పరీక్షలో ChatGPT వాడిన IIT స్టూడెంట్.. కొన్ని గంటల్లోనే విషాదం: బాధ్యత ఎవరిది?
ఒకప్పుడు పరీక్షరాసేటప్పుడు సమాధానం గుర్తుకు రాకపోతే.. కాసేపు కళ్లుమూసుకుని ఆలోచించేవాళ్లం. వేరే ప్రశ్నకు వెళ్లి, మళ్లీ వచ్చి తిరిగి ప్రయత్నించేవాళ్లం. ఇప్పుడు అదే పరిస్థితిలో చేతిలో ఫోన్ ఉంటే.. ఒక్క ChatGPTని తెరిస్తే సరిపోతుంది. సమాధానం క్షణాల్లో మన ముందుంటుంది అనే ఆలోచన వచ్చేస్తోంది. ఇది కాలం తెచ్చిన మార్పు. అయితే ఆ మార్పు కొన్ని విషాదాలకు దారి తీస్తే …ఎవరు దానికి భాథ్యత తీసుకుంటారు?.. ఇప్పుడు ముంబై IIT విద్యార్ధి ఆత్మహత్య మన తరం ముందు కొన్ని నైతిక ప్రశ్నలు ఉంచుతోంది.
అసలేం జరిగింది
ఒక పరీక్ష.. ఒక మొబైల్ ఫోన్.. ChatGPTలో కొన్ని సమాధానాల కోసం ప్రయత్నం. అంతే. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే IIT బాంబే క్యాంపస్‌లో ఊహించని విషాదం చోటుచేసుకుంది. 19 ఏళ్ల రెండో సంవత్సరం బీటెక్ విద్యార్థి శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం మిడ్-సెమిస్టర్ పరీక్షలో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ ChatGPTలో సమాధానాలు వెతుకుతున్నట్లు గుర్తించిన తర్వాతే ఈ ఘటన జరగడం కలకలం రేపింది.
మృతిచెందిన విద్యార్థి IIT బాంబేలోని Energy Science and Engineering విభాగంలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం జరిగిన మిడ్-సెమిస్టర్ పరీక్షలో అతను మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. పరీక్ష ప్రశ్నపత్రాన్ని ChatGPTలోకి అప్లోడ్ చేసి సమాధానాలు పొందేందుకు ప్రయత్నించినట్లు IIT బాంబే అధికారికంగా వెల్లడించింది. అయితే అతనిపై ఎలాంటి disciplinary action తీసుకోలేదు.
పరీక్షలో జరిగిన ఘటనపై కోర్సు ఇన్స్ట్రక్టర్, విభాగాధిపతి అతనితో మాట్లాడారు. కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ ఘటన అతని అకడమిక్ కెరీర్‌పై ప్రతికూల ప్రభావం చూపదని హామీ ఇచ్చినట్లు IIT బాంబే తెలిపింది.
ఆ తర్వాత విద్యార్థి తన హాస్టల్ గదికి వెళ్లాడు. కొంతసేపటికే హాస్టల్-4లో అతను ఉరి వేసుకుని ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని రాజావాడి ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. గదిలో పంచనామా నిర్వహించి, ఘటనకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు ప్రారంభించారు.
క్యాంపస్‌లో ఒక్కసారిగా కలకలం
విద్యార్థి మరణించిన విషయం క్యాంపస్‌లో వేగంగా వ్యాపించింది. రాత్రి సుమారు 8:30 గంటలకు 400 మందికి పైగా విద్యార్థులు IIT బాంబే ప్రధాన భవనం వద్దకు చేరుకున్నారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఘటనపై బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
కొంతమంది విద్యార్థులు.. మృతిచెందిన విద్యార్థిని సస్పెండ్ చేస్తామని ముందుగానే బెదిరించారని ఆరోపించారు. అయితే IIT బాంబే ఈ ఆరోపణలను ఖండించింది. విద్యార్థిపై ఎలాంటి సస్పెన్షన్ లేదా ఇతర క్రమశిక్షణ చర్యలు ప్రారంభించలేదని స్పష్టం చేసింది.
రాత్రి సుమారు 10:30 గంటలకు IIT బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ షిరీష్ కేదారే నిరసన చేస్తున్న విద్యార్థులను కలిశారు. అనంతరం విద్యార్థుల సమావేశం కన్వొకేషన్ హాల్‌కు మారింది. ఆ తర్వాత కొనసాగుతున్న మిడ్-సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.
అసలు కారణం ఏమిటి?
విద్యార్థి ఆత్మహత్యకు పరీక్షలో ChatGPT ఉపయోగించిన ఘటన ఒక్కటే కారణమని ఇప్పుడే చెప్పలేం. అతని వ్యక్తిగత పరిస్థితులు, మానసిక స్థితి, ఇతర ఒత్తిళ్లు సహా పూర్తి నేపథ్యం దర్యాప్తులోనే స్పష్టమవుతుంది.
ఫైనల్ గా ..
ప్రతి కొత్త సౌకర్యం మన జీవితాన్ని సులభం చేసినంత మాత్రాన.. దాని వెంట వచ్చే ప్రతి పరిణామానికి సమాధానం కూడా మన దగ్గర ఉంటుందని అనుకోవటానికి వీలు లేదు. ఒక టెక్నాలజీ మన ఆలోచనల్లోకి, చదువులోకి, పనిలోకి, చివరికి మన వ్యక్తిగత జీవితాల్లోకి కూడా ఇంత లోతుగా ప్రవేశించినప్పుడు.. దాని ప్రభావంతో ఏదైనా విషాదం జరిగితే బాధ్యత ఎవరిది?
AIదా? దాన్ని ఉపయోగించిన మనిషిదా? దాని వినియోగానికి ఇంకా సరైన నియమాలు రూపొందించని వ్యవస్థదా? లేక టెక్నాలజీని మన జీవితాల్లోకి తీసుకొచ్చిన సమాజం మొత్తానిదా? ముంబై IIT విద్యార్థి ఆత్మహత్య మన తరం ముందు ఇలాంటి ప్రశ్నలను ఉంచుతోంది. ఎందుకంటే టెక్నాలజీకి మనం బాధ్యత అప్పగించగలం.. కానీ మనిషి జీవితానికి సంబంధించిన బాధ్యతను చివరికి ఎవరు తీసుకుంటారు?
—సూర్య ప్రకాష్ జోశ్యుల








