ప్రత్యేక తెలంగాణ ఎన్ఆర్ఐ కమిషన్ ఏర్పాటు చేయాలి.. సీఎం రేవంత్‌కు ఝాన్సీ రాజేందర్ రెడ్డి వినతి
ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న ప్రవాస తెలంగాణవాసుల (NRI) హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో ప్రత్యేకంగా ‘తెలంగాణ ఎన్ఆర్ఐ కమిషన్’ను ఏర్పాటు చేయాలని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీమతి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి కోరారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌తో కలిసి అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె.. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.
ఎన్ఆర్ఐలు ఎదుర్కొంటున్న సమస్యలు..
అమెరికా, గల్ఫ్ దేశాలు, యూరప్, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో లక్షలాది మంది తెలంగాణవాసులు నివసిస్తూ రాష్ట్ర అభివృద్ధికి, పెట్టుబడులకు తోడ్పడుతున్నారని ఝాన్సీ రాజేందర్ రెడ్డి తెలిపారు. అయితే, ప్రవాస భారతీయులు , వారి కుటుంబాలు ఆస్తి వివాదాలు, భూ సమస్యలు, న్యాయ సహాయం, అత్యవసర పరిస్థితులు వంటి పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
కమిషన్ ద్వారా ప్రయోజనాలు..
ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపేలా ప్రత్యేక ఎన్ఆర్ఐ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కమిషన్ ద్వారా ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, పెట్టుబడులకు సింగిల్ విండో విధానం, ఆస్తి రక్షణ, విదేశాల్లో అత్యవసర సమన్వయం వంటి సేవలను సులభంగా అందించవచ్చని వివరించారు.
ఈ వినతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని, ప్రవాస తెలంగాణవాసుల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిలో వారి భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే అంశంపై ప్రతిపాదనను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు ఝాన్సీ రాజేందర్ రెడ్డి తెలిపారు.








