మళ్లీ ఆదిత్య ఠాక్రేకి కష్టాలు.. 500 కోట్ల లీగల్ నోటీసు జారీ
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ కేసు కొత్త మలుపు తిరిగింది. కుమార్తె మృతిపై న్యాయం పోరాటం చేస్తున్న తనను రాజకీయ ప్రేరేపిత వ్యక్తిగా చిత్రీకరించేందుకు యత్నించారని ఆరోపిస్తూ శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే, ఎన్సీపీ (ఎస్పీ) నేత అనిల్ దేశ్‌ముఖ్‌కు ఆమె తండ్రి సతీశ్ సాలియాన్ రూ.500 కోట్ల లీగల్ నోటీసు జారీ చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియాతో పాటు మీడియాలోనూ 3 నిమిషాల వ్యవధితో కూడిన వీడియో ద్వారా తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ లీగల్ నోటీసు పంపడంతో ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆదిత్య ఠాక్రే వ్యక్తిగత జీవితంతో పాటు, రాజకీయ జీవితం కూడా చిక్కుల్లోపడింది. మృతి కేసులో న్యాయం కోసం చేస్తున్న పోరాటాన్ని రాజకీయంతో ముడిపెట్టేస్తున్నారని, రాజకీయ ప్రేరేపితమైందిగా చిత్రీకరించేందుకు వారు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ దిశా సాలియన్ తండ్రి సతీష్ ఈ నష్టపరిహారం కోరారు. తనకు క్షమాపణలు చెబుతూ అన్ని ప్రధాన పత్రికలు, డిజిటల్ మీడియా వేదికల్లో ప్రకటనలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి
2020 జూన్ 8 న ముంబైలోని ఓ భవనంపై నుంచి పడి దిశా శాలియన్ మృతి చెందింది. ఆమె చనిపోయిన కొన్ని రోజుల్లోనే నటుడు సుశాంత్ కూడా తన ఫ్లాట్ లో శవమై కనిపించాడు. ఈ రెండు ఘటనలు సామాజికంగా, రాజకీయంగా కూడా ఓ పెద్ద కుదుపునే పుట్టించాయి. ఆ సమయంలో మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం అధికారంలోకి వుంది. దిశ శాలియన్ మృతి కేసును కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు విపరీతంగా వచ్చాయి. ఆ రోజు ఇంట్లో జరిగిన పార్టీకి ఆదిత్య ఠాక్రే, ఆయన బాడీగార్డులతో పాటు నటులు సూరజ్ పంచోలి, డినో మోరియా హాజరయ్యారని, తండ్రి సతీశ్ సాలియన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీని తర్వాత సీబీఐ హత్య, క్రిమినల్ కుట్ర కోణాల్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. ఆదిత్య ఠాక్రే, రియా చక్రవర్తి, డినో మోరియా, సూరజ్ పంచోలి పాత్రలపై విచారణ ముమ్మరం చేసింది.








