ఆపాలనుకున్న సినిమానే అంతటా హాట్ టాపిక్! ‘NAZA’ను చుట్టుముట్టిన అసలు వివాదం ఇదే
—సూర్య ప్రకాష్ జోశ్యుల
కొన్ని సార్లు ఒక సినిమాకు వచ్చిన ప్రశంసల కంటే, దాన్ని ఆపాలనే ప్రయత్నమే దానికి ఎక్కువ ప్రచారం తెచ్చి పెడుతుంది. ‘NAZA’ విషయంలో ఇప్పుడు జరుగుతున్నది దాదాపు అలాంటిదే. వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో 25 నిమిషాల పాటు ప్రేక్షకులు నిలబడి చప్పట్లు కొట్టిన ఈ డాక్యుమెంటరీ, ఆ తర్వాత ఇజ్రాయెల్‌లో రాజకీయ వివాదానికి కేంద్రంగా మారింది.
ఏకంగా ఈ సినిమా దర్శకుల పౌరసత్వాన్ని రద్దు చేసేలా బిల్లులు తీసుకొస్తామని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించడంతో, అసలు సినిమా ఏం ఉంది అనే దానికంటే దాన్ని ఎందుకు అడ్డుకోవాలనుకుంటున్నారు? అనే ప్రశ్నే ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. అసలేం జరిగింది..ఆ డాక్యుమెంటరీ సినిమాలో ఏముంది?
వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఒక సినిమా ప్రదర్శితమైంది. ప్రేక్షకులు 25 నిమిషాల పాటు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత ఆ సినిమాకు స్పెషల్ జ్యూరీ ప్రైజ్ వచ్చింది. ఆ క్షణం వరకూ అది ఒక సక్సస్ ఫుల్ డాక్యుమెంటరీ కథే. అయితే ఆ తర్వాత పరిణామాలు ఊహించని మలుపు తీసుకున్నాయి. ఆ సినిమా పేరు ‘NAZA’.
25 నిమిషాల చప్పట్ల నుంచి రాజకీయ వివాదం వరకు
‘NAZA’కు దర్శకత్వం వహించింది ఇజ్రాయెలీ యూదులైన యువల్ అబ్రహామ్, రాచెల్ స్జోర్. ఇద్దరూ గతంలో ఆస్కార్ గెలుచుకున్న డాక్యుమెంటరీ ‘No Other Land’ కు కూడా దర్శకులుగా పనిచేశారు. ఈసారి వారు గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యల సమయంలో పౌరుల మరణాలు, వాటిని సైనిక వ్యవస్థలో ఎలా పరిగణిస్తారనే అంశంపై దృష్టి పెట్టారు.
సినిమా వెనిస్లో పోటీ విభాగంలో ప్రదర్శితమై 25 నిమిషాల స్టాండింగ్ ఒవేషన్ అందుకుంది. అనంతరం స్పెషల్ జ్యూరీ ప్రైజ్ గెలుచుకుంది. అయితే ఇజ్రాయెల్‌లో మాత్రం దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
‘NAZA’ అనే పేరులోనే కథకు క్లూ
‘NAZA’ అనేది హీబ్రూ పదబంధం ‘Nezek Agavi’ కి సంక్షిప్త రూపం. సాధారణంగా దీనిని “collateral damage”, అంటే సైనిక దాడుల్లో జరిగే పౌర నష్టంగా అర్థం చేసుకోవచ్చు. సినిమా ఈ పదం వెనుక ఉన్న అసలు మానవ కథను చెప్తుంది.
డాక్యుమెంటరీలో ఏముంది
యువల్ అబ్రహామ్ స్వయంగా కెమెరా ముందు కనిపిస్తూ వివిధ వ్యక్తులను ఇంటర్వ్యూ చేస్తారు. ఇజ్రాయెల్ సైనిక, ఇంటెలిజెన్స్ వ్యవస్థలో పనిచేసిన కొంతమంది వ్యక్తుల వాంగ్మూలాల ఆధారంగా, కొన్ని దాడుల్లో ఎంతమంది పౌరులు చనిపోవడాన్ని “అంగీకరించదగిన నష్టం”గా పరిగణించేవారనే విషయాన్ని డాక్యుమెంటరీ ప్రస్తావిస్తుంది.
కొన్ని సందర్భాల్లో ఈ సంఖ్య తక్కువగా ఉండగా, మరికొన్ని సందర్భాల్లో 200 లేదా 500 మంది వరకు పౌరుల మరణాల స్థాయిలో ఉండేదని సినిమాలోని ఇంటర్వ్యూలు చెబుతాయి. అయితే ఇవి సినిమా ప్రదర్శించిన వాదనలు మాత్రమే. వాటిని స్వతంత్రంగా ధృవీకరించడం సాధ్యం కాదు. అదే సమయంలో ఇజ్రాయెల్ సైన్యం ఈ ఆరోపణలను తిరస్కరిస్తోంది.
అసలు వివాదం ఇక్కడే మొదలైంది
సినిమా ప్రశ్నించిన విషయం ఒకటి. కానీ దానికి ప్రభుత్వ ప్రతిస్పందన మరో పెద్ద ప్రశ్నను తెచ్చింది. నెతన్యాహు రెండు బిల్లులను ప్రతిపాదించనున్నట్లు ప్రకటించారు. మొదటిది, IDF సైనికులను అవమానించే లేదా అపవాదం చేసే వ్యక్తుల పౌరసత్వాన్ని రద్దు చేసే అవకాశం కల్పించడంపై. రెండోది, ఇలాంటి పరువు నష్టం కేసుల్లో విధించే నష్టపరిహారాన్ని 20 రెట్లు పెంచడం గురించి. ఇవి ప్రస్తుతం ప్రతిపాదిత చర్యలు మాత్రమే. ఇంకా చట్టంగా మారలేదు. అయితే ఈ ప్రకటనతో ‘NAZA’పై చర్చ మరో దిశకు మళ్లింది.
సినిమా ఏం చెప్పింది? అనే దాని కన్నా, ఒక దేశంలో సైన్యాన్ని, ప్రభుత్వ విధానాలను ఎంతవరకు బహిరంగంగా విమర్శించవచ్చు? అనే ప్రశ్న ముందుకొచ్చింది.
“విమర్శకు హద్దు ఎక్కడ?”
‘NAZA’ వివాదంలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దర్శకులు ఇద్దరూ ఇజ్రాయెల్‌కు చెందినవారే. అంటే ఇది పూర్తిగా బయట నుంచి వచ్చిన విమర్శ కాదు. వారు తమ దేశ సైనిక చర్యలను ప్రశ్నించారు.
దాంతో ఒక పౌరుడు తన దేశ సైన్యం గురించి తీవ్రమైన ఆరోపణలు చేస్తే అది దేశద్రోహమా? లేక ప్రజాస్వామ్యంలో ఉండాల్సిన విమర్శా? అనే చర్చ మొదలైంది. సైనికుల గౌరవాన్ని కాపాడటం, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు…ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎక్కడ, ఎంతవరకూ ఉండాలి?
‘NAZA’ వివాదం ఇప్పుడు ఈ ప్రశ్నలను ముందుకు తెచ్చింది.
ఇజ్రాయెల్‌లోనే తీవ్ర వ్యతిరేకత మాజీ ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలి బెన్నెట్ కూడా సినిమాను, దాని దర్శకులను తీవ్రంగా విమర్శించారు. ఇజ్రాయెల్ సైనికులను “genocide”కు పాల్పడుతున్న వారిగా చూపించడం ధైర్యమైన కళ కాదని, అది “cowardly blood libel” అని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు దర్శకులపై వచ్చిన బహిరంగ బెదిరింపులు, వారి కుటుంబాల చుట్టూ ఏర్పడిన ఒత్తిడిపై పత్రికా స్వేచ్ఛా సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.
వివాదమే ప్రచారం
ఏ సినిమాకైనా సాధారణంగా ప్రచారం రావడానికి ఫిల్మ్ ఫెస్టివల్స్, మీడియా, ప్రమోషన్ అవసరం. ‘NAZA’కు మాత్రం మరో రకమైన ప్రచారం వచ్చింది. వెనిస్లో వచ్చిన ప్రశంసలు దాన్ని ఫిల్మ్ ఫెస్టివల్ ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాయి. అదే సమయంలో దర్శకుల పౌరసత్వంపై జరిగిన రాజకీయ చర్చ దాన్ని అంతర్జాతీయ రాజకీయ, మీడియా చర్చలోకి తీసుకొచ్చింది.
ఏదైమైనా…
వెనిస్లో 25 నిమిషాల చప్పట్లతో మొదలైన ‘NAZA’ కథ ఇప్పుడు సినిమా పరిధిని దాటి యుద్ధం, పౌరుల ప్రాణాల విలువ, జాతీయ విధేయత, భావ ప్రకటనా స్వేచ్ఛ వంటి అంశాల మధ్యకు చేరింది. అందుకే ఈ సినిమా ఇప్పుడు కేవలం ఒక డాక్యుమెంటరీ కాదు. ఆపాలనుకున్న సినిమానే… మరింత హాట్ టాపిక్‌గా మారిన కథ.








