కొండా సురేఖకు మళ్లీ కీలక పదవి? హైకమాండ్ యోచనను అడ్డుకుంటున్నదెవరు?
తెలంగాణ కాంగ్రెస్ లో ప్రస్తుతం పదవుల పంపకాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్తకు కీలకమైన పార్టీ సంస్థాగత బాధ్యతలు అప్పగించే అంశంపై అధికార పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. పార్టీ హైకమాండ్ మాత్రం ఈ జంటకు తగిన గుర్తింపునిచ్చి సమన్వయం చేయాలని భావిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గం మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.
కొండా కుటుంబానికి పార్టీ పదవులు ఇవ్వాలనే యోచనను ముఖ్యమంత్రి క్యాంపు బలంగా వ్యతిరేకించడానికి ప్రధాన కారణం రాజకీయ సమీకరణాలే. మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తొలగించిన స్వల్ప వ్యవధిలోనే పార్టీలో కీలక బాధ్యతలు కట్టబెడితే.. అది పబ్లిక్‌గా, పొలిటికల్‌గా రేవంత్ రెడ్డి వర్గానికి ఎదురుదెబ్బగా మారుతుందని సీఎం క్యాంపు ఆందోళన చెందుతోంది. మరోవైపు కొండా సురేఖ కుమార్తె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు నేరుగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసేలా ఉండటమే ఈ ప్రతిఘటనకు అసలు కారణమని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే సురేఖ మంత్రి పదవిని కోల్పోయిన విషయాన్ని వాళ్లు గుర్తుచేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
పార్టీతో పాటు ప్రభుత్వపరంగా వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. వరంగల్‌లో కొద్ది రోజుల క్రితం జరిగిన ప్రెస్మీట్లో కొండా సురేఖ స్వయంగా హైకమాండ్ పరిశీలనలో తన పదవిపై ప్రతిపాదన ఉందని వెల్లడించారు. అయితే రాష్ట్ర స్థాయిలో పార్టీ ఐక్యతను కాపాడుకోవడానికి, అసంతృప్తిని చల్లారార్చడానికి హైకమాండ్ కొండా ఫ్యామిలీకి పదవులు ఇవ్వాలని చూస్తున్నట్టు సమాచారం. కానీ ముఖ్యమంత్రి వర్గం మాత్రం దీనిని ఆలస్యం చేయడానికి లేదా అడ్డుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.
అయితే, తమ అభ్యంతరాలు చెప్పిన తర్వాత, ముఖ్యమంత్రి వర్గం తుది నిర్ణయాన్ని పార్టీ హైకమాండ్ కే వదిలిపెట్టినట్టు సమాచారం. వినాయక చవితి వేడుకలు ముగిసిన తర్వాత ఈ అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరి హైకమాండ్ ఒత్తిడికి సీఎం క్యాంపు తలొగ్గుతుందా? లేక కొండా కుటుంబానికి పదవులు దక్కకుండా రేవంత్ వర్గం తమ వ్యూహంలో విజయవంతం అవుతుందా? అన్నది వేచి చూడాలి.








