గ్లోబల్ సౌత్ ‘వారధి’ భారత్.. బ్రిక్స్ సదస్సు విజయంలో మోడీ దౌత్య నీతి
ఓ వైపు పశ్చిమాసియా సంక్షోభం.. ఢీ అంటే ఢీ అంటు తలపడుతున్న అమెరికా, ఇజ్రాయెల్… ఇరాన్. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ పోరు.. ఇంకోవైపు.. మంటల్లో చమురు మార్కెట్లు.. ప్రపంచమే తల్లకిందులవుతున్న వేళ.. ఢిల్లీలో నిర్వహించిన బ్రిక్స్ సదస్సు అపూర్వ విజయాన్ని సాధించింది. సైద్ధాంతిక విభేదాలున్నప్పటికీ.. ఢిల్లీ డిక్లరేషన్‌ను అన్ని దేశాలు బలపరిచాయి కూడా. ఒకే వేదికపై ప్రపంచ దేశాధినేతలు.. వేదికపై చిరునవ్వులు చిందించిన పుతిన్, జిన్ పింగ్, మోడీ. డాలర్‌కు బదులుగా సొంత కరెన్సీలో వ్యాపార, లావాదేవీలు నిర్వహించాలని నిర్ణయం.. ఈ పరిణామం సహజంగానే ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇక ఏ దేశం పైనా ఇష్టానుసారం టారిఫ్‌లు విధించరాదని బ్రిక్స్ సదస్సు తీర్మానించింది. 18వ బ్రిక్స్ సదస్సులో అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ విప్లవం మరియు భద్రత రంగాల్లో అనేక కీలక తీర్మానాలు, ఒప్పందాలపై అగ్రనేతలు సంతకాలు చేశారు. పలు ముఖ్యమైన తీర్మానాలు చేశాయి.
ఉగ్రవాదంపై ‘జీరో టాలరెన్స్’:
సరిహద్దు ఉగ్రవాదం, ఉగ్రవాద నిధుల సమీకరణ, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే ప్రక్రియలపై కఠిన వైఖరి వహించాలని సదస్సులో సభ్య దేశాలు తీర్మానించాయి. పహల్గామ్ ఘటన వంటి దాడిని ఖండిస్తూ… ఐక్యరాజ్యసమితి వేదికగా అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక సమగ్ర ఒప్పందాన్ని త్వరగా ఆమోదించాలని డిమాండ్ చేశాయి.
గ్లోబల్ గవర్నెన్స్ సంస్కరణలు
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి,, ప్రపంచ బ్యాంకులలో ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు (గ్లోబల్ సౌత్) తగిన ప్రాతినిధ్యం కల్పించేలా సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేశాయి బ్రిక్స్ దేశాలు.
పశ్చిమాసియా సంక్షోభం:
గాజా మరియు పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి పునరుద్ధరణకు, కాల్పుల విరమణకు బ్రిక్స్ సదస్సు పిలుపునిచ్చింది. పాలస్తీనా సమస్యకు ద్వి-రాజ్య విధానమే ఏకైక మార్గమని ఉద్ఘాటించింది.
ప్రపంచ ఇంధన మార్కెట్ స్థిరత్వం:
చమురు, గ్యాస్ సరఫరా మార్గాలు మరియు సముద్ర వాణిజ్య మార్గాలకు ఎలాంటి ముప్పు కలగకుండా ఇంధన నిల్వల భద్రతను కాపాడాలని సదస్సులో బ్రిక్స్ దేశాలు తీర్మానించాయి.
స్థానిక కరెన్సీలలో చెల్లింపులు
అమెరికా డాలర్‌పై ఆధారపడటం తగ్గించి, రూపాయి-రూబుల్ లేదా స్వదేశీ కరెన్సీలలో వాణిజ్యం జరపడం ద్వారా మారకపు నిధుల నష్టాన్ని, నిల్వల వ్యయాన్ని భారత్ తగ్గించుకుంటోంది.
న్యూఢిల్లీ డిక్లరేషన్..
అంతర్జాతీయ వాణిజ్యంపై విధించే ఏకపక్ష టారిఫ్‌లు, రక్షణవాద చర్యలపై బ్రిక్స్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఉగ్రవాదంపై “జీరో టాలరెన్స” విధానాన్ని అమలు చేయాలని, ఉగ్రవాద నిధులను అరికట్టాలని ఉమ్మడి ప్రకటనలో స్పష్టం చేశారు. గ్లోబల్ గవర్నెన్స్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్ష సాంకేతికతల్లో గ్లోబల్ సౌత్ దేశాలకు సమాన ప్రాతినిధ్యం ఉండాలని భారత్ ప్రతిపాదించింది.
గ్లోబల్ సౌత్ లీడర్‌గా భారత్..!
గ్లోబల్ సౌత్ నాయకుడిగా భారత్ స్థానం మరింత బలపడింది. ఐఎంఎఫ్, ఐక్యరాజ్యసమితి సంస్కరణల కోసం బ్రిక్స్ మద్దతు భారత్‌కు లభిస్తుంది. భారత్ ప్రతిపాదించిన బ్రిక్స్ కోఆపరేషన్ పోర్టల’ ద్వారా భారతీయ చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అంతర్జాతీయ వాణిజ్య అవకాశాలు పెరుగనున్నాయి.డిజిటల్ అగ్రికల్చరల్ వ్యవసాయ రంగంలో ఏఐ, జియోస్పేషియల్ టూల్స్ వినియోగానికి భారత్ నాయకత్వం వహిస్తోంది. దీనివల్ల దేశీయ రైతులు, విత్తన సాంకేతికతలకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుంది.ఇంధన & డిజిటల్ భద్రత‘డిజిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్మార్ట్ గ్రిడ్స’ ద్వారా గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ రంగాలు అభివృద్ధి చెందుతాయి. సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌లను అరికట్టేందుకు ఉమ్మడి పోరాటం భారత్ భద్రతను పెంచుతుంది. ఇంక్యుబేటర్ నెట్వర్క’, ‘స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ’ ద్వారా భారతీయ యువ పారిశ్రామికవేత్తలకు నిధులసమీకరణ సులువవు తుంది. సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గించుకోవడం, అంతర్జాతీయ వేదికలపై ఆర్థిక బలాన్ని పెంచుకోవడం మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడంలో ఈ బ్రిక్స్ సదస్సు భారత్‌కు ఎంతో ప్రయోజనకరంగా మారింది.
మోడీ దౌత్యనీతి..
భారత్ అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ సదస్సుతో ప్రధాని నరేంద్ర మోడీ అనుసరించిన ‘వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి’ మరియు ‘బహుళ భాగస్వామ్య దౌత్యనీతి’ని ప్రపంచ వేదిక గుర్తించిందనేది స్పష్టమైన వాస్తవం.ఒకే వేదికపై రష్యా, చైనా, ఇరాన్ వంటి అమెరికా వ్యతిరేక వర్గాలతోనూ, మరోవైపు అమెరికా, పశ్చిమ దేశాలతోనూ అంతే బలమైన సంబంధాలను నిర్వహించడం సాధ్యమేనని భారత్ ఆచరణలో నిరూపించింది. అంతర్జాతీయ రాజకీయాల్లో దీన్ని “జీరో-సమ్ గేమ” (ఒకరితో ఉంటే ఇంకొకరిని వదులుకోవాల్సిందే అనే విధానం)కి స్వస్తి చెప్పి, “లాభదాయక బహుళ భాగస్వామ్య” విధానాన్ని అమలు చేయడం ద్వారా భారత్ ఈ సంక్లిష్ట సమతుల్యతను సాధిస్తోంది. ఈ నాలుగు వ్యూహాత్మక స్తంభాల ఆధారంగా భారత్ దీనిని నిర్వహిస్తోంది.
‘సమతుల్య పాత్ర’
బ్రిక్స్ ను అమెరికా లేదా పశ్చిమ దేశాలకు పూర్తిగా వ్యతిరేక వేదికగా మార్చాలని చైనా, రష్యాలు భావించినా.. భారత్ దానిని కేవలం ఆర్థిక, అభివృద్ధి వేదికగానే నిలిపింది. ఇది అమెరికాకు కూడా భారత్‌పై నమ్మకాన్ని పెంచింది. గ్లోబల్ సౌత్ నాయకత్వం: ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాలకు భారత్ విశ్వసనీయమైన ప్రతినిధిగా అవతరించింది.
భారత్.. స్ట్రాటజిక్ ఆటానమీ…
ఈసారి సదస్సులో భారత్ ప్రదర్శించిన దౌత్యాన్ని ‘మల్టీ-అలైన్మెంట’ లేదా ‘స్ట్రాటజిక్ ఆటానమీ’కి ఒక బలమైన ఉదాహరణగా చూడొచ్చు. ఒకరితో ఉన్న సంబంధాన్ని మరొకరికి వ్యతిరేకంగా మార్చకుండా భారత్ తన ప్రయోజనాలను కాపాడుకుంటోంది అని చెప్పడం సరైందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధం, అమెరికా-చైనా పోటీ, రష్యా-పశ్చిమ విభేదాలు ఒకేసారి నడుస్తున్న సమయంలో ఈ సమీకరణ మరింత ఆసక్తికరంగా మారింది. 2026 బ్రిక్స్ సమావేశం కూడా ఇదే సంక్లిష్ట పరిస్థితుల మధ్య జరిగింది. ఒకవైపు అమెరికా.. మరోవైపు రష్యా, చైనా, ఇరాన్… భారత్ విదేశాంగ విధానంలోని అసలు ప్రత్యేకత ఇక్కడే కనిపిస్తుంది.అమెరికాతో భారత్‌కు క్వాడ్ రక్షణ సహకారం, టెక్నాలజీ, పెట్టుబడులు, ఇండో-పసిఫిక్ వంటి అనేక వ్యూహాత్మక బంధాలు ఉన్నాయి. రష్యా నుంచి రక్షణ, ఇంధన సంబంధాలు కొనసాగుతున్నాయి.
చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలున్న ప్పటికీ వాణిజ్యం, దౌత్య సంభాషణ కొనసాగుతోంది. ఇరాన్‌తో చారిత్రక, ఇంధన, చాబహార్ పోర్ట్ వంటి వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నాయి. గల్ఫ్ దేశాలతో కూడా భారత్ భారీగా ఆర్థిక, ఇంధన, ప్రవాస భారతీయుల సంబంధాలు కొనసాగిస్తోంది. ఇవన్నీ ఒకేసారి నిర్వహించడం సులభం కాదు. భారత విధానం ‘ఎవరి శిబిరంలో ఉండాలి’ అన్న ప్రశ్న కంటే ‘ఏ అంశంలో భారత ప్రయోజనం ఎక్కడ ఉంది’ అన్న ప్రశ్న చుట్టూ తిరుగుతోంది. ఇదే స్ట్రాటజిక్ ఆటానమీ. 2026 న్యూఢిల్లీ BRICS సదస్సు తర్వాత భారత్ దౌత్యశక్తి గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరగడానికి బలమైన కారణాలున్నాయి. అయితే దీన్ని “మోడీ అన్ని దేశాలను ఒకేసారి తన వైపు తిప్పుకున్నారు” అని చూడటం కంటే, భారత్ అందరితో పనిచేయగల ‘స్ట్రాటజిక్ ఆటోనమీ’ని ప్రదర్శించింది అని చెప్పడం మరింత కరెక్ట్.
బ్రిక్స్‌లో కుదిరిన ఒప్పందాలు..!
స్వదేశీ కరెన్సీ వాణిజ్యం
డాలర్ ఆధిపత్యాన్ని తగ్గిస్తూ, సభ్యదేశాలు తమ స్వదేశీ కరెన్సీల (రూపాయి, రూబుల్, యువాన్, ఇత్యాది)లలోనే వాణిజ్య చెల్లింపులు చేసుకునేలా చెల్లింపుల వ్యవస్థను మరింత విస్తరించడానికి అంగీకారం కుదిరింది.నేషనల్ డిజిటల్ పేమెంట్ సిస్టమ్స్ (భారతీయ UPI తరహా) అనుసంధానానికి సూత్రప్రాయ సమ్మతి తెలిపారు.
ఎంఎసఎంఇ పోర్టల్, స్టార్టప్ ఇంక్యుబేటర్ నెట్వర్క్
భారత ప్రతిపాదన మేరకు చిన్న, మధ్య తరహా పరిశ్రమల వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు బ్రిక్స్ ఎంఎసఎంఇ కో ఆపరేషన్ పోర్టల్ ఏర్పాటుపై ఒప్పందం కుదిరింది.యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి బ్రిక్స్ ఇన్‌క్యుబేటర్స్ నెట్ వర్క్ మరియు బ్రిక్స్ స్టోర్టప్ ఇన్నోవేషన్ ఫండ్‌ను ఏర్పాటు చేయడానికి సమ్మతించారు.
డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత కొద్ది దేశాల చేతుల్లోనే ఉండిపోకుండా ఓపెన్ సోర్స్ విధానంలో సురక్షిత ఏఐ పాలనకు ఒప్పందాలు కుదిరాయి. భారత్ అభివృద్ధి చేసిన డిపిఐ పరిష్కారాల డిపాజిటరీని స్థాపించడానికి సభ్యదేశాలు అంగీకరించాయి.
బ్రిక్స్ గ్రెయిన్ ఎక్స్ఛేంజ్
ప్రపంచ ఆహార భద్రతను కాపాడేందుకు సభ్యదేశాల మధ్య ధాన్యాలు, విత్తనాలు మరియు వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం కోసం ఒక ఉమ్మడి వేదికను నిర్మించడానికి అంగీకరించారు.
ఆరోగ్య రంగం – మెంటల్ హెల్త్ ప్లాట్‌ఫారమ్
మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించడానికి భారత్‌లోని ‘నిమ్హాన్స’ సమన్వయంతో బ్రిక్స్ నెట్వర్స్ సెంటర్స్‌ని ఏర్పాటు చేసేందుకు భారత్ అంగీకారాన్ని తెలిపింది.








