రష్యా నుంచి చమురు కొనుగోలుచేసే దేశాలపై ఆర్థిక బంకర్ బ్లస్టర్…!
ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో.. మరోసారి ఆర్థిక ఆంక్షల అస్త్రాన్ని ట్రంప్ సర్కార్ బయటకు తీసింది. భారీగా చమురు కొనుగోలు (Russian Oil) చేసే భారత్, చైనా వంటి దేశాలపై టారిఫ్‌లతో విరుచుకుపడేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన కీలక బిల్లును ఈ వారం ప్రతినిధుల సభ ముందుకు తీసుకురానుంది. అయితే, ఈ బిల్లు (Russia Sanctions Act)లో భారత్ పేరును ప్రత్యక్షంగా చేర్చాలని డెమోక్రటిక్ పార్టీ చట్టసభ్యులు ప్రతిపాదించారు.
దివంగత సెనెటర్ లిండ్సే గ్రాహమ్ పేరు మీదుగా తీసుకొచ్చిన ఈ శాంక్షనింగ్ రష్యా (Russia), ఇరాన్ యాక్ట్ 2026ను అమెరికా (USA) సెనెట్ ఇప్పటికే 86-11తో ఆమోదించింది. అయితే, ఈ బిల్లులో రష్యా వాణిజ్య భాగస్వామ్య దేశాల (Russian Trade Partners) పేర్లను నేరుగా ప్రస్తావించలేదు. కేవలం చమురు, గ్యాస్‌ను దిగుమతి చేసుకునే ఐదు అతిపెద్ద దేశాలంటూ పేర్కొన్నారు. దీన్ని సవరించాలని తాజాగా చట్టసభ్యులు ప్రతిపాదించారు.
100 శాతం టారిఫ్‌లు (Tariffs on India) ఎదుర్కొనే దేశాల జాబితాలో భారత్‌తో పాటు చైనా, తుర్కియే, అజర్బైజాన్, హంగేరీ, స్లోవేకియా, యూఏఈ, సింగపూర్, కజకిస్థాన్, కిర్గిస్థాన్ పేర్లను చేర్చాలని డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు స్టేనీ హోయర్ ప్రతిపాదించారు.
ప్రతినిధుల సభలో ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత అధ్యక్షుడి సంతకంతో ఇది చట్టరూపం దాల్చనుంది. నవంబరులో జరిగే మధ్యంతర ఎన్నికలకు ముందే ఈ బిల్లును ఆమోదింపచేసుకోవాలని ట్రంప్ సర్కారు భావిస్తోంది. కాగా.. రష్యా వాణిజ్య భాగస్వామ్య దేశాలపై విస్తృత సుంకాలను విధించే అధికారాన్ని అధ్యక్షుడికి కల్పించే సెక్షన్ 113ను పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ మరో డెమోక్రటిక్ నేత ప్రతిపాదించడం గమనార్హం.
ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి పెంచేందుకు అగ్రరాజ్యం ఈ బిల్లును తీసుకొచ్చింది. అప్పట్లో దీనిని ట్రంప్ ఆర్థిక బంకర్ బస్టర్‌గా అభివర్ణించారు. రష్యా అధికారులు, ఆర్థిక సంస్థలు, ఇంధన ప్రాజెక్టుల లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించారు. మాస్కో నుంచి చమురు దిగుమతులు చేసుకునే దేశాలపై అధ్యక్షుడు అసాధారణ స్థాయిలో సుంకాలు విధించే అధికారం ఈ బిల్లుతో లభిస్తుంది.








