భూ వివాదాల రగడ.. తేల్చుకుందామన్న బీఆర్ఎస్
తెలంగాణలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. సీఎం రేవంత్ రెడ్డి తమపై చేస్తున్న భూ ఆరోపణలను బీఆర్ఎస్ నాయకులు గట్టిగా తిప్పికొట్టారు. కేసీఆర్, హరీశ్‌రావుతో పాటు తమ కుటుంబ సభ్యులపై వస్తున్న నిరాధార ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ హయాంలో జరిగిన అన్ని భూ లావాదేవీలపై సిట్టింగ్ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ఆయన సవాల్ విసిరారు.
ప్రజల సమస్యలను, ఆరు గ్యారంటీల అమలును ప్రశ్నిస్తున్న ప్రతిపక్షంపై ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని హరీశ్‌రావు మండిపడ్డారు. 22ఏ నిషేధిత భూముల సమస్య పరిష్కారం కోసం కమిటీలు వేయడం కేవలం కాలయాపనేనని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. నిషేధిత జాబితా 3.71 లక్షల ఎకరాల నుండి దాదాపు 30 లక్షల ఎకరాలకు పెరిగిందని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించారని, కలెక్టర్లు సరైన పరిశీలన లేకుండా పాత జాబితాలను అప్లోడ్ చేశారని సీఎం చెప్పినట్లు హరీశ్‌రావు గుర్తుచేశారు. తప్పు చేసిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. దీనికి బాధ్యులు ఎవరని ఆయన నిలదీశారు. అంతేకాకుండా భు భారతి పోర్టల్ ద్వారా యజమానులకు తెలియకుండానే 9,200కు పైగా భూముల రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయని ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
ఇవి కూడా చదవండి
తమ భూముల విషయాలపైన హరీశ్‌రావు స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ ఆస్తులపై విమర్శనాస్త్రాలు సంధించారు. రేవంత్ రెడ్డి కుటుంబానికి కోట్ర గ్రామంలోనే 308 ఎకరాల ఆస్తులున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని, ఇందులో 175 ఎకరాలకు సంబంధించిన పక్కా డాక్యుమెంట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. దీనికి తోడు కొండారెడ్డిపల్లిలో 77 ఎకరాలు ఉన్నాయని, ఇవన్నీ రేవంత్ కుటుంబం పేరిట ఉన్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తమ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్ విస్తీర్ణంపై గతంలో వెయ్యి ఎకరాలంటూ తప్పుడు ప్రచారం చేసి, అసెంబ్లీకి వచ్చేసరికి అది 67 ఎకరాలేనని సీఎం ఒప్పుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే తమ గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని, అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేల పట్ల వ్యవహరించిన తీరును ఆయన ఖండించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పక్షపాత ధోరణి వీడి, భూ ఆక్రమణల ఆరోపణలపై నిజాలు నిగ్గు తేల్చేందుకు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధపడాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.








