పార్టీ హుకుం బేఖాతరు.. మీర్జా రహ్మత్ బేగ్ అసలు రాజకీయం!
రాజకీయ పార్టీల్లో క్రమశిక్షణ, అధిష్టానం ఆదేశాల కంటే పదవిపై వ్యామోహం ఎక్కువే ఉంటుంది. చాలా మంది పార్టీ ఆదేశించగానే రాజీనామా చేసేందుకు వెనకాడుతుంటారు. ప్రస్తుతం ఇదే అంశంపై తెలంగాణ రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ వ్యవహారం ఇప్పుడు రాజకీయ దుమారానికి దారితీసింది. పార్టీ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా కూడా, ఇంతవరకూ తన సభ్యత్వానికి రాజీనామా చేయకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మైనర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి రాగానే, ఎంఐఎం పార్టీ తక్షణమే స్పందించింది. పార్టీ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నందున, ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాక ఎమ్మెల్సీ పదవికి తక్షణమే రాజీనామా చేయాలని ఆదేశించింది. ఆ సమయంలో ఉమ్రా నిమిత్తం విదేశాల్లో ఉన్న రహ్మత్ బేగ్, ఇటీవల హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ఆయన రాకతో రాజీనామా చేయడం ఖాయమని పార్టీ వర్గాలు భావించాయి. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. పార్టీ పెద్దల హుకుంను ఆయన ఏమాత్రం లెక్కచేయలేదు. ఇప్పటివరకు మండలి చైర్మన్‌ను కలవలేదు సరికదా, గత కొన్ని రోజులుగా జరుగుతున్న సమావేశాలకు కూడా ఆయన దూరంగా ఉన్నారు.
రహ్మత్ బేగ్ అనుసరిస్తున్న ఈ వైఖరి వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందనే వాదన వినిపిస్తోంది. హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు ఈ ఏడాది ఫిబ్రవరితోనే ముగిసింది. ప్రస్తుతం అక్కడ ఎన్నికైన ప్రజాప్రతినిధులు లేరు. ఒకవేళ ఆయన ఇప్పుడు రాజీనామా చేసి, ఎన్నికల సంఘం ఖాళీని నోటిఫై చేసినప్పటికీ, జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితేనే కార్పొరేటర్లు ఓటర్లుగా ఉండే ఈ స్థానానికి ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ, మున్సిపల్ సమీకరణాల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో రాజీనామా చేస్తే జరిగే పరిణామాలపై ఆయన లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ సంక్లిష్ట రాజకీయ, సాంకేతిక సమీకరణాల నడుమ రహ్మత్ బేగ్ రాజీనామా వ్యవహారం కేవలం ఒక వ్యక్తిగత అంశంగా కాకుండా, పార్టీ ఆదేశాలను ఎదిరించే స్థాయికి చేరడం ఎంఐఎం వర్గాల్లోనూ విస్మయం కలిగిస్తోంది. పార్టీ నుంచి బయటికి గెంటేసినా, పదవిని వదులుకోకుండా ఆయన చేస్తున్న కాలయాపన రాజకీయంగా ఎటు దారితీస్తుందో వేచి చూడాలి!








