ఉత్తరాంధ్ర వైసీపీలో ముసలం.. తమ్మినేని కొడుకు పేల్చిన బాంబు..!
శ్రీకాకుళం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. వైఎస్సార్సీపీ (YSRCP) సీనియర్ నేత, శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం రాజకీయ వారసుడిగా ఉన్న ఆయన కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్ సొంత పార్టీ జిల్లా నాయకత్వంపై తీవ్రస్థాయిలో తిరుగుబాటు జెండా ఎగరేశారు. అత్యవసరంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. ప్రస్తుతం జిల్లాలో ఉన్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదంటూ బాంబు పేల్చారు.
అనుమానం ఉంటే అధిష్ఠానం ఒకసారి అంతర్గత సర్వే చేయించుకోవాలని సవాల్ విసిరారు. ఇటీవల లోకల్ పోల్స్ సన్నాహక సమావేశం తర్వాత జిల్లాకు చెందిన కొందరు వైసీపీ నేతలు తమ్మినేని సీతారాంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కూటమితో తమ్మినేని కుమ్మక్కయ్యారని, అందుకే ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడం లేదని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై చిరంజీవి నాగ్ తీవ్రంగా మండిపడ్డారు. తమ్మినేని సీతారాంపై మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే జిల్లా పార్టీ అధ్యక్షుడు ఖండించకపోవడం అమానుషమని ధ్వజమెత్తా.
గతంలో ఎచ్చెర్ల నియోజకవర్గంలో ధర్మాన సోదరుల నుండి కిరణ్‌ను కాపాడింది తమ్మినేని సీతారామే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. టిడిపి నేత కూన రవికుమార్ తో తమ్మినేనికి రహస్య ఒప్పందాలు ఉన్నాయంటూ సొంత పార్టీ నేతలే ప్రచారం చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని నిలదీశారు. జిల్లాలో ఒకే ఒక్క కులం ప్రయోజనాల కోసం పార్టీ నడుస్తోందని, దీనివల్ల మిగిలిన వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని నాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మొత్తం వివాదంలో జిల్లాకు చెందిన కీలక నేతలు ధర్మాన సోదరులు సైతం మౌనం వహించడం దారుణమన్నారు.
విజయనగరంలో మజ్జి శ్రీను వంటి సీనియర్ నేత పార్టీ వీడిన తరుణంలో.. ఇప్పుడు శ్రీకాకుళంలో తమ్మినేని కుటుంబం కూడా వైసీపీకి పూర్తిగా దూరమయ్యే సూచనలు కనిపిస్తుండటం ఉత్తరాంధ్ర వైఎస్సార్సీపీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. తమ్మినేని సీతారాం రాజకీయ జీవితానికి ఎప్పుడూ ‘ఫుల్‌స్టాప్‌లు’ ఉండవని.. కేవలం ‘కామాలు’ మాత్రమే ఉంటాయని చిరంజీవి నాగ్ వ్యాఖ్యానించడం ద్వారా వారు త్వరలోనే సరికొత్త రాజకీయ నిర్ణయం తీసుకోబోతున్నారనే సంకేతాలు ఇచ్చారు.








