సౌదీపై హుతీ దాడుల వెనక..
పశ్చిమాసియాలో మరో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఎర్రసముద్రంపై ఆధిపత్యం కోసం ఇరాన్ అనుకూల ఉగ్రసంస్థ హుతి రంగంలోకి దిగింది. అంతే కాదు.. సౌదీఅరేబియాపై దాడులు చేస్తూ.. ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.పవిత్ర నగరమైన మక్కాపై దాడికి ప్రయత్నించారంటూ సౌదీ అరేబియా చేసిన ఆరోపణలతో ఈ సంక్షోభం తీవ్ర రూపు దాల్చింది.. హూతీలు మక్కా నగరానికి దక్షిణాన ప్రయోగించిన డ్రోన్లను తాము నిర్వీర్యం చేశామని సౌదీ అరేబియా బుధవారం ప్రకటించింది. ఈ నగరానికి వచ్చే యాత్రికులు తమకు అత్యంత ప్రధానమని, తిరుగుబాటుదారులు ఈ ‘ఎర్ర గీత’ను దాటకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చింది.
మరోవైపు హూతీలు ఉత్తర సౌదీ అరేబియాలోని అల్ జౌఫ్‌లో తాము ధ్వంసం చేసిన సైనిక వాహనాల చిత్రాలను విడుదల చేశారు. మక్కాపై తాము దాడికి ప్రయత్నించినట్లు సౌదీ ప్రభుత్వం కట్టుకథలు అల్లుతోందని, అసత్య ప్రచారానికి పాల్పడుతోందని హూతీలు పేర్కొంటున్నారు. ‘
2014లో హూతీ తిరుగుబాటుదారులు యెమెన్ రాజధాని సనా నగరాన్ని వశపరచుకున్నారు. సౌదీ అరేబియా ఈ అంతర్యుద్ధంలో జోక్యం చేసుకుంటూ అంతర్జాతీయ గుర్తింపు కలిగి ఉన్న యెమెన్ ప్రభుత్వానికి మద్దతు పలికింది. దీంతో హూతీలకూ, సౌదీ అరేబియా మద్దతు కలిగిన ప్రభుత్వ బలగాలకూ మధ్య భీకర యుద్ధం సాగింది. ఐక్యరాజ్యసమితి చొరవతో 2022లో యుద్ధం నిలిచిపోయినా ఇరు పక్షాల మధ్య రాజకీయ ఒప్పందమేదీ కుదరలేదు.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌లు ఫిబ్రవరి 28న దాడులు ప్రారంభించాక తొలుత హూతీలు మౌనంగానే ఉన్నారు. అయితే సౌదీ అరేబియా నౌకలు ఎర్ర సముద్రంలో సంచరించకుండా నిషేధం విధిస్తున్నట్లు జులై నెలలో హూతీలు ప్రకటించడంతో సంక్షోభం కొత్త మలుపు తిరిగింది. యెమెన్ రేవుల్ని సౌదీ అరేబియా దిగ్బంధించినందుకు నిరసనగా ఈ చర్య చేపట్టినట్లు హూతీలు వెల్లడించారు.యెమెన్ రేవుల దిగ్బంధనాన్ని సౌదీ అరేబియా ఎత్తివేయాలని హూతీలు కోరుకుంటున్నారు. అలా చేయడం పరాజయాన్ని అంగీకరించినట్లే అవుతుందని సౌదీ భావిస్తోంది.








