పవిత్రనగరం మక్కాపై హుతీల గురి.. డ్రోన్ కూల్చేసిన సౌదీ..
పశ్చిమాసియా ఉద్రిక్తతలు విస్తరిస్తున్నాయి. ఇవికాస్తా పవిత్రనగరం మక్కాను తాకాయి. మక్కా సమీపంలోకి ఓ డ్రోన్ దూసుకొచ్చిందని.. దాన్ని తాము కూల్చేశామని సౌదీ అరేబియా ప్రకటించింది. సౌదీ అరేబియా-హూతీల తిరుగుబాటుదారుల మధ్య కొన్నిరోజులుగా తీవ్ర ఘర్షణలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది హూతీల పనేనని సౌదీ ఆరోపించగా.. ఆ వాదనను తిరుగుబాటు గ్రూప్ ఖండించింది.
సౌదీ అరేబియా పశ్చిమ తీరంపై హూతీ తిరుగుబాటుదారులు (Houthis) బాలిస్టిక్ క్షిపణులతో దాడికి దిగడంతో …మక్కా నగరంతోపాటు జెడ్డా, తైఫ్‌లలో హై అలర్ట్ ప్రకటించారు. మక్కా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాంటి అలర్ట్ ప్రకటించడం ఇదే మొదటిసారి. ఒక డ్రోన్ మక్కా వద్ద నిషేధిత గగనతలంలోకి ప్రవేశించికముందే దానిని రాయల్ సౌదీ ఎయిర్ డిఫెన్స్ బలగాలు దానిని అడ్డుకొని, నిర్వీర్యం చేశాయని సైనిక ఉన్నతాధికారులు తెలిపారు. చివరిసారిగా 2017లో హూతీలు మక్కా నగరాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించారు.
మక్కాను టార్గెట్ చేస్తారా.. హుతీలపై ఓఐసీ ఆగ్రహం..
పవిత్ర నగరం మక్కాను హూతీలు (Houthis) లక్ష్యంగా చేసుకోవడం హేయమైన చర్య అని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) ఆగ్రహం వ్యక్తం చేసింది. సౌదీ అరేబియా (Saudi Arabia)పై జరుపుతున్న దాడులను దురాక్రమణగా అభివర్ణించింది. కాగా.. తమపై వస్తున్న ఆరోపణలను హూతీలు ఖండించారు. మక్కాతో పాటు ఇతర ఏ పవిత్ర స్థలానికి తమ నుంచి ముప్పు పొంచిలేదని వివరణ ఇచ్చారు..
హూతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రానికి దక్షిణాన ఉన్న మరికొన్ని కీలక ద్వీపాలను స్వాధీనం చేసుకున్నారు. బాబ్ ఎల్ మండెబ్ జలసంధిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న హూతీలకు ఇది మరో విజయమని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ పరిణామాల వేళ మదీనాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు నిలిపివేసినట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. హూతీల ముప్పు నేపథ్యంలో అప్రమత్తమైన సౌదీ.. ఈజిప్టు, గల్ఫ్ దేశాల సాయాన్ని కోరినట్లు తెలుస్తోంది. ప్రధాని మొహ్మద్ బిన్ సల్మాన్ అమెరికా సైన్యం సాయంతో ఇజ్రాయెల్‌తో పరోక్షంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.








