ఇరాన్ పై యుద్ధం ఖరీదు రూ.3.65 లక్షల కోట్లు..
పశ్చిమాసియా యుద్ధం అమెరికాకు పెనుభారంగా మారుతోందా.. యుద్ధంలో వాడే ఆయుధాల కోసమే ఏకంగా లక్షల కోట్లు అమెరికా ఖర్చు చేస్తోందా.. ప్రస్తుతం అమెరికా చేస్తున్న యుద్ధం అంతుతెగని విధంగా సాగుతోందా.. ఇలా అయితే అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడడం ఖాయమా అంటే తాజా నివేదికలు అవుననే చెబుతున్నాయి.
2026 ఆగస్టు నాటికి అమెరికా రక్షణ శాఖ ఈ యుద్ధం కోసం సుమారు 38 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3.65 లక్షల కోట్లు) మేర ఖర్చు చేసినట్లు కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ (సీబీవో) తాజా నివేదికలో పేర్కొంది. ఒక వేళ యుద్ధం తీవ్రత జులై నాటి స్థాయికి పెరిగితే, అమెరికా నెలవారీ యుద్ధ ఖర్చు 3 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని హెచ్చరించింది. సీబీవో అనేది అమెరికా కాంగ్రెస్‌కు, బడ్జెట్, ఆర్థిక విశ్లేషణలు అందించే ఒక నిష్పాక్షిక సంస్థ. ఇది తాజాగా ‘ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యల ఖర్చు అంచనా’ అనే పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది.
అందులో ఇరాన్‌తో యుద్ధానికి సంబంధించిన ఖర్చులను నాలుగు విభాగాలుగా చూపించింది. అవి ఏమిటంటే? రక్షణ శాఖ కార్యకలాపాలు, రవాణా, నిర్వహణ ఖర్చులు; ఆర్కౌట్ ఖర్చులు (ఒకదాని కోసం కేటాయించినవి మరొకదానికి వాడడం వల్ల కలిగే నష్టం); సరఫరా అంతరాయాలు, ధరల పెరుగుదల వల్ల కలిగే ఆర్థిక నష్టాలు; దౌత్యపరమైన చర్యలు, విదేశీ సాయం వంటి అదనపు ఖర్చులు.
అమెరికా రక్షణ శాఖ ఖర్చు చేసిన 38 బిలియన్ డాలర్లలో ఎక్కువ భాగం, యుద్ధంలో వాడేసిన మందుగుండు సామగ్రిని, నష్టపోయిన ఆయుధాలను మళ్లీ భర్తీ చేసుకోవడానికి ఖర్చు అయ్యింది. యుద్ధ విమానాల మోహరింపు, ఇంధనం ఖర్చు కూడా ఇందులో భాగంగా ఉంది. వాస్తవానికి యుద్ధం ప్రారంభమైన మొదట్లో ఘర్షణలు చాలా తీవ్రంగా జరిగాయి. ప్రస్తుతం తక్కువ తీవ్రతతో నామమాత్రంగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఒకవేళ మే, జూన్ నెలల తరహాలోనే మళ్లీ ఘర్షణలు తీవ్రమైతే, అమెరికా అదనంగా నెలకు 2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.19,182 కోట్లు) ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అదే ఈ ఘర్షణలు జులై నాటి తీవ్రతకు పెరిగితే ఆ ఖర్చు నెలకు 3 బిలియన్ డాలర్లు (సుమారు రూ.28,773 కోట్లు)కు చేరుతుంది. యుద్ధం తీవ్రత మరింత పెరిగితే ఆ ఖర్చులు ఇంకా పెరగవచ్చు’’ అని సీబీవో పేర్కొంది. జూన్‌లో ట్రంప్ ప్రభుత్వ్ం 87.6 బిలియన్ డాలర్ల అదనపు నిధులు కోరింది. అందులో రక్షణ శాఖకు సంబంధించినవే 67.1 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇందులో ఇరాన్‌తో యుద్ధానికి కేటాయించినవి 42.3 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇది సీబీవో అంచనా వేసిన ఖర్చు కంటే 10 శాతం ఎక్కువ కావడం గమనార్హం.
క్షిపణి రక్షణ వ్యవస్థల వాడకం భారీగా పెరగడం వల్ల అమెరికా వద్ద మిస్సైల్స్ నిల్వలు భారీగా తగ్గిపోయే ప్రమాదం ఉందని సీబీఓ ఆందోళన వ్యక్తం చేసింది.








