హాలీవుడ్ లో ‘మహారాజా’ రీమేక్.. ఈ రివర్స్ జర్నీ ఎక్కడికి దారి తీస్తుంది?
ఒక భాషలో హిట్టైన సినిమా మరో భాషలోకి రీమేక్ అవడం కొత్తేమీ కాదు. వింత అసలు కాదు. సినిమా పరిశ్రమ పుట్టినప్పటి నుంచీ ఇది నిరంతరం జరుగుతూనే ఉంది. ఒక చోట ప్రేక్షకులను మెప్పించిన కథను మరో భాషలోకి తీసుకెళ్లడం, అక్కడి నేటివిటీకి తగ్గట్టుగా మార్చడం ఎప్పటి నుంచో ఉన్న పద్ధతే.
మన దేశంలో అయితే ఇది మరింత సాధారణం. తమిళంలో హిట్టయితే తెలుగులోకి వస్తుంది. తెలుగులో నచ్చితే హిందీలోకి వెళ్తుంది. మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ… ఇలా ఒక భాషలో పుట్టిన కథ మరో భారతీయ భాషలో కొత్త రూపంలో కనిపిస్తూనే ఉంటుంది. అలా మన సినిమాలు ఇన్నాళ్లూ ఇక్కడిక్కడే తిరుగుతున్నాయి. మన దేశం దాటి వెళ్లలేదు.
అయితే గ్లోబల్ మార్కెట్ పెరిగింది. ఓటీటీలు వచ్చాయి. సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి విడుదలవుతున్నాయి. ఒకప్పుడు మన దగ్గరే పరిమితమైన సినిమాలు ఇప్పుడు జపాన్ నుంచి అమెరికా వరకు, కొరియా నుంచి చైనా వరకు ప్రేక్షకులను చేరుతున్నాయి. అయినా మన సినిమాలను చూసి, “ఈ కథను మేం మా ప్రేక్షకుల కోసం మళ్లీ తీస్తాం” అని ప్రపంచంలోని పెద్ద సినిమా పరిశ్రమలు ముందుకు రావడం జరగటం లేదు.ముఖ్యంగా హాలీవుడ్ మన సినిమాల జోలికి రాదు.
అయితే మనం మాత్రం హాలీవుడ్ సినిమాలను చూసి కథలు తీసుకొచ్చి మన నేటివిటీకి తగ్గట్టుగా మార్చుకున్నాం. ఇప్పుడు మాత్రం హాలీవుడ్ మన కథను తీసుకుని అక్కడి ప్రేక్షకులకు తగ్గట్టుగా చెప్పబోతోంది. ఇది చిన్న మార్పులా కనిపించినా… సినిమా ప్రపంచంలో దీని అర్థం చాలా పెద్దది.
Hollywood Remake: ఇది ‘మహారాజా’కు మాత్రమే వచ్చిన అవకాశం కాదు
మహారాజా నిర్మాతలు తాజాగా హాలీవుడ్ రీమేక్‌ను అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ హాలీవుడ్ స్టూడియో ఈ సినిమాను రీమేక్ చేయనుంది. దీంతో హాలీవుడ్లో ప్రముఖ స్టూడియో ద్వారా రీమేక్ కానున్న తొలి తమిళ సినిమాగా ‘మహారాజా’ నిలవనుంది.
అంతేకాదు… ఈ రీమేక్‌లో హాలీవుడ్ స్టార్ మాథ్యూ మెక్కోనహే నటించనున్నారనే ప్రచారం మొదలైంది. అయితే ఆయన పేరు ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు.
నిర్మాత సుధన్ సుందరం చెప్పిన ప్రకారం, చైనాలో మహారాజా సాధించిన సుమారు ₹91 కోట్ల వసూళ్లు కూడా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. ఆ తర్వాత ఒక ఏజెన్సీ రీమేక్ హక్కుల కోసం నిర్మాతలను సంప్రదించింది. వచ్చే ఏడాది సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని, ఒక A-లిస్ట్ నటుడితో చర్చలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. అంటే హాలీవుడ్ దృష్టిలో మహారాజా కేవలం మరో ఇండియన్ సినిమా కాదు. రీమేక్ చేయదగ్గ కథగా అది కనిపించింది.
హాలీవుడ్‌ను ‘మహారాజా’లో ఆకర్షించిన విషయం ఏంటి?
మహారాజాలో ఒక తండ్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన డస్ట్‌బిన్ పోయిందని ఫిర్యాదు చేస్తాడు. ‘లక్ష్మి’ అని పిలుచుకునే ఆ డస్ట్‌బిన్ కోసం అతను పోలీసుల చుట్టూ తిరగడం మొదట చూస్తే చాలా సాధారణంగా అనిపిస్తుంది. కానీ కొద్దిసేపటికే మనకు అర్థమవుతుంది… అతను వెతుకుతున్నది డస్ట్‌బిన్ కాదు. దాని వెనుక దాగి ఉన్న ఇంకేదో ఉంది.
అక్కడి నుంచే సినిమా ఒక పజిల్లా మారుతుంది. ప్రేక్షకుడికి మొత్తం సమాచారాన్ని ఒకేసారి చెప్పకుండా, చిన్న చిన్న ముక్కలుగా కథను ముందుకు నడిపించడం, గతం-వర్తమానాన్ని కలపడం, ఒక సంఘటనను మరో కోణంలో మళ్లీ చూపించడం… ఇవన్నీ మహారాజా స్క్రీన్‌ప్లేలో కీలకమైన అంశాలు. కథలోని భావోద్వేగం స్థానికమైనదైనా, దాని థ్రిల్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తుంది.
ఒక తండ్రి తన కుటుంబాన్ని కాపాడుకోవాలని అనుకోవడం… ఒక నేరం వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవడం… ప్రతీకారం, బాధ, న్యాయం కోసం పోరాటం… ఇవి తమిళ ప్రేక్షకుడికే పరిమితమైన విషయాలు కావు. భాష మారినా, దేశం మారినా అర్థమయ్యే మానవ భావోద్వేగాలు. అదే మహారాజాకు హాలీవుడ్ రీమేక్ అవకాశాన్ని తెచ్చిపెట్టి ఉంటుంది.
మరో ఎట్రాక్షన్ … కథ చెప్పే విధానం
ఇలాంటి కథను హాలీవుడ్లో రీమేక్ చేయడానికి కేవలం మంచి కథ ఉండటం సరిపోదు. ఆ కథను ఎలా చెబుతున్నారన్నది కూడా చాలా ముఖ్యం. మహారాజా ఒక సాధారణ లీనియర్ క్రైమ్ స్టోరీ కాదు. ప్రేక్షకుడికి మొత్తం నిజాన్ని మొదటి నుంచే చెప్పేయకుండా, అతనితోనే ఆ పజిల్‌ను పరిష్కరింపజేసేలా చేస్తుంది.
మనం ఒక సన్నివేశాన్ని చూసి ఒక అర్థం చేసుకుంటాం. తర్వాత మరో సంఘటన జరుగుతుంది. అప్పటివరకు చూసిన సన్నివేశానికే కొత్త అర్థం వస్తుంది. ఇది అంతర్జాతీయ ప్రేక్షకుడికి కూడా పనిచేసే స్క్రీన్‌ప్లే టెక్నిక్.
అందుకే మహారాజాలోని అసలు “కమర్షియల్ ఎలిమెంట్” కేవలం విజయ్ సేతుపతి స్టార్ పవర్ కాదు. కథలోని మిస్టరీ, స్క్రీన్‌ప్లేలోని పజిల్,ఎమోషన్, ట్విస్టులు… ఇవన్నీ కలిసే సినిమాని నిలబెట్టాయి.
చెన్నై నుంచి లాస్ ఏంజెల్స్‌కి..
ఈ మార్పు నిజంగా ‘Global Cinema’ అంటే ఏమిటో చూపించే దశ కావచ్చు . ఒక తెలుగు సినిమా అమెరికాలో విడుదల కావడం, ఒక తమిళ సినిమా జపాన్‌లో ఆడటం, ఒక మలయాళ సినిమా ఓటీటీలో ప్రపంచ ప్రేక్షకులకు అందుబాటులోకి రావడం… ఇవన్నీ గ్లోబల్ రీచ్. అయితే దాని తర్వాతి మెట్టు అనేది ఉండాలి కదా
ప్రపంచంలోని మరో సినిమా పరిశ్రమ మన కథను గమనించడం. మన కథలో తమ ప్రేక్షకులకు ఉపయోగపడే సామర్థ్యం ఉందని గుర్తించడం. ఆ కథను తమ భాషలో, తమ సంస్కృతిలో మళ్లీ చెప్పాలని అనుకోవడం. ఆ స్థాయికి వెళ్లినప్పుడే గ్లోబల్ సినిమా అనే మాటకు ఇంకాస్త పెద్ద అర్థం వస్తుంది. ‘మహారాజా’ ఇప్పుడు ఆ దిశగా ఒక అడుగు వేస్తోంది.
రేపు తెలుగు సినిమా కూడా ఇలాంటి వార్తలు వినిపిస్తుందా?
ఇప్పుడు తమిళ సినిమా నుంచి మహారాజా హాలీవుడ్‌కు వెళ్లింది. అది సక్సెస్ అయితే మరింత మంది హాలీవుడ్ నిర్మాతలు దృష్టి మన భాషల సినిమాలపైనా పడొచ్చు. భారతీయ భాషల్లోని మరిన్ని కథలను అంతర్జాతీయ స్టూడియోలు పరిశీలించే ఆసక్తి పెరగవచ్చు. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ… ఏ భాషలో ఉన్నా ప్రపంచ ప్రేక్షకుడిని తాకగల కథలకు కొత్త మార్కెట్ తెరుచుకునే అవకాశం ఉంటుంది.అప్పుడు మన తెలుగు సినిమాలు హాలీవుడ్ కు వెళ్లచ్చు.
అప్పుడే “Global Cinema” అనే మాటకు నిజమైన అర్థం..అర్దవంతంగా అర్దమవుతుంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








