రోహిత్ శర్మపై చేతన్ శర్మ సంచలన వ్యాఖ్యలు..!
టీమిండియా వన్డే జట్టులో సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ (Rohit Sharma) భవిష్యత్తుపై గత కొంతకాలంగా జోరుగా చర్చ సాగుతోంది. అక్టోబర్ 4 తర్వాత ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీ కాలం ముగియనుండటంతో, రోహిత్ వన్డే కెరీర్‌పై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ తరుణంలో టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్, మాజీ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ (Chetan Sharma) సోమవారం నాడు రోహిత్ శర్మకు మద్దతుగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై వస్తున్న విమర్శలను చేతన్ శర్మ పూర్తిగా కొట్టిపారేశారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “ప్రజలు ఎన్నైనా మాట్లాడుకుంటారు, కానీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు భారత క్రికెట్‌కు దొరికిన ‘కోహినూర్’ వజ్రాలు లాంటివారు. వయస్సు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే. వారు ఫిట్‌గా ఉండి, జట్టుకు విజయాలు అందిస్తున్నప్పుడు వారి వయస్సుతో పనేంటి?” అని ప్రశ్నించారు. రోహిత్ శర్మ ఇటీవల లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌పై అద్భుత సెంచరీ సాధించాడని, విరాట్ కూడా ప్రతి మ్యాచ్‌లోనూ రాణిస్తున్నాడని గుర్తుచేశారు. భారతదేశానికి ఎన్నో ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ ట్రోఫీ అందించిన రోహిత్ పట్ల మనం కృతజ్ఞతతో ఉండాలని హితవు పలికారు.
రాబోయే 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఆడే అవకాశాలపై కూడా చేతన్ శర్మ సానుకూలంగా స్పందించారు. వారి ప్రస్తుత ఫిట్నెస్, ఫామ్ చూస్తుంటే వారు తదుపరి వరల్డ్ కప్ బరిలో నిలిచేందుకు బలమైన అర్హత ఉందని మద్దతు పలికారు. అలాగే బీసీసీఐ డొమెస్టిక్ క్రికెట్‌కు ఇస్తున్న ప్రాధాన్యతను ఆయన అభినందించారు. జపాన్‌లో జరగబోయే 2026 ఆసియా క్రీడల్లో భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు రెండు కూడా ఖచ్చితంగా స్వర్ణ పతకాలు సాధిస్తాయనే నమ్మకాన్ని ఆయన వ్యక్తంచేశారు.








