దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ … ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం
ఆంధ్రప్రదేశ్‌లో షిప్‌బిల్డింగ్ రంగానికి భారీ ప్రోత్సాహం లభించనుంది. దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ (Greenfield Shipyard) ఏర్పాటు చేసేందుకు మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (ఎండిఎల్)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) సమక్షంలో సచివాలయంలో ఎండిఎల్ ( MDL), నేషనల్ షిప్‌బిల్డింగ్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ పార్క్-ఏపీ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది.
ప్రాజెక్టు కింద వచ్చే ఐదేళ్లలో ఎండిఎల్ సుమారు రూ.15 వేల కోట్లు పెట్టుబడి పెట్టేలా ప్రణాళిక రూపొందించారు. ఈ భారీ పెట్టుబడితో దుగరాజపట్నం ప్రాంతంలో షిప్‌బిల్డింగ్ కార్యకలాపాలు ఊపందుకునే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి సుమారు 45 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు అంచనా. షిప్‌యార్డ్ చుట్టూ మెరైన్ ఇంజినీరింగ్, లాజిస్టిక్స్, సర్వీసులు, ఇతర అనుబంధ పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దనరెడ్డి (BC Janardhan Reddy), ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ( Damacharla Satya), ఎండీఎల్ సీఎండీ కెప్టెన్ జగ్మోహన్, విశాఖ పోర్ట్ అథారిటీ చైర్పర్సన్ జస్మీత్‌సింగ్ బింద్రా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.








