AI తో పెద్ద ప్రమాదం ఉద్యోగాలు పోవటం కాదు, మరి?
ఇన్నాళ్లుగా AI గురించి సామాన్యులు ఎవరు మాట్లాడినా, డిస్కస్ చేస్తున్నా దాదాపు ఒక పాయింట్ ని పట్టుకుని మాట్లాడుతున్నారు.
AI ప్రభావంతో ఇప్పటికే ఎన్ని ఉద్యోగాలు పోయాయి?, రాబోయే రోజుల్లో ఎన్ని పోవచ్చు?, AI ఎన్ని పనులను ఆటోమేట్ చేయబోతోంది?, ఎన్ని కొత్త ఉద్యోగాలు పుట్టొచ్చు? ఇదే చర్చ జరుగుతోంది.
రోజుకో కొత్త అంచనా. రోజుకో కొత్త AI టూల్. రోజుకో కొత్త ఆటోమేషన్ వార్త.
ఎంత ఏమి జరిగినా ఫైనల్ ఒకే విషయం దగ్గరకు ఈ చర్చ ఆగుతోంది. అదే “ఉద్యోగం ఉంటుందా? పోతుందా?”. నిజానికి అది పెద్ద సమస్యే. కాదనలేం.అయితే అసలైన సమస్య దీన్ని మించింది ఉంది. దాన్ని వాళ్లు గుర్తించటం లేదు.
AI కొన్ని ఉద్యోగాలను తీసేయడం కంటే చాలా పెద్ద మార్పుకు దారి తీస్తోంది. అది ఉద్యేగ వ్యవస్దని మూలాల్లోంచి పెకిలించేలా ఉంది.
ఆ సమస్య ఏమిటి
సాధారణంగా మనుషులు ఉద్యోగాల్లోకి ఎలా ప్రవేశిస్తారు?, అనుభవం ఎలా సంపాదిస్తారు?, జూనియర్ స్థాయి నుంచి సీనియర్ స్థాయికి ఎలా ఎదుగుతారు? ఈ వ్యవస్థనే AI మార్చేస్తే?
అది కొన్ని లక్షల ఉద్యోగాలు పోయే కథ కాదు. మొత్తం ఉద్యోగ వ్యవస్థనే మూలాల్లోంచి కదిలించే పరిణామం. ఎందుకంటే కెరీర్ అనేది ఒక్కరోజులో తయారయ్యే విషయం కాదు. ఒక యువకుడు కాలేజీ నుంచి బయటకు వస్తాడు. మొదటి ఉద్యోగం సంపాదిస్తాడు.అందులో భాగంగా చిన్న చిన్న పనులు చేస్తాడు.అదే పనిని పదిసార్లు చేస్తాడు. తప్పులు చేస్తాడు. సీనియర్లు ఎలా నిర్ణయాలు తీసుకుంటారో గమనిస్తాడు. కస్టమర్లను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటాడు. ఒత్తిడిలో ఎలా పని చేయాలో తెలుసుకుంటాడు.
కొన్ని సంవత్సరాల తర్వాత అతను మరింత క్లిష్టమైన పనులు చేయగల స్థాయికి చేరుకుంటాడు. ఆ తర్వాత జూనియర్ మిడ్ లెవెల్ కు వెళ్తాడు..ఆ తర్వాత సీనియర్ అవుతాడు. మేనేజర్, చివరకు కంపెనీ లీడర్ అవ్వగలుగుతాడు. అలా స్కిల్స్ కు పదను పెట్టుకుంటూ ముందుకు వెళ్తాడు. ఒక్కో మెట్లు ఎక్కుతాడు.
ఇప్పుడు ఆ మొదటి మెట్ల దగ్గరే AI నిలబడి అడ్డం పడుతోంది. ఆ ఉద్యోగం తను చేస్తానంటోంది. అప్పుడు కొత్తగా వచ్చేవాళ్ల కెరీర్ ఎలా మొదలెడతారు, పని ఎప్పుడు నేర్చుకుంటాడు? మొదటి మెట్టే కనిపించకపోతే, మిగతా మెట్లు ఎలా ఎక్కుతాడు. ఇదే అసలు చిక్కు.
ఉదాహరణకి ఒక కంపెనీకి ఐదేళ్ల తర్వాత 50 మంది Senior Analysts కావాలి. కానీ ఈరోజు Junior Analysts అవసరం లేదనుకున్నప్పుడు అదెలా సాధ్యం. ఎందుకంటే AI ఆ పనిని చేస్తోంది. అయితే ఐదేళ్ల తర్వాత ఆ 50 మంది Senior Analysts ఎక్కడి నుంచి వస్తారు?
ఇది ఒక కంపెనీకి మాత్రమే సంబంధించిన ప్రశ్న కాదు. ఒక మొత్తం పరిశ్రమకు సంబంధించిన ప్రశ్న. జూనియర్ ఉద్యోగాలు తగ్గిపోతే… సీనియర్ నిపుణులు ఎలా తయారవుతారు? ఇక్కడే “AI వల్ల ఎన్ని ఉద్యోగాలు పోతాయి?” అనే సాధారణ లెక్కలకంటే చాలా పెద్ద సమస్య కనిపిస్తుంది.
ఉద్యోగం ఇచ్చేటప్పుడు “Experience కావాలి” అంటారు. కానీ ఆ Experience ఎక్కడి నుంచి వస్తుంది? ఇది రాబోయే సంవత్సరాల్లో యువత ఎదుర్కొనే అత్యంత విచిత్రమైన పరిస్థితుల్లో ఒకటి కావచ్చు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








