రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేయాలి : భట్టి విక్రమార్క
రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితుల వల్ల ఏర్పడిన వర్షపాతం లోటు పరిస్థితిపై ముసాయిదా తీర్మానం – 2026
రాష్ట్రంలో 2026 నైరుతి రుతుపవనాల కాలంలో ఎల్‌నినో పరిస్థితుల కారణంగా తీవ్రమైన వర్షపాతం లోటు తలెత్తింది. సెప్టెంబర్‌లో రుతుపవనాలు మరింత బలహీనపడుతాయని భారత వాతావరణ శాఖ అంచనాలున్నాయి. 2026 జూన్ 1 నుంచి సెప్టెంబర్ 16 వరకు రాష్ట్రంలో సాధారణంగా కురవాల్సిన 664.5 మి.మీ. వర్షపాతానికి గాను 536.5 మి.మీ. మాత్రమే నమోదైంది. 20 శాతం లోటు ఏర్పడింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 19 జిల్లాలు వర్షాభావ కేటగిరీలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావం నెలకొంది.
వర్షపాతం లోటు, వర్షాల మధ్య వ్యవధి ఎక్కువగా ఉండటంతో పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. రాష్ట్రంలో వానాకాలం సాధారణ పంటల సాగు విస్తీర్ణం 139.29 లక్షల ఎకరాలుంటే, కేవలం 88 శాతం విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. వరి సాగు విస్తీర్ణం దాదాపు 18 శాతం తగ్గింది. పంట మొలకెత్తకపోవటంతో పలుమార్లు విత్తనాలు వేయాల్సి రావటంతో రైతులు, కౌలు రైతులపై పెట్టుబడి భారం ఎక్కువైంది.
2026 సెప్టెంబర్ 15 నాటికి రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో 585 టీఎంసీల సామర్థ్యానికి గాను 241 టీఎంసీల లైవ్ స్టోరేజ్ మాత్రమే ఉంది. గత ఏడాది ఇదే రోజున 497 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. ప్రాజెక్టుల్లో నీటి మట్టం తగ్గటంతో, ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు రిజర్వు చేసుకోవాల్సి ఉంది. ఇప్పుడున్న నీటి నిల్వలు యాసంగి పంటలకు సాగునీటిని అందించేందుకు సరిపోవు. భూగర్భ జలాలు తగ్గటం, చెరువులు, కుంటల్లో ఆశించిన నీటి లభ్యత లేనందున తాగునీటి కొరత తలెత్తే అవకాశముంది.
వర్షాభావ పరిస్థితులు రైతులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ ఉపాధి, పశుసంపద, పశుగ్రాసం లభ్యతపై ప్రభావం చూపుతున్నాయి. సాగునీరు, తాగునీటి సరఫరాకు భూగర్భ జలాలు, విద్యుత్తుపై ఆధారపడే పరిస్థితి పెరుగుతోంది.
ఇప్పుడున్న పరిస్థితిని అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక రూపొందించింది. తాగునీటి సరఫరా, నీటి వనరుల పరిరక్షణ, సాగుకు అవసరమైన విద్యుత్తు సరఫరాకు అవసరమైన ఉపశమన చర్యలు చేపడుతోంది. పరిస్థితుల తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తగిన సహాయ సహకారాలను అందించాల్సిన అవసరముంది.
*అందువల్ల సభ్యులందరి మద్దతుతో ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్న అంశాలు *
రాష్ట్రంలో నెలకొన్న వర్షభావ పరిస్థితుల నుంచి ఉపశమన చర్యలు, అధిగమించే చర్యలకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే తగినంత సహాయం అందించాలని తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా కోరుతోంది.
1. ఎల్ నినో పరిస్థితులను క్షేత్రస్థాయిలో అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వీలైనంత త్వరగా రాష్ట్రానికి పంపించాలి. జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (NDRF) నుంచి తగిన సాయం మంజూరు చేయాలి. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF)లో కేంద్ర వాటాను సత్వరమే విడుదల చేయాలి.
2. పంట నష్టం/ఇన్పుట్ సబ్సిడీ, తాగునీరు, పశుగ్రాసం, పశు సంపద పరిరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, చెరువులు, ఇతర జలవనరుల పునరుద్ధరణతో పాటు ఉపశమన చర్యలకు తగిన సహాయం అందించాలి. అవసరమైతే అందుకు వీలుగా నిబంధనలను సడలించాలి.
3. VB-G RAM G పథకంలో 125 రోజుల ఉపాధికి అదనంగా మరో 50 రోజుల ఉపాధి కల్పించాలి. VB-G RAM G పై ఖర్చు పెట్టే వ్యయాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించాలి. రాష్ట్రంలో అమల్లో ఉన్న 60 రోజుల సీజనల్ సస్పెన్షన్ కాలాన్ని సడలించాలి. గ్రామీణ కుటుంబాలకు ఉపాధి భద్రత కల్పించేందుకు లేబర్ బడ్జెట్‌ను తగినంతగా పెంచాలి.
4. రాష్ట్రానికి అవసరమైన ఎరువులను తగినంతగా, సకాలంలో కేటాయించాలి. ప్రభావిత జిల్లాలకు ముందుగానే రేక్‌ల ద్వారా సరఫరా చేయాలి. పర్ డ్రాప్ మోర్ క్రాప్ (PDMC) కింద కేటాయింపులను పెంచి డ్రిప్ ఇరిగేషన్‌ను వేగంగా విస్తరించాలి. మిషన్ ఫర్ ఇంటిగ్రేటేడ్ డెవెలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ( MIDH) కింద కూరగాయల సాగు విస్తీర్ణం పెంపునకు ఆర్థిక సహాయం అందించాలి. ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేయాలి.
5. తెలంగాణకు అదనంగా 1,500 మెగావాట్ల విద్యుత్తు కేటాయించాలి. కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థల్లో కేటాయించకుండా ఉన్న కోటా నుంచి దీన్ని అందించాలి. విండో–I కింద 5 మిలియన్ టన్నుల బొగ్గు లింకేజీ నిర్ధారించి రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు రేక్‌ల లభ్యతను పెంచాలి. విద్యుత్తు ట్రాన్స్ మిషన్ ఛార్జీలను సడలించి, అవసరమైన సాయం అందించాలి.
6. తాగు, సాగు నీటి అవసరాలు, కరువు నివారణ చర్యలకు కేంద్ర ప్రభుత్వం రూ.20 వేల కోట్ల ప్రత్యేక సహాయ ప్యాకేజీ మంజూరు చేయాలి. చెరువులు, నీటి వనరుల పునరుజ్జీవనం, పురోగతిలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడానికి వివిధ కేంద్ర పథకాల కింద తగిన సహాయం అందించాలి.
7. 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఎఫ్ఆర్బీఎం (FRBM) రుణ పరిమితిని జీఎస్డీపీలో 3 శాతం నుంచి 3.5 శాతానికి పెంచాలి. తద్వారా ఉపశమన, నివారణ చర్యలకు అవసరమైన అదనపు వ్యయాన్ని రాష్ట్రం భరించేందుకు అవకాశం కల్పించాలి.
8. రైతులు, బలహీన వర్గాల కుటుంబాలను ఆదుకోవడంతో పాటు తక్షణ సహాయ చర్యలు చేపట్టేందుకు కేంద్ర పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద అదనపు ఆర్థిక సాయం అందించాలి. అందుకు అవసరమైన తీరుగా నిబంధనలను సడలించాలి.
భట్టి విక్రమార్క
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి








