బీజేపీతో పొత్తుపై కేటీఆర్ క్లారిటీ
తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా అత్యంత ఆసక్తికరంగా మారిన అంశం బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు. అధికార కాంగ్రెస్ పార్టీ నిత్యం ప్రస్తావించే ఈ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. హర్యానాలోని సోనిపట్ వేదికగా జరిగిన ఓ సమావేశంలో ఆయన ఈ అంశంపై స్పష్టతనిచ్చారు. 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో తమ పార్టీ జతకట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. దీంతో పొత్తు ఊహాగానాలకు తెరదించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే లక్ష్యంతో ప్రతిపక్షాల మధ్య లోపాయికారీ ఒప్పందాలు జరుగుతున్నాయని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని కాంగ్రెస్ నేతలు పదేపదే ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య రహస్య అవగాహన ఉందనే ప్రచారం ద్వారా రాజకీయ లబ్ది పొందాలని అధికార పార్టీ ఎత్తుగడ వేస్తోంది. అయితే, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో జరిగిన ‘ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్: ది స్టోరీ ఆఫ్ ఎ స్టార్టప్ స్టేట్’ అనే కార్యక్రమంలో కేటీఆర్ ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. బీజేపీతో పొత్తుపై వస్తున్న వార్తలు కేవలం రాజకీయ దురుద్దేశంతో కూడినవేనని స్పష్టం చేశారు.
డీలిమిటేషన్ పై కూడా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం లోక్సభలో దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు కేవలం 24 శాతం ప్రాతినిధ్యం మాత్రమే ఉందని ఆయన గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా దామాషా పద్ధతిలో లోక్సభ స్థానాల సంఖ్యను పెంచితేనే డీలిమిటేషన్ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని, లేదంటే లేదని స్పష్టం చేశారు. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల హక్కులకు భంగం వాటిల్లకుండా చూడాలని తేల్చి చెప్పారు.
తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని కూడా కేటీఆర్ ప్రస్తావించారు. సాగునీరు, తాగునీరు, వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో తమ ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక మార్పులను వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా కరవు పీడిత ప్రాంతాలకు గోదావరి జలాలను తరలించడం చారిత్రక అవసరమని, అది ఒక గొప్ప ఇంజనీరింగ్ పరిష్కారమని ఆయన అభివర్ణించారు. టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్, టాస్క్ వంటి సంస్థల ద్వారా రాష్ట్రంలో యువతకు ఉపాధి, పారిశ్రామికాభివృద్ధి ఎలా సాధ్యపడిందో ఆయన వివరించారు.
మొత్తంగా చూస్తే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండదని బీఆర్ఎస్ నొక్కిచెప్పడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలకు చెక్ పెట్టినట్లయింది. భవిష్యత్తులో బీఆర్ఎస్ తన స్వశక్తిపైనే రాజకీయ పోరాటం చేస్తుందనే సంకేతాలను ఈ ప్రకటన స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో త్రిముఖ పోరు అనివార్యమని తేలిపోవడంతో, రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయ సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.








