ట్రంప్ ‘అమ్మ ఒడి’ స్కీమ్?
అనాదిగా పిల్లలను పెంచడం,పెద్ద చేయటం.. తల్లిదండ్రుల బాధ్యతే. అందులో పెద్ద విశేషం లేదు..వింత అంతకన్నా లేదు. అయితే ఆ తల్లుల భాధ్యతను ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు తీసుకోవటానికి ముందుకు రావటం మాత్రం గొప్ప విషయం. ఎందుకంటే తల్లిని గౌరవించని ఏ జాతి తన మనగడ సాధించలేదు. ముందుకు వెళ్లలేదు. ఈ విషయాన్ని సామాజిక వేత్తల కన్నా ఎక్కువగా రాజకీయనాయకులు అర్దం చేసుకున్నారు.
అందుకే పిల్లల్ని పెంచడానికి అయ్యే ఖర్చు ఎంతో కొంత, childcare ఖర్చులు.. ఇవన్నీ కుటుంబ ఆర్థిక వ్యవస్థపై ఎంత ప్రభావం చూపిస్తున్నాయో ప్రభుత్వాలు కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాయి. అందుకే పిల్లల పెంపకానికి తల్లులకు, కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచే పథకాలు ఒక్కో దేశంలో ఒక్కో రూపంలో దర్శనమిస్తున్నాయి.
మన తెలుగు రాష్ట్రాల్లో ‘అమ్మ ఒడి’, ‘తల్లికి వందనం’ వంటి పథకాలు కూడా పిల్లల భవిష్యత్తు, కుటుంబ ఆర్థిక భారం పంచుకునే విషయం చుట్టూ తిరిగే ఆలోచనలే. పిల్లల కోసం ప్రభుత్వం కుటుంబానికి కొంత ఆర్థిక సాయం అందిస్తుంది.
ఇప్పుడు అదే తరహా ఆలోచన అమెరికాలోనూ మరో రూపంలో ప్రాణం పోసుకునే పరిస్థితి కనిపిస్తోంది. యాజిటీజ్ ‘అమ్మ ఒడి’ అని కాదు.. కానీ చూస్తే మనకు అమ్మ ఒడి గుర్తొచ్చేంత దగ్గరగా ఉన్న ఆలోచన.
ట్రంప్ పరిపాలనలో చర్చకు వచ్చిన ప్రతిపాదన ప్రకారం, ఇప్పటివరకు ప్రధానంగా తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్లేందుకు పిల్లల childcare ఖర్చును భరించడంలో ఉపయోగపడుతున్న ఫెడరల్ నిధులను.. ఇంట్లోనే ఉండి పిల్లలను చూసుకునే తల్లిదండ్రులకు కూడా అందించే అవకాశం పరిశీలిస్తున్నారు.
చర్చలో ఉన్న విషయం ప్రకారం ఒక కుటుంబానికి సంవత్సరానికి $9,000 వరకు సాయం అందించే అవకాశం ఉందని Wall Street Journal చర్చ పేర్కొంది.
అంటే.. “పిల్లలను చూసుకోవడానికి డేకేర్‌కి పంపితే ప్రభుత్వం సాయం చేస్తుంది. మరి అమ్మే ఇంట్లో ఉండి పిల్లలను చూసుకుంటే?” అనే ప్రశ్నకు కూడా ప్రభుత్వం డబ్బుతో సమాధానం చెప్పాలనే ఆలోచన అన్నమాట.
ఇవి కూడా చదవండి
ఇన్నాళ్లూ అమెరికాలో ఏం జరిగింది?
అమెరికాలో ఇప్పటికే పిల్లల సంరక్షణ కోసం ప్రభుత్వం ఒక పెద్ద కార్యక్రమాన్ని నడుపుతోంది. దాని పేరు Child Care and Development Fund. పేరు కొంచెం పెద్దదే కానీ కాన్సెప్ట్ సింపుల్. తక్కువ ఆదాయం ఉన్న తల్లిదండ్రులకు పిల్లలను చూసుకునే ఖర్చులో ప్రభుత్వం సాయం చేస్తుంది. తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్లాలి, చదువుకోవాలి లేదా కొత్త ఉద్యోగం కోసం శిక్షణ తీసుకోవాలి. వాళ్లు అలా ముందుకు వెళ్లాలంటే పిల్లలను ఎవరో ఒకరు చూసుకోవాలి. ఆ childcare ఖర్చు పెద్ద భారంగా మారకుండా ప్రభుత్వం కొంత సహాయం చేస్తుంది.
అంటే ఇప్పటి వరకు దీని వెనుక ఉన్న ఆలోచన దాదాపు ఇలా ఉంది. “మీరు…మీ పిల్లలను చూసుకోవడానికి అయ్యే ఖర్చు గురించి ఆలోచించకండి. మీరు ఉద్యోగానికి వెళ్లి సంపాదించుకోండి.” అంటే ప్రభుత్వ సాయం చివరికి కుటుంబాన్ని పని, ఆదాయం, స్వావలంబన వైపు తీసుకెళ్లాలి అనేది అసలు ఉద్దేశం.
మరి ఇప్పుడు కొత్తగా ట్రంప్ ఏం అంటున్నారు?
ఇప్పుడు ట్రంప్ పరిపాలనలో చర్చకు వచ్చిన ఆలోచన ఈ లాజిక్‌ను కొంచెం ప్రక్కకు తిప్పుతోంది. భార్యాభర్తల్లో ఒకరు ఉద్యోగం చేస్తున్నారు. ఇంకొకరు మాత్రం ఉద్యోగానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నారు. ఎందుకు? అంటే పిల్లలను స్వయంగా చూసుకోవడానికి. అలాంటి కుటుంబానికి కూడా ఈ childcare సాయం ఎంతో కొంత అందించాలనేదే ప్రధాన ఆలోచన.
అందుకే married coupleలో ఒకరు పనిచేస్తూ, మరొకరు ఇంట్లో ఉండి పిల్లలను చూసుకునే కుటుంబాలకు కూడా ఈ నిధుల ద్వారా ప్రయోజనం కల్పించే మార్గాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏడాదికి $9,000 వరకు?
చర్చలో ఉన్న ప్రతిపాదన ప్రకారం ఒక కుటుంబానికి సంవత్సరానికి $9,000 వరకు ప్రయోజనం అందించే అవకాశం గురించి మాట్లాడుతున్నారు. మన రూపాయల్లో చూస్తే సుమారుగా రూ.8 లక్షలు. ఒక్కసారి ఆలోచించండి. ఇంట్లో పిల్లలను చూసుకుంటున్న తల్లిదండ్రులకు సంవత్సరానికి కొన్ని వేల డాలర్ల ప్రభుత్వ సాయం మామూలు విషయం కాదు.
అంటే పిల్లల్ని చూసుకోవడం కోసం తల్లి ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉండే నిర్ణయం తీసుకున్నా ఇబ్బంది లేదు.. ఆ కుటుంబానికి అయ్యే childcare ఖర్చును ప్రభుత్వం ఒక రకంగా భర్తీ చేస్తానంటోంది. అందుకే దీనిని చూసినప్పుడు మనకు ‘అమ్మ ఒడి’ గుర్తుకు రావడం సహజమే.
అలాగే $9,000 అనేది ప్రతి తల్లికి, ప్రతి కుటుంబానికి ఖచ్చితంగా వచ్చే మొత్తం కాదు. ఎవరు అర్హులు? ఎంత ఆదాయం ఉన్న కుటుంబాలకు వర్తిస్తుంది? ఏ పరిస్థితుల్లో ఎంత సాయం వస్తుంది? వంటి వివరాలు ఇంకా స్పష్టంగా తేలాల్సి ఉంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








