నిమ్మకూరులో ఐఐటి జెఇఇ, నీట్ అకాడమీ ఏర్పాటు : మంత్రి లోకేష్
ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రతిభావంతులను తయారుచేసే కేంద్రాలుగా మారాలి!
మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పాలి
రెసిడెన్షియల్ విద్యార్థులకు ఎఐ స్కిల్లింగ్ తప్పనిసరి చేయాలి
రాష్ట్రవ్యాప్తంగా 10 ఏపీఆర్ విద్యాసంస్థలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లుగా అభివృద్ధి
ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ గవర్నింగ్ బాడీ సమావేశంలో విద్యా శాఖ మంత్రి లోకేష్
ఉండవల్లి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లలో అకడమిక్ ఎక్సలెన్స్ (విద్యాపరమైన ప్రతిభ)పై దృష్టి సారించాలని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులు, ఉపాధ్యాయులను కోరారు. ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (APREIS) 59వ గవర్నింగ్ బాడీ సమావేశం మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన ఉండవల్లి నివాసంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ…ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రతిభావంతులను తయారుచేసే కేంద్రాలుగా మారాలని ఆకాంక్షించారు. ఏపి రెసిడెన్షియల్ స్కూళ్లు అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ ఎక్సలెన్స్ పై దృష్టి సారించాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులతో తొలిసారి పత్రికా ప్రకటనలు ఇచ్చి సెలబ్రేట్ చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇప్పటివరకు ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యనభ్యసించిన వారిలో దాదాపుగా 27 మంది ఐఎఎస్, 20మంది ఐపిఎస్, 13మంది ఐఆర్ఎస్, నలుగురు ఐఎఫ్ఎస్ లుగా మరియు మరెంతో మంది సమాజంలో అత్యున్నత స్థానాల్లో సేవలందిస్తున్నారని అధికారులు చెప్పగా, మంత్రి లోకేష్ ఆనందం వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో 10 ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లుగా అభివృద్ధి చేసేందుకు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ (BoG) ఆమోదం తెలిపింది. (ఇప్పటికే తాడికొండ, కొడిగినహళ్లి పాఠశాలలు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లుగా ఉన్నాయి.) కృష్ణాజిల్లా నిమ్మకూరు ఎపిఆర్ జెసి కళాశాలలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఐఐటి-జెఇఇ/నీట్ అకాడమీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని 6 ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేయడానికి సమావేశం ఆమోదించింది. జగ్గంపేట నియోజకవర్గంలోని భూపతిపాలెం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ లో వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేసి, ఎడ్యుకేషన్ మరియు క్రీడా హబ్ గా తీర్చిదిద్దడానికి గల అవకాశాలను పరిశీలించాలని మంత్రి లోకేష్ సూచించారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది స్టాఫింగ్ ప్యాట్రన్ కు ఆమోదం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ పరంగా వేగవంతమైన మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఎపిఆర్ జెసి స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్స్, ఎఐ స్కిల్లింగ్ తప్పనిసరి చేయాలని మంత్రి ఆదేశించారు.
అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా రెసిడెన్షియల్ స్కూళ్లు ఉన్న ప్రాంతాల్లో ఇండస్ట్రీ డిమాండ్ కు అనుగుణంగా వృత్తివిద్యా కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ అందించాలని కోరారు. ఎపిఆర్ విద్యాసంస్థల్లో సర్వీసు రూల్స్ తయారీకి కమిటీ ఏర్పాటుచేయాలని బోర్డు నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎపిఆర్ విద్యాసంస్థల సిబ్బంది వయోపరిమితిని 60నుంచి 62సంవత్సరాలకు పెంచే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. గెస్ట్ ఫ్యాకల్టీ గౌరవ వేతనాలను ఇతర సొసైటీలతో సమానంగా అందజేసే ప్రతిపాదనను సైతం ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న పిఇటిలను పిడిలుగా అప్ గ్రేడ్ చేయడానికి బోర్డు ఆమోదించింది. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ తోపాటు అకడమిక్ అవుట్ కమ్స్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అన్ని స్కూళ్లలో క్రిటికల్ ఇన్ ఫ్రా, శాశ్వత భవనాల నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. ఎపిఆర్ విద్యాసంస్థల్లో విద్యార్థుల మెడికల్ ఎమర్జెన్సీ కోసం లక్షరూపాయలు వరకు ఖర్చుచేసే వెసలుబాటుకు సెక్రటరీకి కల్పిస్తూ సమావేశం ఆమోదం తెలిపింది. అన్నిఎపిఆర్ విద్యాసంస్థల్లో ఆటేమేటెడ్ స్మార్ట్ కిచెన్లను ఏర్పాటుచేసే ప్రతిపాదనలను సిద్ధం చేయాల్సిందిగా మంత్రి లోకేష్ ఆదేశించారు. ఈ సమావేశంలో మానవవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ రంజిత్ బాషా, ఉన్నత విద్య డైరక్టర్ నారాయణ భరత్ గుప్త, ఎస్ సిఇఆర్ టి డైరక్టర్ ఎంవి కృష్ణారెడ్డి, ఎపి విద్య, మౌలిక సదుపాయాల సంస్థ ఎండి దీవెన్ రెడ్డి, APREIS కార్యదర్శి కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్మీడియట్ మూల్యాంకన సిబ్బందికి రెమ్యునరేషన్ పెంపు
ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో పాల్గొన్న సిబ్బందికి భత్యాన్ని 25శాతం వరకు పెంచే ప్రతిపాదనకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పాలకవర్గం ఆమోదం తెలిపింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ 78వ పాలకవర్గ సమావేశం మంత్రి లోకేష్ అధ్యక్షతన ఉండవల్లిలో జరిగింది. అదేవిధంగా మూల్యాంకనంలో తీవ్రమైన తప్పిదాలకు పాల్పడే సిబ్బందిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది. ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలో 1978 నుంచి ఇప్పటివరకు జారీచేసిన సర్టిఫికెట్లన్నింటినీ డిజిటలైజ్ చేసి, బ్లాక్ చైన్ టెక్నాలజీతో అనుసంధానించాలని తీర్మానించారు. ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలో పనిచేసే సిబ్బందికి కూడా పదవీవిరమణ వయోపరిమితిని 60నుంచి 62సంవత్సరాలకు పెంచుతూ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ఇంటర్ పరీక్షల్లో థియరీ సబ్జెక్టులకు 32పేపర్ల జవాబు పత్రం అందించేందుకు సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జే.శ్యామలరావు, హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ పి.రంజిత్ బాషా, ఏపీ ఓపెన్ స్కూల్స్ సెక్రటరీ ఆర్.నర్సింహారావు, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ ఎస్.విజయభాస్కర్ రావు, ఆంధ్ర యూనివర్సిటీ వీసీ జీపీ రాజశేఖర్, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ పీవీ సత్యనారాయణ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వీసీ వి.ఉమ, ఇంటర్ బోర్డు ఎగ్జామినేషన్ కంట్రోలర్ ఏ.సైమన్ విక్టర్ పాల్గొన్నారు.








