ఒక్క అక్షరం తప్పుగా టైప్ చేశాడు.. ప్రపంచం మొత్తం ‘Google’ చేయడం మొదలైంది!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ఉదయం నిద్ర లేవగానే మనం మొదట చేసే పని ఫోన్ చేతిలోకి తీసుకోవడం. ముందుగా టైమ్ చూస్తాము. తర్వాత వాతావరణం ఎలా ఉందో చూస్తాము. ఏదైనా ముఖ్యమైన మెయిల్ వచ్చిందా అని Gmail ఓపెన్ చేస్తాము. తర్వాత సోషల్ మీడియా యాప్స్ ..అలాగే ఆ రోజు ఎక్కడికైనా వెళ్లాల్సి ఉంటే Google Maps చూస్తాం. ఏదైనా విషయం గుర్తుకు రాకపోతే వెంటనే Googleలో వెతుకుతాం. మధ్యలో ఒక వీడియో చూడాలనిపిస్తే YouTubeకి వెళ్తాం.
ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం ఒక కంపెనీని ఉపయోగిస్తున్నాననే ఫీలింగ్ అసలు రాదు. ఎందుకంటే Google ఎప్పుడో ఒక యాప్‌గా, ఒక వెబ్‌సైట్‌గా మన జీవితంలోకి వచ్చి.. ఇప్పుడు మన రోజువారీ అలవాట్లలో భాగమైపోయింది.. చివరికి ఏదైనా సందేహం వస్తే “Googleలో చూద్దాం” అనడం మన సహజ అలవాటైపోయింది.
అంతగా మన జీవితాల్లో కలిసిపోయిన ఈ Google ఒకప్పుడు ఇంత పెద్దది కాదు. ప్రపంచాన్ని మార్చాలనే ambition ఉన్న ఇద్దరు Stanford విద్యార్థులు, ఒక చిన్న search project, కొన్ని కంప్యూటర్లు, ఆ తర్వాత ఒక గ్యారేజ్.. అంతే. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే, వాళ్లు మొదట పెట్టాలనుకున్న పేరు కూడా Google కాదు.నమ్మబుద్ది కావటం లేద?
29 ఏళ్ల క్రితం google.com అనే డొమైన్ రిజిస్టర్ అయిన రోజున.. భవిష్యత్తులో ప్రపంచం మొత్తం ఏదైనా తెలుసుకోవాలంటే ఈ ఒక్క పేరును ఆశ్రయిస్తుందని ఎవరికీ తెలియదు. ఒక చిన్న spelling mistakeతో మొదలైన ఆ పేరు.. చివరికి మన రోజువారీ జీవితంలోనే ఒక రోజూ వారీ పనిగా మారిపోయింది.
Google కంటే ముందు ఉన్న పేరు.. ‘BackRub’
1990ల మధ్యలో ఇంటర్నెట్ ఇంకా ఇప్పటిలా లేదు. ఈరోజు లాగా ఏదైనా ప్రశ్న టైప్ చేస్తే వెంటనే సమాధానాలు వచ్చేవి కాదు. వెబ్‌లో ఉన్న సమాచారాన్ని వెతకడం కూడా అంత సులభం కాదు. అప్పుడు Stanford Universityలో చదువుతున్న లారీ పేజ్, సెర్గీ బ్రిన్ మాత్రం వెబ్‌లోని ఈ గందరగోళాన్ని ఒక సమస్యగా చూశారు.
వాళ్ల ఆలోచన చాలా సింపుల్‌గా అనిపించినా దాని ప్రభావం మాత్రం చాలా పెద్దది. ఒక వెబ్‌పేజీకి ఇంకెన్ని వెబ్సైట్లు లింక్ చేస్తున్నాయి? ఆ లింకులు ఇచ్చే సైట్లు ఎంత ముఖ్యమైనవి? వీటిని బట్టి ఏ వెబ్‌పేజీ నిజంగా ముఖ్యమైందో అర్థం చేసుకోవచ్చా? అనే ఆలోచనతో ప్రయోగాలు మొదలుపెట్టారు.
ఇవి కూడా చదవండి
ఈ ప్రాజెక్ట్‌కు మొదట పెట్టిన పేరు BackRub
ఈరోజు Google అనే పేరు వింటే ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీల్లో ఒకటి గుర్తొస్తుంది. కానీ అప్పట్లో అదే ప్రాజెక్ట్ పేరు BackRub అని చెప్పడం కొంచెం విచిత్రంగానే అనిపిస్తుంది. అయితే వాళ్ల అసలు ఆలోచన మాత్రం అప్పటికే భవిష్యత్తును చూస్తోంది.
‘Googol’ నుంచి ‘Google’ ఎలా వచ్చింది?
ప్రపంచంలోని సమాచారాన్ని ఒకచోటికి తీసుకురావాలంటే అపారమైన డేటాను నిర్వహించాల్సి ఉంటుంది. అందుకే వాళ్లకు Googol అనే గణిత పదం నచ్చింది. Googol అంటే 1 తర్వాత 100 సున్నాలు.
అంత పెద్ద సంఖ్యను పేరు పెట్టుకోవడం వెనుక కూడా ఒక symbolism ఉంది. ప్రపంచంలోని అపారమైన సమాచారాన్ని organize చేయాలన్న ఆలోచనకు ఆ పేరు సరిపోతుందని భావించారు.
కానీ googol.com అనే డొమైన్ అందుబాటులో ఉందో లేదో చూస్తున్న సమయంలో ఒక చిన్న పొరపాటు జరిగింది. Googol అని టైప్ చేయాల్సింది.. పొరపాటున Google అని టైప్ చేశారు. ఒక్క అక్షరం తేడా.
సాధారణంగా అయితే అక్కడే correction జరిగిపోయేది. కానీ ఆ కొత్త spelling లారీ పేజ్‌కు నచ్చింది. చిన్నది. గుర్తుండిపోయేది. పలకడానికి కూడా సులభంగా ఉంది. అలా Google అనే పేరు స్థిరపడిపోయింది.
1997 సెప్టెంబర్ 15న google.com డొమైన్ రిజిస్టర్ అయింది.
ఈరోజు మనం ఒక URLగా చూసే ఆ పేరు.. అప్పట్లో మాత్రం ఎవరికీ తెలియని ఒక చిన్న వెబ్ అడ్రస్ మాత్రమే. ఆ రోజు వాళ్ల దగ్గర Google సామ్రాజ్యం లేదు. ఈరోజు Google పేరు వినగానే మనకు భారీ డేటా సెంటర్లు, AI, Android, YouTube, Maps, Gmail, Chrome, Cloud.. ఇలా ఒక పెద్ద ప్రపంచం కనిపిస్తుంది.
కానీ ప్రారంభంలో పరిస్థితి అలా లేదు.
చిన్న టీమ్. పరిమితమైన వనరులు. కంప్యూటర్లు. ఎన్నో ప్రయోగాలు. తర్వాత Sun Microsystems సహ వ్యవస్థాపకుడు Andy Bechtolsheim నుంచి $100,000 పెట్టుబడి వచ్చింది. అది వాళ్ల ప్రయాణంలో కీలకమైన మలుపు.
స్టాన్ఫోర్డ్ వసతి గదుల్లో సాగుతున్న పని తర్వాత Menlo Parkలోని ఒక గ్యారేజ్‌కు మారింది. ఈరోజు Googleను చూస్తే ఆ ప్రారంభ దశను ఊహించడం కష్టం. ఒక గ్యారేజ్‌లో మొదలైన ప్రయాణం.. కొన్నేళ్లలో ప్రపంచం మొత్తం ఉపయోగించే search engineగా మారబోతోందని ఊహించలేదేమో.
అసలు గేమ్ పేరు విషయంలో కాదు.. Search విషయంలో ఉంది
Google పేరు ఎలా వచ్చిందన్న కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కానీ Googleను ప్రపంచం మొత్తం ఉపయోగించే స్థాయికి తీసుకెళ్లింది మాత్రం ఆ పేరు కాదు. అది Searchని చూసిన విధానం.
వెబ్‌లో ఒక పేజీకి మరొక ముఖ్యమైన పేజీ link ఇస్తే.. అది ఆ పేజీ ప్రాధాన్యతకు ఒక సంకేతంగా చూడవచ్చనే ఆలోచన పేజ్, బ్రిన్ పరిశోధనలో కీలకంగా మారింది. ఈ ఆలోచనే తర్వాత PageRankగా రూపుదిద్దుకుంది. ఇది చిన్న మార్పులా కనిపించినా search results ఎలా చూపించాలనే విషయంలో చాలా పెద్ద మార్పు.
అంటే Google కథలో ఒక విచిత్రమైన combination ఉంది.
పేరు వచ్చింది ఒక spelling mistake వల్ల. కానీ సామ్రాజ్యం నిర్మించబడింది ఒక అసాధారణమైన search idea మీద. ఆ తర్వాత Google ఒక్కో తలుపు తెరిచింది. మొదట మనం Googleని search boxగా మాత్రమే చూశాం. తర్వాత Gmail వచ్చింది. మెయిల్ పంపడం, ఫైళ్లు నిర్వహించడం, క్యాలెండర్, కాంటాక్ట్స్.. ఇవన్నీ Google ecosystemలోకి వచ్చాయి. తర్వాత Google Maps వచ్చింది. మనం తెలియని నగరంలో దారి తప్పకుండా చూసే డిజిటల్ గైడ్ అయిపోయింది.
Chrome వచ్చింది. మనం ఇంటర్నెట్ను చూసే ప్రధాన ద్వారాల్లో ఒకటిగా మారింది. Android వచ్చింది. కోట్లాది ఫోన్లలో Google ecosystemను నేరుగా మన చేతుల్లోకి తీసుకొచ్చింది. YouTube Google కుటుంబంలోకి వచ్చింది. వీడియోల ప్రపంచం కూడా అదే ecosystemలోకి చేరింది.
ఇలా చూస్తే Google ఒక ఉత్పత్తిని మాత్రమే తయారు చేయలేదు. మన డిజిటల్ జీవితానికి అవసరమైన ఒక్కో పొరను నెమ్మదిగా నిర్మించుకుంది. ఉదయం ఫోన్ నుంచి రాత్రి పడుకునే వరకు..అన్నీను. ఇవాళ మన జీవితంలోకి వచ్చి అన్నీ ఆక్రమిస్తోంది.








