కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్
ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్న మంత్రి లోకేష్
తిరుమల: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక తిరుమల శ్రీ వేంకటేశ్వరుని సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో కుటుంబ సభ్యులతో కలిసి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. మంగళవారం సాయంత్రం తిరుమల చేరుకున్న మంత్రి నారా లోకేష్.. ముందుగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలోని బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మంగళవాయిద్యాల మధ్య శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబునాయుడు దంపతులు, మంత్రి నారా లోకేష్, సతీమణి నారా బ్రాహ్మణ, ఇతర కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో చంద్రబాబునాయుడు కుటుంబానికి పండితులు వేదాశీర్వచనం చేశారు. అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా 2027 టీటీడీ డైరీ, కేలండర్ ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం ఆలయం ముందున్న వాహన మండపానికి చేరుకుని పెద్దశేష వాహనసేవలో పాల్గొన్నారు. వాహనంపై ఆశీనులైన శ్రీ మలయప్ప స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.








