దానం నాగేందర్ ఉప ఎన్నికలో పోటీ చేయొచ్చా?
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. స్పీకర్ నిర్ణయాన్ని పక్కన పెట్టి, ఆయనను ఎమ్మెల్యే పదవి నుంచి అనర్హుడిగా ప్రకటిస్తూ నియోజకవర్గ స్థానం ఖాళీగా ఉన్నట్లు ధర్మాసనం తేల్చిచెప్పింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ కండువాతో గెలిచి, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ గూటికి చేరి, ఏకంగా సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుండి హస్తం పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసిన దానానికి ఈ తీర్పు కోలుకోలేని షాకే.
అయితే.. తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని.. ఉప ఎన్నిక వస్తే పోటీ చేసి గెలుస్తానని దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఒకటే చర్చ నడుస్తోంది. ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు పడిన నేతలకు మళ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉంటుందా? చట్టం ఏం చెబుతోంది? గతంలో ఇలాంటి కేసుల్లో ఏం జరిగిందని ఆరా తీస్తున్నారు.
పదో షెడ్యూల్ ప్రకారం ఫిరాయింపుల కింద అనర్హత వేటు పడిన ప్రజాప్రతినిధులు వెంటనే ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిబంధనేదీ లేదు. చట్టంలో ఎక్కడా నాలుగేళ్లు లేదా ఆరేళ్లు నిషేధిత కాలం ఉండాలని స్పష్టంగా పేర్కొనలేదు. అందువల్ల చట్టప్రకారంగా చూస్తే దానం నాగేందర్ మళ్లీ బరిలో దిగేందుకు అర్హుడే.
ఇందుకు గతంలో జరిగిన పరిణామాలే ఉదాహరణ. 2019లో కర్ణాటకలో ఆపరేషన్ లోటస్ సమయంలో కాంగ్రెస్, జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేస్తూ రెండేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించారు. దీన్ని సవాల్ చేస్తూ అనర్హతకు గురైన ఆ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. కోర్టు వారికి ఉప ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందని స్పష్టమైన తీర్పునిచ్చింది. ఫలితంగా ఆనాడు ఉప ఎన్నికల్లో పోటీ చేసిన మెజారిటీ నేతలు మళ్లీ గెలుపొందారు. దానం విషయంలోనూ హైకోర్టు ఎలాంటి కాలపరిమితి విధించలేదు. కాబట్టి ఆయన నేరుగా బరిలోకి దిగే అవకాశం ఉంది.
చట్టపరంగా అర్హత ఉన్నప్పటికీ, రాజకీయంగా దానం నాగేందర్‌కు ఇది ముప్పేట దాడేనని చెప్పాలి. ఆయన రాజకీయ ప్రస్థానంలో చేదు అనుభవాలు వెంటాడుతున్నాయి. 2004లో ఆసిఫ్‌నగర్ నుంచి టీడీపీ తరఫున గెలిచి, వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత కాంగ్రెస్‌లోకి మారి ఉప ఎన్నికను ఎదుర్కొన్న దానం.. ఎంఐఎం అభ్యర్థి చేతిలో ఓటమి చవిచూశారు. సరిగ్గా అదే సెంటిమెంట్ ఇప్పుడు ఆయనను వెంటాడుతోంది.
ప్రస్తుతం ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక వస్తే విపక్షాలతో పాటు స్థానిక సమీకరణాలు ఎలా ఉంటాయనే టెన్షన్ ఆయనను వేధిస్తోంది. అందరూ ఏకమై ఓడిస్తారేమోననే అంతర్గత భయం ఆయన వర్గంలో వ్యక్తమవుతోంది. అంతకంటే ముఖ్యంగా, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆయనకు మళ్లీ టికెట్ కేటాయిస్తుందా లేదా అనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. పార్టీ మారిన మిగతా నేతల కేసులన్నీ పెండింగ్‌లో ఉండగా, ఒక్క దానం విషయంలోనే కోర్టు కఠిన నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ రాజకీయం మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి!








