హాస్పిటల్స్ పై గురిపెట్టిన ఐఏఎస్..!
మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, సీనియర్ ఐఏఎస్ అధికారి తుకారం ముండే(Tukaram Munde) ప్రైవేట్ ఆసుపత్రులు వైద్య పరికరాలపై చేస్తున్న అడ్డగోలు దోపిడీని సర్వే ఆధారాలతో సహా బట్టబయలు చేశారు. ఇటీవల ముంబైలోని వందలాది హోటళ్లపై మెరుపు దాడులు చేసి, నిబంధనలు ఉల్లంఘించిన వాటి లైసెన్సులు రద్దు చేసి హోటల్స్ రంగాన్ని దారిలోకి తెచ్చిన ఈ డైనమిక్ అధికారి.. ఇప్పుడు తన గురిని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ పై పెట్టారు. ఆసుపత్రులలో ఇన్-పేషెంట్లకు వాడే సర్జికల్ వస్తువులపై ఏకంగా 2,841 శాతం వరకు అదనపు మార్జిన్లు వేసి రోగుల రక్తాన్ని పిండుతున్నారని ఆయన నిరూపించారు.
ఆయన జరిపిన సర్వేలో తేలిన షాకింగ్ నిజాల ప్రకారం.. ఆసుపత్రి యాజమాన్యాలు కేవలం రూ. 11.05 కే కొనుగోలు చేసే ఒక ‘ఐవీ ఇన్ఫ్యూజన్ సెట్’ పై ఏకంగా రూ. 325 ల ఎంఆర్పీ (MRP) ముద్రించి రోగుల నుంచి దండుకుంటున్నారు. అలాగే కేవలం రూ. 6.75 లకే లభించే సిరంజీని రూ. 57.20 లకు, రూ. 29.41 విలువైన క్యాథెటర్ను ఏకంగా రూ. 310 లకు విక్రయిస్తూ రోగుల బలహీనతను ఆసరాగా చేసుకుంటున్నారని తుకారం ముండే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న రోగులకు అసలు వస్తువు ధర ఎంతో పోల్చి చూసుకునే సమాచారం గానీ, ప్రత్యామ్నాయాన్ని వెతుక్కునే అవకాశం గానీ ఉండదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఫార్మాస్యూటికల్ డిపార్ట్మెంట్, నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ తక్షణమే స్పందించాలని లేఖ రాశారు. వైద్య పరికరాలు, సర్జికల్ వస్తువుల కొనుగోలు ధరలకు, ప్రకటించే గరిష్ట విక్రయ ధరలకు (MRP) మధ్య స్పష్టమైన పరిమితులు విధించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో హోటల్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపిన ఈ సిన్సియర్ ఐఏఎస్ అధికారి.. ఇప్పుడు మెడికల్ రంగంలోని దోపిడీపై యుద్ధం ప్రకటించడంతో దేశవ్యాప్తంగా సామాన్య ప్రజల నుండి ఆయనకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.








