పోస్టల్ బ్యాలెట్ పై ట్రంప్ ఆదేశాలు చెల్లవు.. ఫెడరల్ కోర్టు తీర్పు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సుప్రీంకోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది. ఫెడరల్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ట్రంప్ ఈ సంవత్సరం మార్చి నెలలో వెలువరించిన కార్యనిర్వాహక ఆదేశాలను కోర్టు నిలువరించింది. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ విధానంలో మోసం జరుగుతోందని ఆరోపిస్తూ ట్రంప్ ఆ ఆదేశాలు జారీ చేశారు. వాటి ప్రకారం రాష్ట్రాలు ఎన్నికలకు ముందే పోస్టల్ సర్వీసు విభాగానికి అర్హులైన ఓటర్ల జాబితా అందించాల్సి ఉంటుంది. ఆ జాబితాలో పేరున్న వారికి మాత్రమే పోస్టల్ బ్యాలెట్ అందించాలని ట్రంప్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన ఎన్వలప్‌లపై ‘‘యూనిక్ బ్యాలెట్ ఎన్వలప్ ఐడెంటిఫయర్’’లను ముద్రించి వాటి ఆధారంగా కేవలం పౌరులకు మాత్రమే బ్యాలెట్ పేపర్లు అందేలా చూడాలని ట్రంప్ ఆదేశించారు. అమెరికా స్టేట్ పోస్టల్ సర్వీసు (యూఎస్పీఎస్) నిర్దేశించిన విధంగా మాత్రమే పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించిన డిజైన్లు రూపొందించాలని అధ్యక్షుడు తన కార్యనిర్వాహక ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఫెడరల్ ఎన్నికలకు కనీసం 30 రోజుల ముందు రాష్ట్ర లేదా స్థానిక ప్రభుత్వాలు అర్హత కలిగిన ఓటర్ల జాబితాను పోస్టల్ విభాగానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. పోస్టల్ విభాగపు పోర్టల్‌లో అప్లోడ్ చేసిన జాబితాలో లేని వ్యక్తులను పోస్టల్ ఓటింగులో పాల్గొనేందుకు అనర్హులుగా పరిగణించాలి. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ ఫెడరల్ కోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఫెడరల్ ఎన్నికల్లో ఓటింగు పద్ధతులను ఏకపక్షంగా మార్చే అధికారం అధ్యక్షునికి లేదని పిటిషనర్లు కోర్టుకు విన్నవించారు. సుప్రీంకోర్టు తాజాగా వెలువరించిన ఆదేశాలతో పోస్టల్ బ్యాలెట్ల విషయంలో నెలకొన్న గందరగోళానికి తెరపడినట్టైంది. పోస్టల్ బ్యాలెట్‌పై తాను విధించిన ఆంక్షలను ఎత్తివేసిన అమెరికా సుప్రీంకోర్టును ట్రంప్ తప్పు పట్టారు. ఈ తీర్పు వెలువరించిన న్యాయమూర్తులు తాను నియమించినవారు కాదన్నారు.








