సిక్కోలు నిరుద్యోగులకు కేంద్ర మంత్రి భరోసా..!
ఉపాధి కోసం బ్రోకర్లను నమ్మి విదేశాలకు వెళ్లి, అక్కడ నిబంధనల ఉచ్చులో చిక్కుకుపోయిన శ్రీకాకుళం జిల్లా యువకుల ఉదంతంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) సానుకూలంగా స్పందించారు. మలేషియాలో ఇమ్మిగ్రేషన్ అధికారుల అదుపులో ఉన్న నలుగురు సిక్కోలు యువకులను క్షేమంగా, సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టమైన భరోసా ఇచ్చారు. ఈ మేరకు విదేశాంగ శాఖతో పాటు మలేషియాలోని భారత ఎంబసీ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరు, మందస, కవిటి, ఇచ్ఛాపురం ప్రాంతాలకు చెందిన కొందరు యువకులు బ్రోకర్ల మాటలు నమ్మి, నెలకు రూ. 60 వేల వరకు జీతం వస్తుందనే ఆశతో నెల రోజుల క్రితం మలేషియా వెళ్లారు. అయితే, వారిని వర్క్ వీసాపై కాకుండా టూరిస్ట్ వీసాపై పంపించడంతో అక్కడ పర్మినెంట్ వీసా లేక ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే స్థానిక ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం నలుగురు యువకులను మలేషియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషను ఆశ్రయించగా, ఆమె వెంటనే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి సమస్యను తీసుకెళ్లారు.
ఈ నెల 17వ తేదీన సదరు యువకులను మలేషియా కోర్టులో హాజరుపరచనున్నారు. కోర్టు ప్రక్రియ ముగిసిన వెంటనే వారిని స్వస్థలాలకు చేర్చేందుకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నిరుద్యోగ యువతకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో వచ్చే ప్రకటనలు, బ్రోకర్ల మాటల పట్ల అభ్యర్థులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సరైన పని వీసా ఉంటేనే విదేశాలకు వెళ్లాలని, మోసపూరిత ఏజెన్సీలను నమ్మి టూరిస్ట్ వీసాలపై వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఆయన కోరారు.








