దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. హైకోర్టు సంచలన తీర్పు
తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆయనను 2024 ఏప్రిల్ 23 నుంచి ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించింది. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే నాయకులకు ఈ తీర్పు ఒక బలమైన హెచ్చరికగా నిలిచింది.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా దానం నాగేందర్ విజయం సాధించారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన 2024 మార్చి 15న కాంగ్రెస్‌లో చేరారు. అంతేకాకుండా 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అధికారిక అభ్యర్థిగా పోటీ చేయడం ఈ వివాదానికి ప్రధాన కేంద్రబిందువుగా మారింది.
ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి 2024 మార్చి 18న, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి 2024 జూలై 1న స్పీకర్‌కు వేర్వేరుగా అనర్హత పిటిషన్లు సమర్పించారు. స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో తీవ్ర జాప్యం చేయడంతో పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు జోక్యంతో కదిలిన యంత్రాంగం, 2026 మార్చి 11న దానం నాగేందర్‌పై దాఖలైన పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. చట్టపరంగా ఆయన బీఆర్ఎస్ సభ్యత్వాన్ని వదిలేశారనడానికి తగిన ఆధారాలు లేవని స్పీకర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి తిరిగి తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును సుదీర్ఘంగా విచారించింది. ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యేగా కొనసాగుతూనే, ప్రత్యర్థి పార్టీ అయిన కాంగ్రెస్ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి నామినేషన్ దాఖలు చేసిన క్షణమే ఆయన స్వచ్ఛందంగా తన సభ్యత్వాన్ని వదిలేసుకున్నట్లు లెక్కగట్టాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోరారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ లోని పారా 2(1)(a) ప్రకారం రాతపూర్వక రాజీనామాతో నిమిత్తం లేకుండా, ప్రజాప్రతినిధి ప్రవర్తన ద్వారానే పార్టీని వీడినట్లు స్పష్టమవుతుందని బలంగా వాదించారు. మరోవైపు ఫొటోలు, మీడియా కథనాలు మాత్రమే సభ్యత్వాన్ని రద్దు చేయడానికి సరిపోవని దానం తరఫు న్యాయవాదులు చేసిన వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. అతనిపై అనర్హత వేటు వేస్తూ తీర్పు చెప్పింది.
ఈ తీర్పు కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది కాదు. ఫిరాయింపు రాజకీయాలకు పాల్పడుతూ, ఒక పార్టీ తరపున గెలిచి మరో పార్టీ తరఫున ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ప్రజాప్రతినిధుల అనైతిక ధోరణికి ఇది చెక్ పెడుతుంది. స్పీకర్ల అధికారాలు, న్యాయస్థానాల జ్యుడీషియల్ రివ్యూ పరిధిని మరింత స్పష్టం చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు దేశ రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుంది.








