పాడి కౌశిక్ రెడ్డిపై వేటుకే మొగ్గు..?
బీఆర్ఎస్ ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రాజకీయ భవితవ్యంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ వేదికగా ఆయన ప్రవర్తనపై విచారణ జరుపుతున్న శాసనసభ ఎథిక్స్ కమిటీ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించేందుకు ఎథిక్స్ కమిటీకి గడువును పొడిగిస్తూ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. పైకి ఇది సాధారణ ప్రక్రియలా కనిపిస్తున్నప్పటికీ, తెరవెనుక పాడి కౌశిక్ రెడ్డిపై రాజకీయంగా, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేందుకు వ్యూహాత్మకంగా రంగం సిద్ధమవుతోందన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలపై ఎథిక్స్ కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో.. పూర్తిస్థాయి నివేదికను రూపొందించడానికి మరింత సమయం అవసరమని కమిటీ భావించింది. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల్లో ఎథిక్స్ కమిటీ చైర్మన్ రేవూరి ప్రకాశ్ రెడ్డి ఒక ప్రత్యేక తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారంలో అన్ని కోణాలను క్షుణ్ణంగా పరిశీలించి సమగ్ర నివేదిక అందించేందుకు వచ్చే అసెంబ్లీ సమావేశాల వరకు సమయం కావాలని చైర్మన్ రేవూరి ప్రకాశ్ రెడ్డి కోరగా, సభ ఆ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో కమిటీ తుది నివేదిక సమర్పణ, దాని ఆధారంగా తీసుకోబోయే తదుపరి చర్యల ప్రక్రియ వచ్చే అసెంబ్లీ సెషన్స్‌కు వాయిదా పడింది.
ఈ గడువు పొడిగింపు కేవలం కాలయాపన కాదని.. కౌశిక్ రెడ్డిపైన చట్టపరమైన, సాంకేతికమైన లోపాలు లేకుండా పక్కా ఆధారాలతో వేటు వేసేందుకు జరుగుతున్న కసరత్తు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దూకుడు రాజకీయాలతో నిత్యం వార్తల్లో నిలిచే కౌశిక్ రెడ్డి వ్యవహారశైలిపై అధికార పక్షం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఏదో నామమాత్రపు హెచ్చరికలతో వదిలేయకుండా.. సభా మర్యాదలు, శాసనసభ నిబంధనల ఉల్లంఘనను తీవ్రమైన అంశంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకునే దిశగా ఎథిక్స్ కమిటీ లోతైన పరిశీలన జరుపుతోంది.
సభా హక్కుల ఉల్లంఘన, సభ్యుల పట్ల అనుచిత ప్రవర్తన వంటి అంశాలపై ఎటువంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా పకడ్బందీ నివేదికను తయారు చేయడమే కమిటీ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. వచ్చే సమావేశాల నాటికి పూర్తి స్థాయి ఆధారాలతో కూడిన నివేదికను సభ ముందు ఉంచి, ఆపై ఆయనపై సస్పెన్షన్ లేదా అంతకంటే తీవ్రమైన క్రమశిక్షణా చర్య తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుండడంతో, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారం బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా పెను సవాలుగా మారనుంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపించే అవకాశం ఉన్నప్పటికీ, శాసనసభ ఎథిక్స్ కమిటీ ఇచ్చే నివేదిక ఏకగ్రీవంగా ఆమోదం పొందితే మాత్రం కౌశిక్ రెడ్డి ఇరుకున పడటం ఖాయం. ఒకవేళ వచ్చే సెషన్లో నివేదిక సమర్పించి వేటు వేస్తే, అది ప్రతిపక్ష గొంతును నొక్కే ప్రయత్నమని ప్రచారం చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించవచ్చు.








