ఏఐతో ముప్పుతప్పదంటున్న నిపుణులు.. దుష్ప్రచారమంటున్న ట్రంప్…..!
ఏఐ వినియోగం పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో…. దాని దుష్ఫలితాలపైనా పెద్ద చర్చే జరుగుతోంది. ఏఐ వినియోగం..దాని తర్వాత వస్తున్న ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ప్రపంచానికి వినాశనకరమన్న వాదనలు వినిపిస్తున్నాయి. పోనీ వీటి గురించి ప్రస్తావిస్తున్న వారు ఏమైనా సామాన్యులా అంటే కాదు.. వారు ఉద్దండులు..అంతేకాదు.. టెక్ కంపెనీల యజమానులు.అలాంటి వారు సైతం ..మరో పదేళ్లలో ఏఐ చేతుల్లో మానవాళి అంతం తథ్యమంటూ గట్టిగా చెబుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఏఐ వినియోగాన్ని ఆపాలని వారు చెప్పడంలేదు.. కానీ ఏఐ అభివృద్ధిపైనే నియంత్రణ ఉండాలంటున్నారు. కొన్ని పరిమితులకు లోబడి జరగాలని సూచిస్తున్నారు. అలా కాకుండా దేశాలు .. తమ లాభాల కోసం ప్రయత్నిస్తే మాత్రం .. ప్రమాదకరమని సూచిస్తున్నారు.
భవిష్యత్తులో ప్రజలను కృత్రిమ మేధ (ఏఐ) ప్రమాదంలోకి నెట్టనుందన్న నిపుణుల వ్యాఖ్యలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. భవిష్యత్తులో కృత్రిమ మేధవల్ల ముప్పుందనేది బూటకమన్నారు. ఏఐకి, డేటా సెంటర్లకు వ్యతిరేకంగా దుష్ప్రచారం జరుగుతోందని ట్రంప్ స్పష్టం చేశారు. టెక్నాలజీని నియంత్రించే ఎటువంటి చర్యలైనా దుర్మార్గపు కుట్ర కిందకే వస్తాయన్నారు. ఏఐ నిపుణుల హెచ్చరికలపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
‘‘ప్రపంచంపై ఏఐ ఆధిపత్యం సాధిస్తుందని, మానవాళిని నాశనం చేస్తుందని, ఇంకా ఇతరత్రా జరుగుతున్న ప్రచారాలు బూటకం. ఇలాంటి వారే గతంలోనూ వాతావరణ మార్పులవల్ల ముప్పుందని చెప్పారు. అదీ బూటకమే. ఏఐకి అవసరమైన ఏకైక నియంత్రణ, రక్షణ కవచం.. అత్యధిక ఐక్యూ ఉన్న అధ్యక్షుడు. అలాంటి వారు అమెరికాలో ఉన్నారు’’ అని ట్రంప్ చెప్పారు. కృత్రిమ మేధస్సు రంగానికి సంబంధించి ఫిన్లాండ్లో భారీ పెట్టుబడులు పెట్టాలని గూగుల్ తీసుకున్న నిర్ణయంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
మరోవైపు ఏఐపై అంతర్జాతీయంగా బలమైన ఉమ్మడి పాలనను కోరుకుంటున్నామని చైనా స్పష్టం చేసింది. ప్రజలకు మేలు చేసే టెక్నాలజీ అభివృద్ధిపై అందరూ కలిసి పని చేయాలని, అది నియంత్రణ కోల్పోకుండా నిరోధించాలని పిలుపునిచ్చింది. ఏ ఒక్క దేశమూ సొంతంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఇవ్వకూడదని చైనా అభిప్రాయపడింది.
ఏఐవల్ల పెరుగుతున్న అసమానతలను తగ్గించడానికి వెంటనే చర్యలు చేపట్టాలని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పిలుపునిచ్చారు. ఇందుకోసం గేట్స్ ఫౌండేషన్ తరఫున బిలియన్ డాలర్ల సాయాన్ని అందించనున్నట్లు తెలిపారు.








