రాజకీయాల్లో హుందాతనానికి ప్రతీక ఆళ్ల నాని : మంత్రి నారా లోకేష్
ఆళ్ల నాని కుటుంబానికి పార్టీ పరంగా, వ్యక్తిగతంగా అండగా ఉంటాం
ఆళ్ల నాని పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన మంత్రి నారా లోకేష్
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ఒక మంచి వ్యక్తిని కోల్పోయిందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఉపముఖ్యమంత్రి, టీడీపీ నేత ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) పార్థివదేహానికి మంత్రి నారా లోకేష్ ఘన నివాళులర్పించారు. గురువారం ఏలూరులోని ఆళ్ల నాని నివాసానికి చేరుకున్న లోకేష్.. ఆళ్ల నాని పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాని కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ సందర్భంగా మీడియాతో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. “ఆళ్ల నాని మృతి బాధాకరం. ఆంధ్ర రాష్ట్రం ఒక మంచి వ్యక్తిని కోల్పోయింది. నాని అన్న మంత్రిగా ఉన్న సమయంలో నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. సభలో అనేక అంశాలపై ఆయనతో చర్చించేవాడిని. అయితే ఏనాడూ వ్యక్తిగత విమర్శలకు వెళ్లకుండా హుందాతనంగా ఆయన వ్యవహరించేవారు” అని లోకేష్ తెలిపారు.
“రాజకీయాల్లో రాజనీతి ఉండాలని బలంగా నమ్మిన వ్యక్తి ఆళ్ల నాని అన్న. వ్యక్తిగత దూషణలకు ఆయన ఎప్పుడూ దూరంగా ఉండేవారు, ప్రజలు మనకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజల సమస్యల గురించి మాట్లాడేందుకే ఉపయోగించాలనే భావనతో ఆయన ఉండేవారు” అని చెప్పారు.
ఇవి కూడా చదవండి
“ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా ఆళ్ల నాని సమాజానికి చేసిన సేవలు చరస్మరణీయం. ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకోవాలి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి ప్రజలకు సేవ చేయాలని, నమ్ముకున్న నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి నాని అన్న” అని పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీలో ఆళ్ల నాని చేరిన సమయంలో తాను ఆయనతో చెప్పిన విషయాలను మంత్రి గుర్తుచేశారు. “ఐదు సంవత్సరాలుగా మిమ్మల్ని దగ్గరుండి చూసిన వ్యక్తిని. మీరు ఎప్పుడూ లక్ష్మణ రేఖ దాటే వ్యక్తి కాదు. క్రమశిక్షణ అనే పాఠశాల మీది. మీలాంటి వ్యక్తులు రాజకీయాల్లో నడుచుకునే తీరును చూసి మాలాంటి యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పాను” అని లోకేష్ తెలిపారు. అలాంటి మంచి వ్యక్తి ఈరోజు తమ మధ్య లేకపోవడం అత్యంత బాధాకరమన్నారు. ఆళ్ల నాని కుటుంబానికి తెలుగుదేశం పార్టీ పరంగా, వ్యక్తిగతంగా ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నాని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆళ్ల నాని అంత్యక్రియలు జరుగుతున్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంత్రి కొలుసు పార్థసారథి అక్కడే ఉండి అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ తరపున ఆళ్ల నానికి ఘన నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆళ్ల నాని ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, డా. నిమ్మల రామానాయుడు, ఎంపీ పుట్టా మహేష్ కుమార్, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, మద్దిపాటి వెంకటరాజు, సొంగా రోషన్ కుమార్, పత్సమట్ల ధర్మరాజు, ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఏపీఎస్ఆర్టీసీ రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏపీ భవన నిర్మాణ, ఇతర నిర్మాణాల కార్పొరేషన్ చైర్మన్ వలవల బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.








