శ్రీవారి భక్తుల కోసం అత్యాధునిక సదుపాయాలు..!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన రెండో రోజు అత్యంత బిజీగా సాగుతోంది. శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలందించే దిశగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వెలుపల నూతనంగా నిర్మించిన ‘పిలిగ్రిమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్’ను (Pilgrim Experience Centre) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. దర్శనం కోసం వేచి ఉండే భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను చేకూర్చేలా, ప్రత్యేకంగా రూపొందించిన ‘తిరుమల హీలింగ్, డివోషన్ ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని’ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఇక్కడ అందుబాటులోకి తెచ్చింది.
తిరుమలలో పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేలా నారాయణగిరి ఉద్యానవనాల్లో ఏర్పాటు చేసిన కొత్త ఈవీ (EV) బస్సుల సర్వీసులను కూడా సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ప్రఖ్యాత కార్పొరేట్ సంస్థలైన రిలయన్స్ గ్రూప్, భారత్ బయోటెక్ విరాళంగా అందించిన ఈ పర్యావరణ అనుకూల విద్యుత్ బస్సులు తిరుమలలోని స్థానిక భక్తుల రవాణాకు ఎంతగానో దోహదపడనున్నాయి. దీనితో పాటు, దేశవిదేశాల నుండి వచ్చే యాత్రికులకు కలియుగ వైకుంఠం విశిష్టతను, శ్రీవారి ఆలయ చరిత్రను అద్భుతంగా కళ్లకు కట్టేలా టీటీడీ అత్యాధునికంగా తీర్చిదిద్దిన ‘శ్రీ వేంకటేశ్వర మ్యూజియం’ను కూడా ముఖ్యమంత్రి ఈ రోజు ప్రారంభించబోతున్నారు.
మరోవైపు తిరుమలకు వచ్చే సాధారణ భక్తులకు వసతి గదుల (Tirumala Accommodation) బుకింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు సరికొత్త సాంకేతికతను జోడించారు. యాత్రికుల వసతి గదుల కేటాయింపు, లభ్యత తదితర వివరాలను పారదర్శకంగా పర్యవేక్షించేందుకు వీలుగా రూపొందించిన ‘నందకం యాప్’ను (Nandakam App) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ అధికారికంగా లాంఛ్ చేయనున్నారు. ఈ సరికొత్త డిజిటల్, మౌలిక సదుపాయాల కల్పనతో సామాన్య భక్తులకు తిరుమల యాత్ర మరింత సుఖవంతం కానుందని అధికార వర్గాలు వెల్లడించాయి.








