జూ.ఎన్టీఆర్ భూమి గొడవేంటి?
తెలంగాణ రాజకీయాల్లో 22ఏ నిషేధిత భూముల వ్యవహారం గందరగోళంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా అసెంబ్లీలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలతో పాటు టాలీవుడ్‌లోనూ పెను ప్రకంపనలు సృష్టించాయి. ముఖ్యంగా ఈ వివాదంలో నందమూరి స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి రావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం ఈదులనాగులపల్లిలోని సర్వే నంబర్లు 134, 135లో జరిగిన భూ అక్రమాలపై ఎమ్మెల్యే సంధించిన ప్రశ్నలు ఇప్పుడు అధికార, ప్రతిపక్ష వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
రామచంద్రాపురం మండలం ఈదులనాగులపల్లి పరిధిలోని సర్వే నంబర్లు 134, 135లో ఉన్న ప్రభుత్వ భూముల రికార్డులను గతంలో అక్రమంగా మార్చేశారని నవీన్ యాదవ్ వెల్లడించారు. ఈ భూముల వివాదంపై కోర్టులో స్టే కొనసాగుతున్న కీలక సమయంలోనే నిబంధనలను తుంగలో తొక్కి సుమారు 150 ఎకరాలకు నకిలీ పట్టాలు సృష్టించారన్నది ప్రధాన ఆరోపణ. ఇలా అక్రమంగా సృష్టించిన డాక్యుమెంట్ల ఆధారంగా ఆ భూములను పలువురికి విక్రయించగా, అందులో జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా ఉందని ఎమ్మెల్యే సభ దృష్టికి తెచ్చారు. ఈ భారీ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరిపి, తెరవెనుక ఉన్న అసలు సూత్రధారులను చట్టపరంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో జూ.ఎన్టీఆర్ సైతం ఈ వివాదాస్పద భూముల కొనుగోలు వ్యవహారంలో ఒక బాధితుడిగా మిగిలిపోయారా? లేక ఆయనకు ముందే ఈ లీగల్ చిక్కుల గురించి తెలుసా? అనే కోణంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌కు ఫిల్మ్‌నగర్ వర్గాలతో సుదీర్ఘకాలంగా సత్సంబంధాలు ఉన్నాయి. సినీ ప్రముఖుల ఆస్తులకు సంబంధించిన లావాదేవీలపై ఆయనకు స్పష్టమైన సమాచారం ఉండి ఉంటుందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
ఇవి కూడా చదవండి
ఈ నేపథ్యంలో ఈదులనాగులపల్లి భూముల ఉదంతంపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశిస్తే.. కాలక్రమంలో ఈ భూముల స్వభావం ఎలా మారింది? కోర్టు స్టే ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి? అనే అంశాలపై స్పష్టత రానుంది. కేవలం ఎన్టీఆర్ పేరు మాత్రమే కాకుండా, ఈ జాబితాలో ఇంకా ఎెవరి పేర్లు ఉన్నాయనేది అధికారిక విచారణ పూర్తయితేనే అసలు నిజాలు బయటపడతాయి.
మొత్తానికి ఒకవైపు ప్రభుత్వం ధరణి లోపాలను సరిదిద్దడానికి ప్రయత్నిస్తుంటే, మరోవైపు అసెంబ్లీ వేదికగా వెలుగు చూస్తున్న ఈ ల్యాండ్ కుంభకోణాలు రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వివాదంలో అధికారిక విచారణ ముగిసేవరకు టాలీవుడ్ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగనుంది.








