సొంత గూటికి జంప్ జిలానీలు? బీఆర్ఎస్లో తిరుగుబాటు!
తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపుల అంశం హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై బీఆర్ఎస్ అధిష్టానానికి సొంత కేడర్ నుంచే తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతోంది. గతంలో పార్టీ మారిన కొందరు ఎమ్మెల్యేలు తిరిగి గులాబీ గూటికి చేరుకునేందుకు ప్రయత్నిస్తుండగా, క్షేత్రస్థాయిలో ఉండే స్థానిక బీఆర్ఎస్ నాయకులు మాత్రం వారి రాకను బలంగా అడ్డుకుంటున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తమను వదిలి వెళ్లిన నాయకులకు మళ్లీ రెడ్ కార్పెట్ వేయడంపై కేడర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో చేరిన కొందరు ఎమ్మెల్యేలకు అక్కడ పరిస్థితులు సరిపడకపోవడంతో, వారు మళ్లీ బీఆర్ఎస్ అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇందులో భాగంగానే పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి జూలై 2024లో కాంగ్రెస్‌లో చేరినప్పటికీ, ఇటీవల కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో జరిగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాకుండా కేసీఆర్‌ను తాను మోసం చేయలేనని, తనకు అన్నం పెట్టిన వ్యక్తిని మచిపోలేనని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సైతం కేసీఆర్‌కు మద్దతుగా మాట్లాడటం, గత నెల జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కన్నీటి పర్యంతం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఈ పరిణామాలపై పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు. పార్టీలోకి తిరిగి వస్తామంటున్న నేతలపై ఆయా నియోజకవర్గాల్లోని స్థానిక శ్రేణుల అభిప్రాయాలు తీసుకోవాలని అధిష్టానం భావించింది. ఇందులో భాగంగా పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన కార్యకర్తలు, స్థానిక నాయకులతో ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. అయితే ఫిరాయింపుదారులను పార్టీలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోవద్దని మెజారిటీ స్థానిక నాయకులు తెగేసి చెబుతున్నారు.
పార్టీని నమ్ముకుని ఉన్న క్యాడర్‌ను కాదని, అవకాశవాద రాజకీయాలు చేసిన వారికి మళ్లీ ప్రాధాన్యత ఇస్తే సంస్థాగతంగా తీవ్ర నష్టం జరుగుతుందని స్థానిక నాయకులు హెచ్చరిస్తున్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి బదులుగా, నియోజకవర్గాల్లో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని, కొత్త వాళ్లను తయారు చేయాలని వారు అధిష్టానానికి గట్టిగా సూచిస్తున్నారు. ఒకవైపు నేతల రాకకోసం కొందరు ప్రయత్నిస్తుంటే, మరోవైపు క్షేత్రస్థాయి నేతల వ్యతిరేకత కారణంగా బీఆర్ఎస్ అధిష్టానం ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.








