Gemini కొత్త ఫీచర్.. వెబ్సైట్లు, యాప్స్‌కు పెద్ద దెబ్బా? అసలు గేమ్ ఇదే!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
మార్పును ఆహ్వానించకపోతే మసైపోతాం. ఈ నిజం ప్రతిసారీ, ప్రతి యుగంలోనూ రుజువవుతూనే ఉంది. కొత్త టెక్నాలజీ పుట్టినప్పుడల్లా అది కేవలం కొత్త సౌకర్యాన్ని మాత్రమే తీసుకురాదు. అప్పటివరకు ఉన్న ఒక పద్ధతిని కూడా మార్చేస్తుంది. ఒకప్పుడు టెలిఫోన్ వచ్చింది.. ఉత్తరాల ప్రాధాన్యం తగ్గింది. టెలివిజన్ వచ్చింది.. రేడియో తన పాత్రను మార్చుకోవాల్సి వచ్చింది. ఇంటర్నెట్ వచ్చింది.. పత్రికలు, టీవీ, వ్యాపారాలు తమను తాము కొత్తగా ఆవిష్కరించుకోవాల్సి వచ్చింది. Smartphone వచ్చాక ఎన్నో పనులు మన చేతిలోకి వచ్చాయి. మారినవి బతికాయి. మారలేనివి నెమ్మదిగా వెనక్కి వెళ్లాయి.
ఇప్పుడు అలాంటి మరో మలుపు మన ముందుకొచ్చింది. ఈసారి మార్పు AI రూపంలో వస్తోంది. ముఖ్యంగా Google తాజాగా తీసుకొచ్చిన Gemini 3.8 Live, Gemini 3.8 Live Extended Thinking మోడళ్లు మనం ఇంటర్నెట్ను ఉపయోగించే పద్ధతిలోనే మరో మార్పుకు తెరతీస్తున్నాయి.అవి ఇప్పటిదాకా మనం ఉపయోగిస్తున్న యాప్స్, వెబ్ సైట్స్ కు డైరెక్ట్ గా దెబ్బకొట్టబోతున్నాయి. అయితే పూర్తి దెబ్బ అని చెప్పలేం. ఈ మార్పుకు అనుగుణంగా మార్చుకున్నవి మనగలుగుతాయి.
ఇంతకీ ఈ కొత్త Geminiలో వచ్చిన మార్పేంటి?
ఇప్పటివరకు మనం AIని ఏం చేశాం? ఏదైనా అడిగాం.. అది సమాధానం చెప్పింది. సమాచారం కావాలంటే వెతికి ఇచ్చింది. ఒక విషయం అర్థం కాకపోతే వెంటనే వివరించింది. అంటే AI ప్రధానంగా “నువ్వు ఏదైనా అడుగు.. నేను చెబుతా” అనే స్థాయిలో ఉండేది.
కానీ Gemini 3.8 Liveతో Google మరో అడుగు ముందుకు వేస్తోంది. ఇది కేవలం మనతో సహజంగా మాట్లాడటమే కాదు.. మనం చూపిస్తున్న దృశ్యాన్ని real timeలో అర్థం చేసుకోగలదు. మనం మాట్లాడుతూనే వెనుక నుంచి tools, APIsను ఉపయోగించి పనులు చేయగలదు. అంటే మనతో conversation ఆపకుండా, ఒక పని మాత్రం backgroundలో కొనసాగించగలదు.
ఇక Gemini 3.8 Live Extended Thinking మరింత క్లిష్టమైన పనుల కోసం రూపొందించారు. మనతో మాట్లాడుతూనే reasoning చేయగలదు. ఒక పని పూర్తి కావడానికి అనేక దశలు అవసరమైనా, మధ్యలో conversation ఆపకుండా ఆ పనిని కొనసాగించగలదు. Google చెప్పే ఉదాహరణల్లో live visual contextతో employee onboarding, చేతితో గీసిన sketchను voice guidanceతో functional React codeగా మార్చడం, అలాగే అనేక దశలతో కూడిన restaurant booking వంటి పనులు ఉన్నాయి.
సింపుల్‌గా చెప్పాలంటే..
పాత AI ఏమనేది అంటే.. “ఏం కావాలో అడుగు.. చెబుతాను.”. ఇప్పుడు కొత్త AI: “ఏం కావాలో చెప్పు.. దాన్ని పూర్తి చేయడానికి నేను పని కూడా చేస్తాను.” అంటోంది.
మరి ఇక్కడి నుంచే మన కథ వెబ్సైట్లు, యాప్స్ వైపు టర్న్ అవుతోంది. ఎందుకంటే ఇన్నాళ్లూ మనకు ఏదైనా కావాలంటే మనమే Googleలో వెతికాం. వెబ్సైట్ ఓపెన్ చేశాం. యాప్‌లోకి వెళ్లాం. వివరాలు చూశాం. పోల్చాం. ఇప్పుడు ఆ అవసరమే లేకుండా చేస్తాను అంటోంది.
మన పని మనం కాకుండా Gemini చేస్తే?
మనం వెబ్సైట్లు, యాప్స్‌ను ఉపయోగించే విధానం మారుతుంది. దానితో పాటు వాటికి వచ్చే traffic, customersను సంపాదించే పద్ధతి, చివరికి తమను తాము AIకి ఎలా కనిపించేలా మార్చుకోవాలన్నదీ మారాల్సి రావచ్చు. దాంతో Internet మీద ఆధారపడి బతుకుతున్న websites, apps పరిస్దితి ఏమిటి?”
ఉదాహరణకు ఒక హోటల్ కావాలంటే Googleలో వెతుకుతాం. మంచి రెస్టారెంట్ ఎక్కడుందో తెలుసుకోవాలంటే Maps చూస్తాం. ఫ్లైట్ టికెట్ కావాలంటే ఒక యాప్, సినిమా టికెట్ కావాలంటే మరో యాప్, ఏదైనా కొనాలంటే ఇంకో యాప్ ఓపెన్ చేస్తాం. చివరికి ఒక చిన్న పని కోసం కూడా మన ఫోన్లో నాలుగైదు apps మధ్య తిరుగుతుంటాం. మనకు ఇది చాలా సాధారణమైన విషయం. కానీ ఈ చిన్న చిన్న clicks వెనుకే ఇంటర్నెట్లో ఒక భారీ వ్యాపారం నడుస్తోంది.
మనమొక websiteలోకి వెళ్లిన ప్రతిసారీ ఆ websiteకి traffic వస్తుంది. అక్కడ మనం కొంతసేపు ఉంటాం, ఏదైనా చదువుతాం, ప్రకటన చూస్తాం, ఒక product చూస్తాం, booking చేస్తాం లేదా ఏదైనా కొనుగోలు చేస్తాం. అదే appలో కూడా జరుగుతుంది. మనం ఎంత ఎక్కువగా ఆ appను ఉపయోగిస్తే, ఆ కంపెనీకి అంత విలువ. అందుకే websiteలు, apps ఎప్పుడూ మనల్ని తమ దగ్గరకు తీసుకురావడానికి, ఎక్కువ సేపు మనని ఎంగేజ్ చేయటానికి పోటీ పడుతుంటాయి.
ఇప్పుడేం జరుగుతంది
మనం AIతో మాట్లాడుతూనే ఒక పని అప్పగించవచ్చు. AI అవసరమైన tools లేదా APIsతో పని చేయగలదు. పని పూర్తయిన తర్వాత మళ్లీ మనతో conversation కొనసాగించగలదు. ఇది వినడానికి చిన్న featureలా అనిపించవచ్చు. కానీ దీని వెనుక ఉన్న మార్పు మాత్రం పెద్దది.
ఎందుకంటే మనం AIని ఇక కేవలం “సమాచారం చెప్పే మిషన్” గా చూడకుండా, “నా పని చూసుకునే వ్యక్తి” గా ఉపయోగించే అవకాశం మొదలవుతోంది.
మరి websiteలకు traffic ఏమవుతుంది?
ఒక websiteకి మనం నేరుగా వెళ్లకపోతే, ఆ websiteకు మన visit ఉండదు. మనం page చూడం. అక్కడి advertisement చూడకపోవచ్చు. Websiteలో గడిపే సమయం కూడా తగ్గవచ్చు. అందుకే AI agents పెరిగితే కొన్ని రకాల direct website trafficపై ఒత్తిడి పెరుగుతుంది. అంటే websiteలు అంతరించిపోవడం కాదు. మనిషి websiteని ఉపయోగించే విధానం మారవచ్చు.
Traffic తగ్గితే business కూడా తగ్గిపోతుందా?
ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఒక హోటల్ websiteకి గతంలో రోజుకు పది వేల మంది visitors వచ్చేవారని అనుకుందాం. AI agents పెరిగిన తర్వాత direct visitors కొంత తగ్గవచ్చు. కానీ అదే సమయంలో AI ద్వారా bookings పెరిగితే? అప్పుడు websiteకి traffic తగ్గినా business తప్పనిసరిగా అదే స్థాయిలో తగ్గాల్సిన అవసరం లేదు.
ఇదే కారణంగా భవిష్యత్తులో companies కేవలం “మా websiteకి ఎంతమంది వచ్చారు?” అని మాత్రమే చూడకపోవచ్చు. “ఎంతమంది customers వచ్చారు? ఎన్ని bookings జరిగాయి? ఎన్ని AI agents మా serviceని ఉపయోగించాయి?” అనేదే ముఖ్యమవుతుంది. అంటే Internetలో traffic కంటే transaction విలువ పెరుగుతుంది. అంటే భవిష్యత్తులో userకి కనిపించేది website కాదు. AI interface కావచ్చు.
Googleకి చాలా పెద్ద లాభం
ఇక్కడ Geminiని ఎందుకు Google ఇంత aggressively తీసుకెళ్తోందో అర్దం చేసుకుందాం. ఇన్నాళ్ళూ ఇప్పటివరకు Google Search లో మనకు కావాల్సిన information వెతుక్కునేవాళ్లం. Searchలో Google మనల్ని ఒక website దగ్గరకు పంపుతుంది. Agentic AIలో Googleకి చెందిన AI మన తరఫున ఆ website లేదా serviceతో పని చేసే అవకాశం ఉంటుంది.
దాంతో website యజమాని ప్రధానంగా ఒక విషయం ఆలోచించేవాడు. “నా websiteని Googleలో కనపేడేలా ఎలా చేయాలి?” ఇప్పుడు జెమినీ సెర్చ్ లో నా వెబ్ సైట్ లేదా యాప్ ని ఎలా కనెక్ట్ చేయాలి. రేపు SEO కంటే “AI Recommendation” ముఖ్యమవుతుందన్నమాట. అంటే AI recommendation ఒక కొత్త digital battlegroundగా మారే అవకాశం ఉంది. అయితే Gemini 3.8 Live ఒక conversationలో 97 భాషల మధ్య మారగలదని Google చెబుతోంది.అది ఓ రకంగా మన లాంటి దేశాల్లో ప్లస్.
ఫైనల్ గా..
ఇంతకాలం వెబ్ సైట్స్, యాప్స్…మనిషి దృష్టిని ఎవరు గెలుచుకుంటారు? అన్నదాని మీదే దృష్టి పెట్టాయి. ఇక నుంచి… AI agent నిర్ణయంలో ఎవరి service కనిపిస్తుంది? అన్నదానికి పోటీ మారవచ్చు. అదే Gemini కథలోని అసలు గేమ్.








