సెంటర్ ప్లేస్ ఎట్ ఎడిసన్ (Centre Place at Edison)లో ఘనంగా 4వ వార్షిక గణేష్ ఉత్సవాలు
ఎడిసన్, న్యూజెర్సీ: సెంటర్ ప్లేస్ ఎట్ ఎడిసన్ (Centre Place at Edison) కమ్యూనిటీ ఆధ్వర్యంలో 4వ వార్షిక గణేష్ ఉత్సవాలు సెప్టెంబర్ 14 నుంచి 19, 2026 వరకు భక్తిశ్రద్ధలతో, సాంస్కృతిక వైభవంతో ఘనంగా జరుగుతున్నాయి.
సెప్టెంబర్ 14న సంప్రదాయబద్ధంగా శ్రీ గణేశ స్థాపన మరియు పూజా కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభ వేడుకలకు ఎడిసన్ మేయర్ సామ్ జోషి (Sam Joshi) ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. ఆయన గణనాథుడిని దర్శించుకుని, సెంటర్ ప్లేస్ ఎట్ ఎడిసన్ (Centre Place at Edison) కమ్యూనిటీ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన రాకతో ప్రారంభోత్సవానికి మరింత ప్రత్యేకత చేకూరింది.
భారతీయ పల్లెటూరి సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన విలేజ్ థీమ్ అలంకరణలు ఈ ఏడాది వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాలంటీర్లు ఎంతో శ్రమతో రూపొందించిన ఈ అలంకరణలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను అందంగా ప్రతిబింబించాయి.
ఆరు రోజుల పాటు గణేశ పూజ, హారతి, గణేశ అభిషేకం, చిన్నారుల భక్తిగీతాలు, నివాసితుల గణేశ భజనలు, నృత్యాలు, ఫ్యాన్సీ డ్రెస్, ఢోల్ తాషా, చిన్నారుల కార్యక్రమాలు మరియు గణేశ శోభాయాత్ర వంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ముఖ్యంగా చిన్నారులు, యువతను ఈ వేడుకల్లో భాగస్వాములను చేయడం ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంతో పాటు కమ్యూనిటీలో ఐక్యత, స్నేహభావాన్ని మరింత బలోపేతం చేయడం ఈ ఉత్సవాల ప్రధాన ఉద్దేశం.
ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు తమ సమయం, శ్రమ, సృజనాత్మకతతో సహకరిస్తున్న సెంటర్ ప్లేస్ ఎట్ ఎడిసన్ (Centre Place at Edison) కుటుంబాలు, వాలంటీర్లు, చిన్నారులు, కళాకారులు మరియు సహకారదాతలకు గణేష్ చతుర్థి ఆర్గనైజింగ్ కమిటీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.
సెప్టెంబర్ 19న ఢోల్ తాషా, చిన్నారుల కార్యక్రమాలు, శోభాయాత్ర మరియు గణేశ నిమజ్జనంతో ఆరు రోజుల ఉత్సవాలు ముగియనున్నాయి.
గణపతి బప్పా మోరియా!









