు కొంత బాధ కలిగించిందన్నారు. అయినా పార్టీ క్రమశిక్షణ, అధిష్టానం ఆదేశాల మేరకే ఆ చర్యలు చేపట్టాల్సి వచ్చిందని కుండబద్దలు కొట్టారు. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘనలను ఏమాత్రం ఉపేక్షించేది లేదని ఆయన తేల్చిచెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా హైకమాండ్ కీలక నిర్ణయాలు తీసుకుంటోందని, ఇందులో భాగంగా డీసీసీ అధ్యక్షులకు త్వరలోనే ప్రొటోకాల్ పదవులు కేటాయించనుందని మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. అంతేకాకుండా, భవిష్యత్తులో ఎన్నికల టికెట్ల కేటాయింపు ప్రక్రియలో డీసీసీ అధ్యక్షుల పాత్రను అత్యంత కీలకం చేశారు. ఇకపై డీసీసీ అధ్యక్షుల ప్రతిపాదనలు లేకుండా ఎలాంటి పేర్లను పరిశీలనలోకి తీసుకోబోమని ఆయన స్పష్టం చేశారు. తద్వారా స్థానిక నాయకత్వానికి, పార్టీ యంత్రాంగానికి పెద్దపీట వేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. మరోవైపు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు అనుభవించిన వారిలో అర్హులైన కొందరికి రెన్యువల్ చేసే అవకాశాలున్నాయని వెల్లడించారు.
ఇక రాష్ట్రంలో దుమారం రేపుతున్న 22ఏ నిషేధిత ఆస్తుల జాబితా అంశంపై మహేష్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. ఈ నిషేధిత జాబితా తాము అధికారంలోకి వచ్చాక తెచ్చింది కాదని, ఇది 2007 నుంచి అమల్లో ఉందని గుర్తుచేశారు. అధికార యంత్రాంగం కొంత అత్యుత్సాహం ప్రదర్శించడం వల్లే కొన్ని పొరపాట్లు జరిగాయని అంగీకరించారు. ఈ తప్పులపై అసెంబ్లీలో ప్రభుత్వం తరఫున సమగ్ర వివరణ ఇస్తామని, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బుధవారం దీనిపై అన్ని విషయాలను వెల్లడిస్తారని తెలిపారు.
ప్రజలు పూర్తిగా తిరస్కరించిన కొందరు వ్యక్తులు, సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో హల్చల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ అభూత కల్పనలు, అవాస్తవాలతో క్షణికానందం పొందవచ్చని, కానీ సోషల్ మీడియాలో వచ్చే అసత్యాలను ప్రజలు నమ్మరని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల నాటికి ఈ నిజాలన్నీ ప్రజలకు పూర్తిగా అర్థమవుతాయని, సోషల్ మీడియాలో వచ్చే ప్రతిదీ నిజం కాదని ఆయన హితవు పలికారు.
రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన బీసీ వర్గాల అంశంపై కూడా ఆయన స్పష్టత ఇచ్చారు. కేబినేట్లో బీసీల సంఖ్యను పెంచాలని, కనీసం 4 నుంచి 5 మంత్రి పదవులు వారికి ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో భవిష్యత్తులో బీసీలు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉంటుందని పేర్కొన్నారు. అయితే, తాను మాత్రం కేబినేట్లోకి వెళ్లాలనే ఆలోచనలో లేనని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్‌ను ఉద్యమ నాయకుడిగా గౌరవిస్తామని, కానీ ముఖ్యమంత్రిగా ఆయన పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఆయన చేసిన తప్పులు, తెచ్చిన అప్పుల భారాన్ని ఇప్పుడు తాము మోయాల్సి వస్తోందని మండిపడ్డారు. ప్రస్తుతం గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా ఉందని, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు చాలా సంతృప్తిగా ఉన్నారని, తద్వారా వచ్చే ఎన్నికల్లోనూ తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేస్తానని మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. అయితే ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయడం మాత్రం ఖాయమని, రిజర్వేషన్లు ఫైనల్ అయిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందని ఆయన వెల్లడించారు.








