₹2,000 దాటితే పెట్రోలు Cash తోనే పోయించుకోవాల్సిందేనా? UPIపై కొత్త ట్విస్ట్!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
మనం ఉదయాన్నే ఆఫీసుకో లేదా ఏదైనా పనిమీదో బయలుదేరి, ఖాళీగా ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ చూసి పెట్రోల్ బంక్‌లోకి వెళ్తాం. రెండు మూడేళ్ల క్రితం వరకు జేబులో పర్స్ ఉందో లేదో అని వెతుక్కునేవాళ్లం. కానీ ఇప్పుడు జేబులో రూపాయి లేకపోయినా ధైర్యంగా వెళ్తున్నాం. ఎందుకంటే ₹2,000 లేదా ₹3,000 ఎంతైనా సరే.. బండికి ఫుల్ ట్యాంక్ కొట్టించి, బైక్ మీద ఉన్న QR కోడ్‌ను ఫోన్‌తో ఒక్క స్కాన్ చేస్తే పని పూర్తవుతుంది.
కానీ అక్టోబర్ 15 తర్వాత నుంచి ఈ అలవాటుకు కాస్త బ్రేక్ పడేలా కనిపిస్తోంది. బంక్ దగ్గర క్యూలో నిలబడి స్కాన్ చేయబోతుంటే, “సార్.. ₹2,000 దాటితే Cash ఉంటేనే ఇవ్వండి” అనే మాట వినిపిస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
అసలు అక్టోబర్ 15 నుంచి మారేదేంటి?
National Payments Corporation of India (NPCI) తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, అక్టోబర్ 15 నుంచి ₹2,000 కంటే ఎక్కువ విలువైన డిజిటల్ లావాదేవీలపై Merchant Discount Rate (MDR) వర్తించనుంది. అంటే మీరు పెట్రోల్ బంక్‌లో ₹2,000 దాటి పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేసి UPI ద్వారా చెల్లిస్తే, ఆ లావాదేవీపై ప్రతి ₹2,000కు ₹5 వరకు MDR ఖర్చు పడుతుంది.
అయితే ఇక్కడ మీరు గుర్తించాల్సిన ముఖ్య విషయమేంటంటే.. ఈ ₹5 ని మీ ఖాతా నుంచి కట్ చేయరు. మీరు ఎంత పెట్రోల్ కొట్టిస్తే అంతే అమౌంట్ మీ UPI నుంచి డెబిట్ అవుతుంది. కానీ, ఆ చెల్లింపును స్వీకరించినందుకు గాను ఆ ₹5 ఖర్చును పెట్రోల్ బంక్ యజమాని భరించాల్సి ఉంటుంది.
పెట్రోల్ బంక్ యజమానులకు ఎందుకంత భయం?
“అదేంటి.. ₹3,000 బిల్లుపై ₹5 అంటే చాలా చిన్న మొత్తమే కదా!” అని మనకు అనిపించవచ్చు. కానీ పెట్రోల్ బంక్ వ్యాపారంలో లెక్కలు వేరుగా ఉంటాయి. బంక్ డీలర్లకు లీటర్ పెట్రోల్‌పై సుమారు ₹3.90, డీజిల్‌పై ₹2.50 వరకు మాత్రమే మార్జిన్ లాభం ఉంటుంది. రోజుకు వందలాది వాహనాలు వచ్చి పెద్ద మొత్తంలో UPI చెల్లింపులు చేసినప్పుడు, ఆ ₹5లన్నీ కలిసి నెలాఖరుకు బంక్ యజమానికి పెద్ద మొత్తంలో భారంగా మారతాయి.
అందుకే ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి అనేక రాష్ట్రాల్లోని డీలర్లు ఈ విధానంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఖర్చును తాము భరించలేమని, ₹2,000 దాటిన లావాదేవీలకు UPI వద్దని చెప్పే ఆలోచనలో ఉన్నారు.
వినియోగదారులపై దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది?
దీనర్థం ప్రభుత్వం “₹2,000 దాటితే UPI వాడకూడదు” అని రూల్ పెట్టిందని కాదు. ప్రభుత్వం UPIని ఆపలేదు, కస్టమర్లపై నేరుగా ఎలాంటి ఛార్జీలూ వేయలేదు. అలాగే అక్టోబర్ 15 తర్వాత దేశవ్యాప్తంగా అన్ని బంకుల్లోనూ UPI ఆగిపోదు. కానీ, MDR భారాన్ని భరించలేని కొందరు బంక్ యజమానులు మాత్రం ₹2,000 దాటితే Cash అడగడం లేదా కార్డు చెల్లింపుల వైపే మొగ్గు చూపడం వంటి పరిమితులు విధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పండగల వేళ వ్యాపారులకు మరో పరీక్ష
సరిగ్గా పండగల సీజన్ మొదలయ్యే అక్టోబర్ 15 నుంచే ఈ కొత్త మార్గదర్శకాలు రానుండటంతో పెట్రోల్ బంకులే కాకుండా ఇతర వ్యాపార వర్గాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. బట్టలు, ఎలక్ట్రానిక్స్, బంగారు ఆభరణాలు కొనే సమయంలో పెరిగే పెద్ద లావాదేవీలపై Merchant cost పెరిగితే, చిన్న వ్యాపారులు మళ్లీ డిజిటల్ చెల్లింపులను పక్కనపెట్టి Cash వ్యవహారాల వైపే వెళ్లే ప్రమాదం ఉందని Retailers Association భయపడుతోంది.
చివరకు ఇంటింటికీ LPG గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే డిస్ట్రిబ్యూటర్లు కూడా, చేతిలో Cash ఉంటే దొంగతనాల భయం ఉంటుందని, UPIనే నమ్ముకున్న తమకు ఈ కొత్త ఛార్జీలు ఇబ్బందిగా మారాయని అంటున్నారు.
డిజిటల్ ఇండియాకు కొత్త సవాలు!
ఇన్నాళ్లూ “జేబులో నయా పైసా అక్కర్లేదు.. ఫోన్ ఉంటే చాలు” అని ధైర్యంగా తిరిగిన మనకు, ఈ కొత్త మార్పు కాస్త వింతగానే అనిపిస్తుంది. ప్రభుత్వం ఏమో డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థ దీర్ఘకాలంలో నిలదొక్కుకోవాలంటే ఈ ఛార్జీలు అవసరమేనని చెబుతోంది. వ్యాపారులేమో ఇప్పటికే తక్కువ మార్జిన్లతో పనిచేస్తున్న తమపై ఈ భారం వేయడం సరికాదంటున్నారు.
ఏది ఏమైనా, అక్టోబర్ 15 తర్వాత మీరు ఫుల్ ట్యాంక్ కొట్టించడానికి పెట్రోల్ బంక్‌కు వెళ్తే.. UPI స్కాన్ చేసే ముందు “Cash ఏమైనా ఉందా?” అని బంక్ సిబ్బంది అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు!








