కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై రేవంత్ కొరడా.. విచారణకు ఆదేశం!
తెలంగాణ అసెంబ్లీ వేదికగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భూముల వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. తెలంగాణ ఉద్యమాన్ని, ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని గత ప్రభుత్వ పెద్దలు విచ్చలవిడిగా భూములు దోచుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 22ఏ నిషేధిత భూముల అంశంపై జరిగిన వాడివేడి చర్చ సందర్భంగా, కల్వకుంట్ల కుటుంబం ఆధీనంలో ఉన్న ఆస్తులు, ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భూములపై సీఎం సమగ్ర విచారణకు ఆదేశించారు.
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల నిలిపివేతకు దారితీసిన సెక్షన్ 22ఏ నిషేధిత జాబితా భూములపై గత కొద్ది రోజులుగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో అసెంబ్లీలో ప్రభుత్వం తరఫున మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, అసలు ధరణి ముసుగులో జరిగిన అక్రమాలను ప్రస్తావిస్తూ కౌంటర్ ఎటాక్ చేశారు. తెలంగాణ కోసం పోరాడిన నిజమైన ఉద్యమకారులు సర్వం కోల్పోతే, పాలకుల కుటుంబాలు మాత్రం వందలాది ఎకరాలను ఎలా కూడగట్టుకున్నాయని ఆయన నిలదీశారు.
కల్వకుంట్ల కుటుంబం ఆధీనంలో భారీగా భూములు ఉన్నాయని రేవంత్ రెడ్డి లెక్కలతో సహా సభ ముందుంచారు. చట్టం ప్రకారం 27 ఎకరాలు మాత్రమే ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం వారి వద్ద ఏకంగా 67 ఎకరాల భూమి ఉందన్నారు. కేటీఆర్ కుటుంబ సభ్యుల పేరిట మొత్తం 123 ఎకరాల భూమి రిజిస్టరై ఉందని సీఎం వెల్లడించారు. కేటీఆర్ పేరిట 49 ఎకరాలు, ఆయన భార్య శైలిమ పేరిట 17.5 ఎకరాలు, కుమార్తె అలేఖ్య పేరిట 9.38 ఎకరాలు, హిమాన్షు పేరిట 46.3 ఎకరాలు ఉన్నట్టు వివరించారు. ఏ వ్యాపారం చేసి ఆ కుటుంబం ఇన్ని వందల ఎకరాలు సంపాదించిందని ప్రశ్నించారు. ఇదంతా ఉద్యమాన్ని అడ్డంపెట్టుకుని దోచుకున్నది కాదా అని సీఎం నిలదీశారు.
ఇవి కూడా చదవండి
కేసీఆర్ ఫామ్‌హౌస్ ఆధీనంలో దాదాపు 700 ఎకరాల భూమి ఉందని ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఫామ్‌హౌస్ భూముల సరిహద్దులు, రికార్డుల లెక్కలను తక్షణమే తేల్చాలని సంబంధిత జిల్లా కలెక్టర్‌ను అసెంబ్లీ వేదికగానే ఆదేశించారు. అంతేకాకుండా, ఫామ్‌హౌస్ పరిధిలో ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు తేలితే, కేవలం 30 రోజుల్లోనే దానిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని స్పష్టం చేశారు. స్వాధీనం చేసుకున్న భూమిని అర్హులైన పేదలకు, ప్రత్యేకించి ఎస్సీలకు పంపిణీ చేసి వారిని యజమానులుగా మారుస్తామని చెప్పారు. గతంలో దళితుల ఆందోళనల తర్వాత.. ఏ భూమినైతే పసుపు నీళ్లతో శుద్ధి చేశారో, అదే భూమిలో ఎస్సీలకు హక్కులు కల్పిస్తామని సీఎం వెల్లడించారు.
కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్హౌస్పైకి ఇప్పుడు ప్రభుత్వ దర్యాప్తు యంత్రాంగాన్ని పంపడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్పై రాజకీయంగా పైచేయి సాధించే వ్యూహాన్ని అమలు చేస్తోంది. 22ఏ వివాదంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూసిన ప్రతిపక్షానికి, ఏకంగా అధినేత ఆస్తుల లెక్కలనే తెరపైకి తెచ్చి రేవంత్ గట్టి సవాలు విసిరారు. ఈ విచారణ నివేదిక రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడి పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది.








